Home ఆఫ్ బీట్ భళా.. ప్రసన్న.. అతని శౌర్యం.. అనితర సాధ్యం!

భళా.. ప్రసన్న.. అతని శౌర్యం.. అనితర సాధ్యం!

Police-in-Khammam

ఫెండ్లీ పోలీసింగ్‌కు నిలువెత్తు రూపం… ధీరత్వంలో తోటివారికి స్ఫూర్తిదాయకం… ఆ చిరునవ్వు ఎదుటి వారికి ఆత్వీయ స్వాగతం…విధి నిర్వహణలోని ఆ రాజత్వం అందరికీ ఆదర్శం… ఆయనే వైరా ఎసిపి దాసరి ప్రసన్న కుమార్. పోలీసులనే వణికించే పాతబస్తీని సైతం ఓ లెక్కలోకి తెచ్చిన తీరు అతని ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యం. తల్లిదండ్రుల స్ఫూర్తితో… సహచరిని సహకారంతో భళా పోలీస్ అనిపించుకుంటున్న ప్రసన్న కుమార్ గురించి ‘మన తెలంగాణ’ ప్రత్యేక కథనం…

మన తెలంగాణ/ వైరా: మంచితనానికి, మానవత్వానికి మారుపేరుగా నిలుస్తున్నారు వైరా ఎసిపి దాసరి ప్రసన్న కుమార్. అతి తక్కువ కాలంలో ప్రజల మన్ననలు పొందారు. శాంతి భద్రతల పరిరక్షణలో.. విధి నిర్వహణలో ముక్కు సూటిగా వ్యవహరిస్తారనే పేరును సొంతం చేసుకున్నారు. ఖాకీ చొక్కా వేసుకున్న సామాన్య పౌరుడిలాగే ఉంటూ ప్రజలతో మమేకమై ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రజలను అక్కున చేర్చుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీస్‌కు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. రికమండేషన్లను పక్కన బెట్టి నేరుగా ఫిర్యాదు దారునితో ఓర్పుతో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపడంతో ప్రజల్లో ఒకడిగా ప్రసన్నకుమార్ పేరు సంపాదించుకోగలిగారు.

టీచర్ అవుదామనుకుని…

టీచర్ అవుదామని బిఎస్‌సి బిఇడి చేశారు ప్రసన్నకుమార్. ఇంతలోనే రాజమండ్రి ఎఎస్‌పి రాజీవ్ త్రివేదిని చూసి పోలీస్ కావాలనే కాంక్ష కలిగింది. అనుకున్నదే తడువుగా 1991లో పోలీస్ జాబ్‌లో ఆర్‌ఎస్సైగా నియమితులయ్యారు. అనంతరం
సివిల్ ఎస్‌ఐగా మళ్లీ నియమితులై 1995లో ప్రొబిషనరీ విధులను గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించారు. తొలి పోస్టింగ్‌ను హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్‌లో చేపట్టిన ప్రసన్నకుమార్ విధి నిర్వహణ, ప్రజా రక్షణే ధ్యేయంగా ఎలాంటి విమర్శలకు తావులేకుండా విధుల్లో కొనసాగుతున్నారు.

పాతబస్తీలో ప్రశంసల వర్షం…

ప్రసన్న కుమార్ తొలినాళ్లలో ఉద్యోగమంతా అటవీ ప్రాంతంలోనే చేశారు. భయంకరమైన అడవుల్లో సైతం మొక్కవోని దీక్షతో ముందుకు నడిచారు. అయితే పాత బస్తీలో పనిచేసినప్పుడు ప్రసన్న కుమార్ తీరుపై ప్రశంసల వర్షం కురిసింది. బంగారు దుకాణాల ఘటనలో ఒకేసారి పదివేలమంది పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. అందరినీ సమన్వయ పరుస్తూ శాంతిభద్రతలను పరిరక్షించారు. ఈ విషయంలో ఉన్నతాధికారులను ఎన్నో రివార్డులు అందాయి. తల్లిదండ్రులకు తగిన తనయుడిగా…ప్రసన్న కుమార్ తండ్రి ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో లైన్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేశారు. తల్లి లక్ష్మీకాంతం గృహిణి. వారి ఆదర్శాలను చూస్తూ పెరిగిన ప్రసన్న మొక్కవోని దీక్షతో పోలీస్‌గా ఎంపికయ్యారు. ప్రజలకు సేవ చేయాలనే తలంపు అతనిలో అనుక్షణం కనిపించడానికి ఆయన తల్లి లక్ష్మీకాంతమ్మే కారణం. వారి స్ఫూర్తితోనే ఇంత వాడినయ్యానని చెబుతుండారు ఎసిపి.

