Friday, March 29, 2024

పొట్టి శ్రీరాములుపై అక్షర సత్యాలు

- Advertisement -
- Advertisement -

పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటపటిమను, మద్రాసు నుంచి ఆంధ్రాను స్వతంత్ర రాష్ట్రంగా చెయ్యాలనే సంకల్పాన్ని డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు తన సంపాదకత్వంలో ఉద్దండ పండితులైన రచయితలు అందించిన అక్షర సత్యాలను ఆలు చిప్పలో ముత్యాల్లా పేర్చి అమూల్య గ్రంథాన్ని మనకి అందించారు. ఇలాంటి త్యాగధనుల జీవిత చరిత్రలు చదవటం అంటే నాకు ఎంతో ఇష్టం. ఇష్టంమే కాదు చదివి అందరికీ ప్రేరణ కలిగిస్తాను. అలాగే ఈ తరం పిల్లలు ఇంత గొప్ప త్యాగమూర్తుల చారిత్రక అంశాల సంకలనాలు తప్పక చదివి ప్రేరణ చెందితే భారతమాత ముద్దుబిడ్డలుగా ఆకాశమంత ఎత్తు ఎదిగితే భారతమాత కూడా మువ్వన్నెల జెండా రెపరెపల్ని నలుదిశలా వ్యాపింప చేస్తుంది.

ఈ పుస్తక సంపాదకులు ‘ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, చారిత్రక అంశాలు, సామాజిక అంశాలు, సైన్స్ ఫిక్షన్, పర్యావరణం, స్వాతంత్ర పోరాటాలు…‘ ఇలా ఏ అంశం తీసుకున్న కూడా అన్నింటినీ కూలంకషంగా పరిశీలించి, పరిశోధించి చక్కని సంకలనాన్ని అందించారు. ‘మొదటగా పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసింది ఎందుకు?‘ వ్యాసంల్లో ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు రాజధానిగా ఉండాలన్న ఎజెండాతో ఇంకా శ్రీరాములు గారి జీవిత విశేషాలతో వైయస్ శాస్త్రి, బొమ్మ కంటి శ్రీనివాసచార్యుల వారు ఈ వ్యాసంలో పొందుపరిచిన వైనాన్ని నాగసూరి వేణుగోపాల్ గారు చాలా చక్కగా తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో ఉండే గురవయ్య, మహాలక్ష్మి దంపతులు మద్రాసు వలస వచ్చారు. అక్కడ శ్రీరాములు గారు జన్మించారు. చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో తల్లి కష్టపడి కొడుకును ఇంజనీరింగు, డిప్లమా చదివించారు. గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై దేశ సేవ చేయాలనుకున్నారు. చిన్న వయసులోనే భార్య కుమారుని కూడా పోగొట్టుకున్నారు. అయినా మొక్కవోని ధైర్యంతో గాంధీజీతో కలిసి దేశ సేవ చేయాలనుకున్నారు. హరిజనులు దేవాలయం ప్రవేశం కోసం అవిరళ కృషి చేశారు. తెలుగు వాళ్లకి ప్రత్యేక రాష్ట్రం లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పి శ్రీరాములు 1952 అక్టోబరు 19న దీక్ష ప్రారంభించి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారు. కానీ 40 శాతం మంది తెలుగువారు మద్రాస్ నగరంలో ఉండిపోవడంతో వారికి అన్యాయం జరిగిందని రచయిత ఒకింత బాధపడడం పై వేణుగోపాల్ గారు సవివరంగా తెలియజేశారు.

‘గాందేయవాది పొట్టి శ్రీరాములు చూపిన బాట‘ వ్యాసంలో సంపాదకులు నాగ సూరి వేణుగోపాల్ గారు శ్రీరాములు గారి పర్సనాలిటీని, వేషధారణని, వాడే కొటేషన్స్ అంటే పరిజనులపై చూపించే మమకారాన్ని అద్దంలో ప్రతిబింబంలా చాలా చక్కగా చెప్పారు. ఇంకా గాంధీ గారిని అనుసరించే వారిని వారికి వాక్చాతుర్యం కానీ, లౌక్యం కాని, ఇంకా చక్కని రూపం లేకపోవడంతో ప్రజల దృష్టిని ఆకర్షించలేకపోయారని సంపాదకులు చెప్పారు. పార్టీ కూడా శ్రీరాములు గారి ఆదర్శాన్ని గుర్తించలేదని ఆచార్య పిసి రెడ్డిగారు చెప్పేవారిని సంపాదకులు చెప్పారు. అలాగే గాందేయవాదిగా శ్రీరాములు గారి మనోగతాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు. ఓసారి ఆశ్రమంలో ఒక పాము కనిపిస్తే ఓ యువకుడు దాన్ని రాయితో కొడితే రెండుగా చీలింది. అది చూసి దాన్ని పూర్తిగా చంపమన్నారు. ఆ విషయం గాంధీజీకి ఫిర్యాదు చేస్తే అప్పుడు ఈ చర్య అహింసా వ్రతానికి అనుకూలమైందని అర్థం చేసుకున్న వైనాన్ని కూడా కూలంకుషంగా చెప్పారు. అలాగే పొట్టి శ్రీరాములు గారి జీవితం ‘ఒక అనుక్షణం సమరం /ఒక అవిరళ కష్టగాధ /ఒక మహత్తర త్యాగ గీతం /ఒక అపూర్వం ప్రేమ పుష్పాంజలి/ ఇంకా కరుణార్థ కావ్యం/…‘అంటూ బులుసు వెంకటేశ్వరరావు గారు అభివర్నించిన తీరుని సంపాదకులు ఈ వ్యాసంలో అద్భుతంగా పొందుపరిచారు. ‘వలస వచ్చిన కుటుంబం… చదువు‘ వ్యాసంలో తల్లిదండ్రులు మద్రాసు వెళ్లిన తరువాత వీరి పుట్టుక, చదువు కోసం పడ్డ కష్టాలు తల్లి కస్టించి చదివించిన తీరుని చక్కగా చెప్పారు రచయిత.

