Friday, March 29, 2024

తండ్రిని మించిన తనయుడు ప్రభాస్‌: కృష్ణంరాజు

- Advertisement -
- Advertisement -

Prabhas

 

దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించి సినీప్రియుల మదిలో రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు కృష్ణంరాజు. నిర్మాతగానూ పదుల సంఖ్యలో హిట్ చిత్రాలు నిర్మించి తన అభిరుచిని చాటుకున్న ఆయన ఈనెల 20న తన 80వ పుట్టిన రోజును జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా రెండు రోజుల ముందుగానే శనివారం హైదరాబాద్‌లోని ఎఫ్‌ఎన్‌సిసిలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో బర్త్‌డే సెలబ్రేషన్స్ జరిగాయి. సతీసమేతంగా హాజరైన కృష్ణంరాజు కేక్ కట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ “మా నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్‌కు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది.

ఈ బ్యానర్‌లో అనేక గొప్ప సినిమాలను నిర్మించి, నటించాను. బొబ్బిలి బ్రహ్మన్న, కృష్ణవేణి, అమర దీపం, మన ఊరి పాండవులు వంటి చిత్రాలు చేశాను. ‘తాండ్రపాపారాయుడు’ చిత్ర సమయంలో ఐదువేల మందితో యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించాం. క్లిష్ట పరిస్థితుల్లో అంత మందితో చిత్రీకరించడంతో నా బలం, నాలోని శక్తి ఏంటో తెలిసింది. అది చూసి ఎంతో ఆనంద పడ్డాను. మా సంస్థ నుంచి ఓ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలుంటాయి. ఇప్పుడు మా నుంచి రాబోతున్న ప్రభాస్ కొత్త చిత్రాన్ని ఈ అంచనాలకు తగ్గట్లుగానే రూపొందిస్తున్నాం. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఇప్పటికే యూరప్‌లో ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. మరో మూడు నెలల పాటు ఇక్కడే చిత్రీకరణ ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో విదేశాల్లో చిత్రీకరణకు వెళ్తాం. ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవి నాటికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నాం. గురువును మించిన శిష్యుడు.. తండ్రిని మించిన తనయుడు అంటుంటారు కదా. ప్రభాస్ కూడా అలాంటి వాడే. నేను హీరోగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ సీమల్లో గుర్తింపు తెచ్చుకున్నా. కానీ ప్రభాస్ ఏకంగా దేశవ్యాప్తంగానే కాక ప్రపంచ దేశాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని, అభిమాన గణాన్ని సృష్టించుకున్నాడు. ఇక నేనూ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నా”అని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ కృష్ణంరాజుని ప్రత్యేకంగా సత్కరించింది. అసోసియేషన్‌కి తన వంతు సహకారం అందిస్తామని కృష్ణంరాజు హామీ ఇచ్చారు.

 

Prabhas is his son beyond his father
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News