Home జాతీయ వార్తలు అత్యంత విషమం

అత్యంత విషమం

 కరోనా, బ్రెయిన్ సర్జరీతో క్రిటికల్
 వెంటిలేటర్లపై చికిత్స కొనసాగింపు
 కోలుకోవాలని పలువురి ఆకాంక్షలు

Pranab Mukherjee health condition has Worsened

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, వయోవృద్ధ నేత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆయనకు కీలక ఆపరేషన్ తరువాత కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స నిర్వహిస్తున్నట్లు స్థానిక సైనిక ఆర్ అండ్ ఆర్ ఆసుపత్రి అధికారులు మంగళవారం తెలిపారు. ఒక్కరోజు క్రితమే ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఇప్పుడు 84 ఏండ్ల ప్రణబ్ దా పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని అధికారికంగా వెల్లడైంది. ఆయనకు తీవ్ర అస్వస్థత నెలకొనడం, కోవిడ్ లక్షణాలు కూడా నిర్థారణ కావడంతో వెంటనే సోమవారం ఇక్కడి మిలిటరీ హాస్పిటల్‌లో చేర్పించారు. తరువాత వెంటనే బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆయనను చాలా క్లిష్ట ఆరోగ్య పరిస్థితి ఉన్నప్పుడే ఆసుపత్రిలో చేర్పించారని, తరువాతి వైద్య పరీక్షలలో కరోనా సోకినట్లు నిర్థారణ అయిందని, అంతేకాకుండా భారీ స్థాయిలో మెదడులో రక్తనాళాలు గడ్డకట్టినట్లు గుర్తించామని ఆసుపత్రి యాజమాన్యం ఓ వైద్య ప్రకటనలో తెలిపింది. అత్యవసరంగా బ్రెయిన్ సర్జరీ చేయాల్సి వచ్చింది. వివిధ విభాగాలలో ఆరితేరిన వైద్య సిబ్బంది అనుక్షణ పర్యవేక్షణలో మాజీ రాష్ట్రపతికి చికిత్స జరుగుతోందని ప్రకటనలో వివరించారు. తనకు కోవిడ్ 19 సోకిందని, తనను కలుసుకునేందుకు ఎవరూ రావద్దని సోమవారం ప్రణబ్ ట్వీట్ వెలువరించారు. అంతేకాకుండా తన వద్దకు గత వారం రోజుల క్రితం వరకూ వచ్చిన వారు అంతా కోవిడ్ పరీక్షలు చేసుకోవాలని కోరారు.

అంతేకాకుండా, వారంతా కూడా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించారు. తగు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. సీనియర్ నేత, ఆర్థికవేత్త అయిన ప్రణబ్ త్వరితగతిన కోలుకోవాలని పలు వర్గాల నుంచి ఆకాంక్షలు వ్యక్తం అవుతున్నాయి. ఎందరో నేతలు ఈ మేరకు ట్వీట్లు వెలువరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇప్పటికే ప్రణబ్ కూతురు షర్మిష్ట ముఖర్జీతో ఫోన్‌లో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హుటాహుటిన స్థానిక ఆర్ అండ్ ఆర్ హాస్పిటల్‌కు వెళ్లారు. మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అక్కడ దాదాపు 20 నిమిషాలు ఉన్న రక్షణ మంత్రి తక్షణ, సమగ్ర చికిత్సకు ఆదేశాలు వెలువరించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెలువరించిన ట్వీటులో ప్రణబ్ త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. సమర్థవంతమైన నేత, అత్యద్భుత వక్త, పండితుడు అయిన ముఖర్జీ కాంగ్రెస్ పార్టీలో దిగ్గజ స్థానం పోషించారు. కాంగ్రెస్ పార్టీకి 13వ అధ్యక్షులుగా వ్యవహరించారు. 2012 జులై నుంచి 2017 వరకూ ఆయన పార్టీకి విశేష సేవలు అందించారు. నెహ్రూ గాంధీయేతర కుటుంబానికి చెందిన ఓ నేత పార్టీ పగ్గాలు అత్యంత సమర్ధవంతంగా ఎటువంటి అసమ్మతికి తావివ్వకుండా నిర్వహించడం, కాంగ్రెస్ రథాన్ని ముందుకు సాగించడం కీలక పరిణామం.

Pranab Mukherjee health condition has Worsened