Home తాజా వార్తలు నాలుగేళ్లలో కనీవినీ ఎరుగని అభివృద్ధి

నాలుగేళ్లలో కనీవినీ ఎరుగని అభివృద్ధి

బీరు, బిర్యాని పంచడం తప్ప కాంగ్రెస్ నేతలకు మరోటి తెలియదు
ఎన్నికలకు ముందే అస్త్రసన్యాసం చేసిన కాంగ్రెస్ : మంత్రి కెటిఆర్

KTR

మన తెలంగాణ/హైదరాబాద్ : ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో ఎందరో ముఖ్యమంత్రులను చూశాం కాని మన ముఖ్యమంత్రి కెసిఆర్ వంటి సిఎంను చూడలేదని మంత్రి కెటి.రామారావు వ్యాఖ్యానించారు. ప్రగతి నివేదన సభ దగ్గర ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో ఇంతకుముందెన్నడు కనీవినీ ఎరుగని అభివృద్ధిని మన ముఖ్యమంత్రి చేశారన్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిది కాకి గోల అన్నారు.

సభలోని రాజకీయ అంశాలపై స్పందించాలే తప్ప ఖర్చుల గురించి మాట్లాడడం సరికాదన్నారు. ముందస్తుపై కాంగ్రెస్ నేతలు తలా ఒక మాట మాట్లాడడాన్నిబట్టి చూస్తే యుద్ధానికి ముందే వారు అస్త్ర సన్యాసం చేసినట్లు కనపడుతోందన్నారు. టిఆర్‌ఎస్‌కు క్రియాశీల కార్యకర్తలే 46 లక్షల మంది ఉన్నారని, వీరిలో సగం మంది వచ్చినా ఈ సభ విజయవంతమైనట్లేనని అన్నారు. కాంగ్రెస్ నేతలు దీన్ని గుర్తుంచు కోవాలని, బీరు, బిర్యానీ డబ్బులు పంచడంతప్ప వారికి మరో ధ్యాసే లేదని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ భావ దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతోందన్నారు. గెలుపు, ఓటములపై చౌక బారు విమర్శలు చేయడమెందుకని, ప్రజల వద్దకే వెళ్లి తేల్చుకుందాం రండని కెటిఆర్ సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల చెంతకు, ప్రజల కోసమని, ఎన్నికలెప్పుడు వచ్చినా గెలుపు తమదేనని ఆయన ధీమా వ్యక్తంచేశారు. ముందస్తుపై తామింత ధీమాగా ఉంటే కాంగ్రెస్ మాత్రం పారిపోతోందని ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ కెసిఆర్ పాలన
 టిఆర్‌సి ఏపి అభిమాని కొణిజేటి ఆదినారాయణ

తెలంగాణలో గడిచిన నాలుగున్నరేళ్ల కెసిఆర్ పాలన చూసి ఆంధ్రప్రదేశ్‌లోనూ చాలా మంది ఆయన పాలన కోరుకుంటున్నారని ఏపి నుంచి వచ్చిన టిఆర్‌ఎస్ అభిమాని కొణిజేటి ఆదినారాయణ తెలిపారు. ప్రగతి నివేదన సభ దగ్గర ఆదివారం ‘మనతెలంగాణ’ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ ఏపి నుంచి స్వచ్ఛందంగా 50 మంది కెసిఆర్ అభిమానులం ఈ సభకు ముందుగానే వచ్చి ఏర్పాట్లలో పాల్గొన్నామని తెలిపారు. దాదాపు ఆరు వేల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి టిఆర్‌ఎస్ అభిమానులు సభకు వస్తున్నారన్నారు. అందరం స్వంత ఖర్చుతోనే వచ్చామని, కెసిఆర్ అనుమతిస్తే ఏపిలోనూ టిఆర్‌ఎస్ శాఖను ఏర్పాటుచేస్తామన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు, అవనిగడ్డ, నూజివీడు తదితర ప్రాంతాల నుంచి యాభై మంది కార్యకర్తలు రెండు రోజుల ముందే హైదరాబాద్‌కు చేరుకుని సభా ఏర్పాట్లలో పాలుపంచుకున్నట్లు తెలిపారు.

టిఆర్‌ఎస్‌లోకి కాంగ్రెస్ బడా నేతలు : దానం నాగేందర్

కాంగ్రెస్ నుంచి టిఆర్‌ఎస్‌లో చేరేందుకు బడా నేతలే సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, టిఆర్‌ఎస్ నేత దానం నాగేందర్ తెలిపారు. ఆదివారం సభాప్రాంగణం వద్ద మాట్లాడుతూ కాంగ్రెస్‌కు చెందిన పెద్ద తలకాయలే టిఆర్‌ఎస్‌లోకి చేరుతాయని, వారి జాబితా రెండు,మూడు రోజుల్లో బయటపెడతానని చెప్పారు. ఈ జాబితా చూసాక కాంగ్రెస్‌కు దిమ్మ తిరగడం ఖాయమన్నారు. గాంధీ భవన్‌లో ప్రతిరోజు గొడవలతో శృతి లేని సంసారం సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తానన్నారు. ప్రగతి నివేదన సభకు కోట్లు ఖర్చు పెడుతున్నామనడం సరికాదని కాంగ్రెస్ నేతలకు డబ్బు యావ తప్ప మరోటి లేదన్నారు.