Friday, March 29, 2024

మాది కోపంతో పుట్టిన ప్యానల్ కాదు… ఆవేదనతో పుట్టింది

- Advertisement -
- Advertisement -

Prakash Raj, Panel Members Media Conference in Hyderabad

సెప్టెంబర్‌లో జరుగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్నారు ప్రకాష్‌రాజ్. ఈ నేపథ్యంలో ఆయన గురువారం తన ప్యానల్ సభ్యులను ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం ప్రకాష్‌రాజ్, ప్యానల్ సభ్యులు హైదరాబాద్‌లోని మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ “మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనేది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. రెండేళ్ల నుంచే ఆలోచిస్తున్నాను. గడిచిన ఏడాది కాలం నుంచి ప్యానల్‌లో ఎవరినీ తీసుకోవాలి? చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ఇక మాది సినిమా బిడ్డల ప్యానల్. పదవీ కోసం కాకుండా పని చేయడం కోసం పోటీ చేస్తున్నాం. నా ప్యానల్‌లో ఉన్నవారంతా తప్పు జరిగితే ప్రశ్నించేవాళ్లే. నేను తప్పు చేసినా బయటికి పంపేవాళ్లు నా ప్యానల్‌లో ఉన్నారు. చిరంజీవి, కృష్ణంరాజు, మోహన్‌బాబు, నాగార్జున.. ఇలా ప్రతి ఒక్కరూ అసోసియేషన్‌ని అభివృద్థి చేయాలనే ఆలోచిస్తున్నారు.

ఇక ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా లోకల్, నాన్‌లోకల్ అని వింటున్నాను. కళాకారులు లోకల్ కాదు యూనివర్సల్. కళాకారులు వెలుగులాంటి వాళ్లు. భాషతో వాళ్లకు సంబంధం ఉండదు. నా అసిస్టెంట్స్‌కి ఇళ్లు కొని ఇచ్చినప్పుడు నాన్‌లోకల్ అనలేదు. రెండు గ్రామాలు దత్తత తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు. తొమ్మిది నందులు తీసుకున్నప్పుడు, జాతీయ అవార్డు పొందినప్పుడు నాన్‌లోకల్ అనలేదు. అలాంటిది ఇప్పుడు ఎలా నాన్‌లోకల్ అంటున్నారు. ఇది చాలా సంకుచితమైన మనస్తత్వం. ఇక మాది కోపంతో పుట్టిన ప్యానల్ కాదు… ఆవేదనతో పుట్టింది. నేను అడిగానని కాదు.. అర్హత చూసి ఓటు వేయండి. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉంది. ‘మా’ భవనం ఎలా నిర్మిస్తాం.. ఇతర ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి… అన్నీ క్లారిటీగా వివరిస్తాం”అని అన్నారు. నాగబాబు మాట్లాడుతూ “ప్రకాశ్‌రాజ్‌కు అన్ని చిత్రపరిశ్రమలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరితో ఆయనకు మంచి అనుబంధాలున్నాయి. నటీనటులందరితో చక్కగా మాట్లాడగలిగే వ్యక్తి ఆయన.

గడిచిన కొంతకాలం నుంచి ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి నాకెంతో ముచ్చటగా అనిపించింది. ప్రకాశ్‌రాజ్ తెలంగాణాలో మూడు గ్రామాలను దత్తత తీసుకుని తెలుగువాడిగా సెటిల్ అయిన వ్యక్తి. లోకల్ నాన్‌లోకల్ అనేది అర్థరహిత వాదన. ‘మా’లో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో ఏ పదవికోసమైనా పోటీ చేసే హక్కు ఉంది. ఇక అన్నయ్య చిరంజీవి ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయి. ప్రకాశ్‌రాజ్ ప్లానింగ్ గురించి అన్నయ్యతో చెప్పినప్పుడు.. ‘ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నేను సపోర్ట్ చేస్తాను’ అని అన్నారు. నిజం చెప్పాలంటే.. నాలుగేళ్ల నుంచి అసోసియేషన్ మసకబారింది. బయట అసోసియేషన్ గౌరవం తగ్గింది. అసోసియేషన్ స్థితిగతులు తప్పకుండా మార్చుతాం”అని తెలిపారు. బండ్ల గణేష్ మాట్లాడుతూ “ప్రకాష్‌రాజ్ షాద్‌నగర్‌కు సమీపంలో ఉన్న కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామంలో అవసరమైన వసతులు ఏర్పాటు చేస్తున్నారు.

కరోనా సమయంలో ఎంతోమంది వలస కార్మికులకు తన ఫామ్‌హౌస్‌లో మూడు నెలలు ఆశ్రయం కల్పించి.. అన్నిరకాల వసతులు ఏర్పాటు చేసి.. బస్సుల ద్వారా వాళ్లని స్వగ్రామాలకు పంపించారు. ఆయనలో ఉన్న గొప్ప వ్యక్తిత్వానికి అది కూడా ఒక నిదర్శ నం. ఇక సినిమా పరిశ్రమలో లోకల్, నాన్ లోకల్ అన్న భేదాలు లేవు. వర్గ పోరాటాలు, కుల రాజకీయాలు మా మధ్య లేవు. పాత, కొత్త అందరి అనుభవా లు, సూచనలు తీసుకుని ప్రకాశ్ ముందుకెళ్తారని నమ్ముతున్నాం. 27 ఏళ్ళ తర్వాత ’మా’కు బిల్డింగ్ రాబోతుంది. గతంలో జరిగిన వాటిని మేం వేలెత్తి చూపించం. అందరం కలిసి పనిచేస్తాం” అని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News