Home తాజా వార్తలు వికీపీడియలో రికార్డు సృష్టించిన మోత్కూర్ యువకుడు

వికీపీడియలో రికార్డు సృష్టించిన మోత్కూర్ యువకుడు

 

యాద్రాద్రి: వికీపీడియాలో వెయ్యి రోజుల్లో వెయ్యి వ్యాసాలు రాసి మోత్కూరు యువకుడు రికార్డు సృష్టించాడు. యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలానికి చెందిన వంగరి ప్రణయ్ రాజ్ 2016 సెప్టెంబర్ 8న తొలి వ్యాసాన్ని రాశారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా 1000 వ్యాసాలు రాసి వికీపిడియాలో ప్రపంచ రికార్డు సాధించారు. గతంలో 2016లో డిసెంబర్ 16 వరకు 100 వ్యాసాలు రాశారు. 2017 సెప్టెంబర్ 7 నాటికి (365 రోజులు) 365 వ్యాసాలు రాయడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రణయ్ రాజ్‌ను ప్రశంసించారు. అంతే కాకుండా టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కోరిక మేరకు తెలంగాణ చరిత్ర, ప్రదేశాలు, ఇతర విశేషాలు, ప్రాంతాల చరిత్రను కూడా రాశాడు.

అలుపు లేకుండా తన పెళ్లి రోజున కూడా వ్యాసం రాశాడు. 04 జూన్ 2019 నాటికి 1000 వ్యాసాలు పూర్తి చేశాడు. ఈ సందర్భంగా వికీపీడియా ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అసఫ్ బార్టోవ్, తెలంగాణ తెలుగు భాషా పండితులు ప్రణయ్ రాజ్‌ను శాలువాతో సత్కరించి పూలమాలతో ఘనంగా సన్మానించారు. తెలుగు వికీపీడియన్‌గా వికీవత్సరం పూర్తి చేయడం ఆనందగా ఉందని ప్రణయ్ పేర్కొన్నారు. తనకు సహాయ సహాకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రణయ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రణయ్ 1985 మార్చి 25న యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలంలో చేనేత కార్మికులైన వంగరి జానయ్య, కళమ్మ దంపతులకు జన్మించాడు. జడ్పిహెచ్ఎస్ మోత్కూర్ పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం మోత్కూర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివాడు. భువనగిరిలో ఎస్.ఎల్.ఎన్.ఎస్ కాలేజీలో గాడ్యూయేషన్ చేశాడు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో పిజి, ఎంఫిల్ చేశాడు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో థియేటర్ ఔట్రీచ్ యూనిట్ లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్నాడు.  

ఆంగ్లంలో ప్రణయ్ రాజ్ వ్యాసం కోసం ఇక్కడ క్లిక్ చేయండి