విధి నిర్వహణలో.. తనదైన శైలిలో…

విధి నిర్వహణలో తనకంటూ ప్రత్యేక ముద్రను సంపాదించుకున్నారు ప్రసన్న. క్రిందిస్థాయినుంచి పై స్థాయి ఉద్యోగుల వరకూ చిరునవ్వుతో పలుకరిస్తూ ఆత్మీయతకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందని, ఆ సమస్యను సామరస్యంగానే పరిష్కరించుకోవాలని అందరికీ సూచిస్తుంటారు. తొలిసారిగా ఆటోలు డిజిటలైజేషన్‌లో ప్రత్యేక దృష్టి సారించి ఆటో డ్రైవర్లతోపాటు ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి వాహనానికి పోలీస్‌స్టేషన్‌లో డిజిట
లైజేషన్ ద్వారా ఏర్పాటు చేసిన స్టిక్కర్‌ను, ఆటో డ్రైవర్ వివరాలను ముద్రించడంలో సత్ఫలితాన్ని సాధించారు.

సేఫ్టీ ఫస్ట్… హెల్మెంట్ మస్ట్

ప్రతీ వాహనదారుడు సేఫ్టీకి తొలి ప్రాధాన్య మివ్వాలని ప్రచారం చేశారు. హెల్మెంట్‌ను తప్పనిసరిగా వాడాలని.. అది అతనితోపాటు కుటుంబాన్ని కాపాడుతుందని చెబుతుంటారు. హెల్మెంట్ ఆవశ్యకతపై ప్రజల్లో వివరిం చేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హెల్మెంట్, సీటు బెల్టు లేకుండా వాహనాలు నడిపితే జరిగే నష్టాలను పోలీస్ సిబ్బంది వివరించేలా ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు.

కుటుంబమూ ముఖ్యమే…

Police1

విధి నిర్వహణతోపాటు కుటుంబమూ ముఖ్యమేనని అంటారు ప్రసన్న కుమార్. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉన్నప్పుడే విధుల్లో సమర్థవంతంగా పనిచేయగలమన్నది ఆయన భావన. ఉద్యోగానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆఫీస్ వరకే పరిమితం చేస్తానని, విధి నిర్వహణలో భార్య మేరీ తనకు ఎంతగానో సపోర్టింగ్‌గా ఉంటుందని అంటుంటారు. ప్రతీ విషయంలో అర్థం చేసుకునే మనస్థత్వం తనకెంతగానో ఉందని, తన కూతురు, కుమారుడైన హవిలాహ్ లక్షా, డేవిడ్ లివింగ్‌స్టోన్‌తో గడపడం తనకెంతో ఇష్టమని ప్రసన్న చెబుతుంటారు.

ఆటలంటే.. ఎంతో మక్కువ

క్రీడలంటే ఎంతగానో ఇష్టమని, డిగ్రీ చదివే రోజుల్లో ఎక్కడ క్రీడలు జరిగినా తాను ఫ్రెండ్స్‌తో కలిసి పాల్గొనేవాడినని, ముఖ్యంగా షటిల్, వాలీబాల్ అంటే ఎక్కువ ప్రేమ అని, వాలీబాల్ టీమ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించానన్నారు. పుట్టిన పాల్వంచ అంటే తనకెంతో ప్రేమ అని, అక్కడికి పోవాలని ఎక్కువగా అనిపిస్తుందన్నారు. సమయం దొరికినప్పుడు తప్పనిసరిగా పాల్వంచ వెళతానని, చిన్నతనంలో తన తండ్రి కెటిపిఎస్‌లో లైన్ ఇన్స్‌పెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ ఉండేవాడని, ప్రస్తుతం పాల్వంచ కిన్నెరసానిని సందర్శించాలని ప్రతిసారి మనస్సు తపిస్తుందని తెలిపారు.

రోడ్డు భద్రతకు తొలిప్రాధాన్యం…

రోడ్లపై రోజురోజుకూ వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆర్‌అండ్‌బి అధికారులతో మాట్లాడి ప్రతీ ప్రమాదకర ప్రాంతాల్లో సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోస్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా సాయంత్రం పూట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం
చేస్తున్నామని తెలిపారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షీ బృందాల పనితీరు చాలా బాగుందని, గ్రామాల్లో సైతం షీటీమ్ బృందాలు పయనిస్తున్నాయన్నారు. ముఖ్యంగా పోలీస్ అంటే భయం వదిలి స్నేహితుడు అనే ధృక్పథాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.