Home జాతీయ వార్తలు సివిల్స్‌లో తెలంగాణ తేజాలు

సివిల్స్‌లో తెలంగాణ తేజాలు

Pradeep Singh topper in UPSC civil services exam

 

హర్యానా, ఢిల్లీ, యుపి వాసులకు మొదటి మూడు ర్యాంకులు
సివిల్ సర్వీసులకు ఎంపికైన 829 మంది
రిజర్వ్ జాబితాలో మరో 189 మంది
11 మంది అభ్యర్థుల ఫలితాలు విత్‌హెల్డ్

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక 2019 సివిల్ సర్వీసు పరీక్షలలో విజయం సాధించిన 829 మంది అభ్యర్థులలో ఐఆర్‌ఎస్ అధికారి ప్రదీప్ సింగ్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. 2019 సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన పరీక్షలలో ఐఎఎస్, ఐపిఎస్‌తోసహా వివిధ సివిల్ సర్వీసులకు అర్హత సంపాదించుకున్న అభ్యర్థుల జాబితాను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్‌సి) మంగళవారం ప్రకటించింది. సివిల్ సర్వీసెస్‌కు తొలి మూడు టాప్ ర్యాంకర్లుగా ప్రదీప్ సింగ్‌తోపాటు వరుసగా జతిన్ కిషోర్, ప్రతిభా వర్మ నిలిచారు. వీరు ముగ్గురూ ప్రస్తుతం ప్రభుత్వ సర్వీసులో ఉన్నారు. ప్రదీప్ సింగ్ హర్యానాకు చెందిన వారు కాగా కిషోర్ ఢిల్లీకి, ప్రతిభా వర్మ ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన వారు.

ఐఎఎస్ అధికారి కావాలన్నది తన చిరకాల స్వప్నమని, ఇప్పుడా కల నిజమైందని, ఇది తనకు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిందని 29 సంవత్సరాల ప్రదీప్ సింగ్ తెలిపారు. 2019 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్(కస్టమ్స్, సెంట్రల్ ఎక్సయిజ్) అధికారిగా ఆయన ఫరీదాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్‌లో ప్రొబేషన్‌లో ఉన్నారు. ఐఎఎస్ అధికారిగా ఎంపికైన తాను విద్య, వ్యవసాయ రంగాలను మెరుగుపరచడమే తన ఆశయమని చెప్పారు. తన సొంత రాష్ట్రమైన హర్యానాను కేడర్ రాష్ట్రంగా ఎంపిక చేసుకున్నానని, ఇప్పుడు తన స్వరాష్ట్రంలో పనిచేసే అవకాశం దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. ఇక రెండవ ర్యాంక్ సాధించిన జతిన్ కిషోర్ 2018 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఎకనామిక్స్ సర్వీస్(ఐఇఎస్)కు చెందిన అధికారి. ప్రస్తుతం ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖలో సహాయ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

సివిల్ సర్వీస్ పరీక్షలో ఇది తన రెండవ ప్రయత్నమని, రెండవ ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని 26 ఏళ్ల జతిన్ కిషోర్ అన్నారు. విద్య, పర్యావరణంపై దృష్టి సారిస్తానని ఆయన చెప్పారు. ఇక మూడవ ర్యాంకు సాధించిన ప్రతిభా వర్మ ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఆదాయం పన్ను) అధికారిగా ఉన్నారు. ఐఎఎస్ కావాలన్నది తాను తన చిరకాల వాంఛగా ఆమె తెలిపారు. సంక్షోభ సమయాలలో మొదటిగా స్పందించేది ఐఎఎస్ అధికారేనని, దీన్నే తాను స్ఫూర్తిగా తీసుకుని ఆయన చెప్పారు. క్లిష్ట పరిస్థితులలో ముందుండి పరిస్థితిని చక్కదిద్దే ఐఎఎస్ అధికారులనే ఆదర్శంగా తీసుకుని సివిల్ సర్వీసెస్‌కు మళ్లీ సిద్ధమయ్యాయని గతంలో ఐఆర్‌ఎస్ సాధించిన వర్మ చెప్పారు. తన సొంత రాష్ట్రం యుపిలో మహిళా సాధికారత, పిల్లలకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారిస్తానని ఆమె తెలిపారు.

2019 సివిల్ సర్వీసెస్‌కు మొత్తం 829 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు యుపిఎఎస్‌సి తెలిపింది. వీరు ఐఎఎస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపిఎస్), తదితర ఇతర సివిల్ సర్వీసులకు అర్హత సాధించారు. వీరిలో 304 మంది జనరల్ క్యాటగిరికి చెందిన వారు కాగా 78 మంది ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఇడబ్లుస్), 251 మంది ఇతర వెనుకబడిన కులాలకు(ఓబిసి), 129 మంది షెడ్యూల్డ్ కులాలకు(ఎస్‌సి), 67 మంది షెడ్యూల్డ్ తెగలకు(ఎస్‌టి) చెందిన వారని యుపిఎస్‌సి తెలిపింది. మరో 182 మంది అభ్యర్థులను రిజర్వ్ లిస్టులో ఉంచామని, 11 మంది అభ్యర్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టామని యుపిఎస్‌సి తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన 927 ఖాళీలకు సంబంధించి ఎంపిక జరిగింది.

మూడు దశలుగా సివిల్ సర్వీసెస్ పరీక్షలను యుపిఎస్‌సి నిర్వహిస్తుంది. అవి ప్రిలిమనరీ, మెయిన్, ఇంటర్వూ రూపంలో ఉంటాయి. ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ సాధించేందుకు లక్షలాది మంది అభ్యర్థులు హాజరవుతుంటారు. అభ్యర్థులు తమ పరీక్షలకు లేదా నియామకానికి సంబంధించిన ఎటువంటి సమాచారం కోసమైనా పనిదినాలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నేరుగా కాని లేక టెలిఫోన్ నంబర్లు. 011-23385271, 23381125, 23098543 సంప్రదించవచ్చని యుపిఎస్‌సి సూచించింది.

Pradeep Singh topper in UPSC civil services exam