Home ఎడిటోరియల్ సూకీ పార్టీకి బ్రహ్మరథం

సూకీ పార్టీకి బ్రహ్మరథం

Untitled-1మయన్మార్(బర్మా) పార్లమెంటుకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్య ఉద్యమ యోధ, నోబెల్ శాంతి అవార్డు గ్రహీత శ్రీమతి అంగ్‌సాన్ సూకీ నేతృత్వంలోని ‘నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసి(ఎన్‌ఎల్‌డి) పార్టీ, సైనికాధికారుల పార్టీని చిత్తుచేసి అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఓట్ల సరళిని బట్టి ఎన్నికలు నిర్వహించిన 75శాతం పార్లమెంటు సీట్లలో 70శాతంపైగా గెలుపొందే అవకాశం స్పష్టమైంది. ఎన్‌ఎల్‌డి విజయం ప్రజాస్వామ్య విజయం. ప్రజల విజయం, సైనిక నియంతృత్వానికి పరాజయం. పాలక సైనిక దళాల పార్టీ (యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ – యుఎస్‌డిపి) ఓటమిని అంగీకరించింది. అయితే ప్రజాస్వామ్య పునరుద్ధరణను సైనిక కూటమి ఎంతమేరకు సజావుగా అనుమతిస్తుందో వేచిచూడాల్సిందే. 1990లో జరిగిన గత ప్రజాస్వామిక ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డి గొప్ప విజయం సాధించినా సైనిక నియంతృత్వం దాన్ని అంగీకరించలేదు. ఈ పర్యాయం ప్రభుత్వాన్ని అనుమతించక తప్పని పరిస్థితిలో సైన్యం ఉంది. ఎన్‌ఎల్‌డి ప్రభుత్వం ఏర్పడితే 1960 దశకం తొలి సంవత్సరాల తదుపరి ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వం ఇదే అవుతుంది. ‘వారికి ఇష్టం లేకున్నా అంగీకరించక తప్పదు’ అని అభిప్రాయపడ్డారు సూకీ. అది నిజం కూడా. అనేక సంవత్సరాల పాటు అంతర్జాతీయ ఒత్తిడి తదుపరి సైనిక కూటమి ప్రజాస్వామిక పరివర్తనను అంగీకరించింది. కొత్త రాజ్యాంగాన్ని చట్టం చేసింది. సైనికాధికారులు మిలటరీ యూనిఫాం వదిలి పౌరదుస్తులు ధరించారు. గత ఎన్నికల్లో తమ పార్టీ గెలిచినట్లు ప్రకటించుకుని అధికారం నెరుపుతున్నారు. 2011లో థీన్ సీన్‌ను అధ్యక్షునిగా ఎన్నుకుని ఆయనకు అధికారం అప్పగించి పాక్షిక పౌరప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అప్పటినుంచి సంస్కరణలు చేపట్టారు, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు.
ఈ ఆగ్నేయాసియా దేశంలో ప్రభావవంతమైన ప్రభుత్వాన్ని ఎన్‌ఎల్‌డి ఏర్పాటుచేయాలంటే పోటీకి పెట్టిన సీట్లలో 70శాతంపైగా గెలవాలి. ఎందుకంటే నూతన రాజ్యాంగంలో, పార్లమెంటులో సైన్యం పాత్రను అట్టిపెట్టుకున్నారు. ఆంగ్‌సాన్ సూకీ దేశాధ్యక్షురాలు కాకుండా పరోక్ష నిషేధం విధించారు. విదేశీ భర్త లేక భార్య కలిగి ఉన్నవారు, వారి సంతానం అధ్యక్ష పదవికి అనర్హులని – సూకీని దృష్టిలో పెట్టుకునే రాజ్యాంగంలో 59 ఎఫ్ క్లాజును పొందుపరిచారు. అంతేగాక అధ్యక్షుణ్ణి ప్రజలు ఎన్నుకోరు. ముగ్గురు అభ్యర్థుల మధ్య పోటీలో ఉభయసభల సభ్యులు అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. పార్లమెంటు దిగువసభలో 440 సీట్లలో నాల్గవవంతు – 110 సైన్యానికి రిజర్వు చేయబడినాయి. అంటే దిగువసభలోని 75శాతం సీట్లకే ఎన్నికలు జరుగుతాయి. అంటే మొత్తం సీట్లలో 51 శాతం గెలిస్తేనే ఎన్‌ఎల్‌డికి కనీస మెజారిటీ లభిస్తుంది. అలాగే ఎగువ సభలో కూడా224 సీట్లలో 56 సైన్యానికి కేటాయించబడినాయి. సైన్యం తన పట్టు నిలుపుకోవటానికి ఇంత సంక్లిష్టంగా ఎన్నికల వ్యవస్థను రూపొందించింది. అంతేగాక కీలకమైన హోం, రక్షణ, సరిహద్దు భద్రత మంత్రులను నియమించే అధికారం సైన్యాధ్యక్షునికిచ్చింది. ఎన్నికలు జరిగిన సీట్లలో 70శాతం గెలిచే స్థితిలో ఎన్‌ఎల్‌డి ఉండటం సూకీపట్ల ప్రజల ప్రగాఢ విశ్వాసాన్ని, ఆమె పోరాటానికి సంపూర్ణ మద్దతును ప్రతిబింబిస్తున్నది.
అందువల్ల ఇన్ని పరిమితుల్లో మయన్మార్ ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలి. అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకురాలు సూకీ పాలనాధికారంలోకి వచ్చే అవకాశాన్ని నిరాకరించటం కక్షతోకూడిన వివక్షతప్ప మరొకటి కాదు. ఆమె పార్టీ ప్రభుత్వం ఏర్పరచినా సైన్యం కనుసన్నల్లో పనిచేయాలి. అయినా ప్రజావాణి కాస్త ఆలస్యంగానో, ముందుగానో జయించక మానదు. ప్రపంచంలో ఎన్ని నియంతృత్వాలు మట్టి కరవలేదు! కాగా సూకీ పోరాటం అహింసాయుతం. సైన్యం దీర్ఘకాలం ఆమెను గృహనిర్బంధంలో ఉంచినా మొక్కవోని ఆత్మవిశ్వాసతో ప్రజలను నడిపిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు చాలా నెమ్మదిగా వెలువడుతున్నందున వాటిని తారుమారు చేసే ప్రయత్నాలు జరగవచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే హింస ప్రబలుతుంది. ఈ పర్యాయం తాము జోక్యం చేసుకోబోమని, ఫలితాలను గౌరవిస్తామని సైనికాధికారులతో కూడిన పాలక పార్టీ వాగ్దానంచేసింది.
‘ఫలితాలు సంతోషం కలిగిస్తున్నాయి. ప్రజలు 50ఏళ్లుగా బాధలనుభవిస్తున్నారు. ఆంగ్ సాన్ సూకీ దేశాన్ని మెరుగుపరుస్తారని విశ్వాసం ఉంది’ – ఇది యాంగూన్‌లో ఒక వర్తకుని వ్యాఖ్య. అదే దేశ ప్రజల మనోగతం. దాన్ని సైన్యం గౌరవిస్తుందని, మయన్మార్‌లో ప్రజాస్వామ్యం పునరుద్ధరణ పొందుతుందని ఆశించుదాం.