‘ఆశ్రమాలు, అనుభవాలు‘ వ్యాసంలో శ్రీరాములు గారు భార్యా పిల్లలు కూడా చనిపోవడంతో ఒకింత బాధకి గురై ఆశ్రమ బాట పట్టారు. అక్కడ గాంధీజీతో పాటు స్వతంత్య్ర సమరంలో పాలుపంచుకొని ఆ అనుభవంతో ప్రత్యేక ఆంధ్రా కోసం అవిశ్రాంతంగా పోరాటం సాగించారు. ‘సేవా కార్యక్రమాలు‘ వ్యాసంలో 1933లో సత్యాగ్రహ ఉద్యమంలో ఆశ్రమ వాసులు 34 మంది అరెస్టు అయ్యారు. వారిలో శ్రీరాములు గారు కూడా ఉన్నారు. ఈ బృందాన్ని జైలు నుంచి విడుదల చేశారు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా గాంధీజీనే 1934లో సంభవించిన భూకంప బాధితులకు సహాయం చేయమన్నారు. దాంతో అక్కడ నిరాశ్రయులైన వారందరికీ స్వాంతన వచనాలతో ఓదార్చి కన్న బిడ్డల్లా అక్కున చేర్చుకుని ప్రేమపూర్వకమైన సేవలు uఅందించారు శ్రీరాములు గారు.

‘నిరాహార దీక్ష‘ వ్యాసంలో నాలుగు దశాబ్దాలుగా ఎంతో మంది ఆంధ్ర రాష్ట్ర సిద్ధికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో శ్రీరాములుగారే రంగంలోకి దిగి 1952 అక్టోబర్ 19న ఉదయం 10 గంటల నుంచి మద్రాసులో డాక్టర్ల పర్యవేక్షణలో నిరాహార దీక్ష ప్రారంభించారు. బులుసు సాంబమూర్తి గారు శ్రీరాములు గారి దీక్షకు శ్రీరామరక్షగా నిలబడ్డారు. కఠోర నియమాలతో, మహోన్నత ఆశయ సాధన కోసం యజ్ఞంలా దీక్ష చేసి ఒక ఆదర్శం కోసం చివరికి కన్నుమూశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చిందని చెప్తూ వ్యాస రచయిత శ్రీరాములు గారి ప్రాణత్యాగాన్ని తెలియజేశారు. శ్రీరాములు గారి త్యాగం ఫలితంగా వచ్చిన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారి సేవలు, ఇంకా అమరజీవి యొక్క ఆశయసిద్దితో భారతదేశంలో ఎన్నో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తీరుతెన్నుల్ని చాలా అద్భుతంగా పొందుపరిచారు సంపాదకులు నాగసూరి వేణుగోపాల్ గారు. చివరిగా వేణుగోపాల్ గారు ‘అమరజీవి ఆత్మ బలిదానం‘ వ్యాసంలో దీని అర్థం ఏమిటని ప్రశ్నిస్తూనే ప్రజలు, ప్రభుత్వాలు, నాయకులు అందరూ కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి చేయాలంటారు.

శ్రీరాములుగారు ప్రాణాలు కోల్పోయింది మద్రాసు నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కోసమేనన్న విషయం మరుగున పడిపోయిందని చెప్తూ ఇప్పుడైనా చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు వ్యాస రచయిత. వీరి జీవన చిత్రాన్ని ఆవిష్కరిస్తూ కరువు కష్టాల్ని చవిచూచిన వీరు ఎన్నో జీవన పాఠాల్ని నేర్చుకున్నారన్నారు. 7ఇంకా ఈ వ్యాస సంకలనంలో ‘పూర్ణాహుతి, గాంధీ స్మారకనిది సంచాలక పదవి, జాతీయ పార్టీల తిలోదకాలు, ఆశారేఖలు, ప్రజల కోరింది…‘ లాంటి వ్యాసాలు చాలా చక్కటి చారిత్రక అంశాలతో కూడి అందరినీ అలరిస్తాయి. అమరజీవి బలిదానం చారిత్రక అంశాల సంకలనం ప్రతి లైబ్రరీలో తప్పక ఉండాల్సిన ప్రతి విద్యార్థి తప్పక చదవాల్సిన పుస్తకం. వేణుగోపాల్ గారు శ్రీరాములు గారి పై భూదేవంత అభిమానాన్ని కురిపిస్తూ వారి త్యాగనిరతికి ఆకాశమంత పందిరి వేసి ఇంత చక్కటి చారిత్రక అంశాలతో కూడిన ‘అమరజీవి బలిదానం‘పొట్టి శ్రీరాములు పోరాట గాధ సంకలనాన్ని పాఠక ప్రపంచానికి అందించిన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారికి అభినందన మందారమాలలు, వందనాలు.
ప్రతులకు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, బ్రాహ్మణవాడి, బేగంపేట హైదరాబాద్. ఫోన్ నెం.9449732392, వెల – 200/- రూపాయలు.

పింగళి భాగ్యలక్ష్మి
9704725609

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News