Thursday, March 28, 2024

పొట్టి వీరయ్య కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Potti Veeraya Passes away

ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. రెండు అడుగుల ఎత్తు ఉండడంతో అతన్ని అందరూ పొట్టి వీరయ్య అని పిలిచేవారు. అదే ఆయనకు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. నటుడిగా పొట్టి వీరయ్య 400లకు పై చిత్రాల్లో నటించారు. నాటి స్టార్లు ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజిఆర్, శివాజీగణేశన్ లాంటి మహానటులతో కలిసి సినిమాలు చేశారు.

పొట్టి వీరయ్యది నల్లొండ జిల్లా తిరుమలగిరి తాలుకాలోని ఫణిగిరి గ్రామం. అతని తల్లిదండ్రులు గట్టు నరసమ్మ, గట్టు సింహాద్రయ్య. వాళ్లకు వీరయ్య రెండో సంతానం. ఇతనికి ఒక అక్కయ్య ఉంది. ఆమె సాధారణంగానే జన్మించింది. పొట్టి వీరయ్య మద్రాస్‌కు వెళ్లి నాటి జానపద దర్శకుడు విఠలాచార్యని కలిశాక ఇతని ఆకారం ఆయనకు నచ్చి తన సినిమాలలో పలు అవకాశాలు కల్పించారు. విఠలాచార్య చిత్రం ‘అగ్గివీరుడు’తో సినీ రంగ ప్రవేశం చేశారు పొట్టి వీరయ్య. ఈ చిత్రంలో కాంతారావు, భారతి హీరోహీరోయిన్లు. 1967లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఆతర్వాత ఎన్టీఆర్, కాంతారావు, కృష్ణ, నరసింహారావు వంటి హీరోలతో వీరపూజ, జగన్మోహిని, మహాబలుడు, అగ్గి మీద గుగ్గిలం, రాజసింహ, గండర గండడు, సుగుణ సుందరి కథ వంటి విజయవంతమైన జానపద చిత్రాల్లో నటించారు పొట్టి వీరయ్య.

దాసరి చిత్రాల్లో…

సినీ పరిశ్రమలో విఠలాచార్య తర్వాత దర్శకుడు దాసరి నారాయణరావు వీరయ్యను బాగా ప్రోత్సహించారు. దాసరి తొలి సినిమా ‘తాతా మనవడు’లో గుమ్మడితో కలిసి నటించారు పొట్టి వీరయ్య. దాసరి దర్శకత్వంలో వచ్చిన రాధమ్మపెళ్లి చిత్రంలో హిజ్రాగా నటించారు. అదేవిధంగా సంసారం సాగరం, దేవుడే దిగివస్తే వంటి చిత్రాల్లో నటించారు. ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో గజదొంగ, యమదొంగ, కొండవీటి రాజా చిత్రాల్లో నటించారు పొట్టివీరయ్య. మహానటి సావిత్రి స్వయంగా నిర్మించి నటించిన ‘చిన్నారి పాపలు’ చిత్రంలో కూడా ఆయన నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించిన పొట్టి వీరయ్య ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

కుటుంబ జీవితం…

1974లో పొట్టి వీరయ్య వివాహం మల్లికతో జరిగింది. వీరికి విమల, విజయదుర్గ అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. విజయదుర్గ సినిమాలు, నాటకాల్లో నటించింది. ఇక పొట్టి వీరయ్య సతీమణి మల్లిక 2008లో మృతిచెందారు.

సిఎం కెసిఆర్ సంతాపం…

ప్రముఖ సినీ హాస్య నటుడు పొట్టి వీరయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. విఠలాచార్య కాలం నుండి నేటి వరకు పలు భాషల్లోని దాదాపు 500 సినిమాల్లో నటించిన సూర్యాపేట జిల్లా ఫణిగిరికి చెందిన గట్టు వీరయ్య, తెలుగు సినీ ప్రేక్షకులను తన నటనతో అమితంగా అలరించారని సిఎం గుర్తు చేసుకున్నారు. వీరయ్య కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News