Home జాతీయ వార్తలు 54 మందికి ‘పద్మ’ అవార్డుల ప్రదానం

54 మందికి ‘పద్మ’ అవార్డుల ప్రదానం

Padma-awards

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం 54 మందికి పద్మ అవార్డులు ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్నవారిలో జానపద గాయని తీజన్ బాయి, లార్సెన్ అండ్ టబ్రో ఛైర్మన్ అనిల్ కుమార్ నాయక్, సైంటిస్ట్ ఎస్. నంబి నారాయణన్, నటుడు మనోజ్ బెనర్జీ, 106 ఏళ్ల పర్యావరణవేత్త సాలుమరాద తిమ్మక్క మొదలైన లబ్దప్రతిష్టులున్నారు. తీజన్ బాయి భారతదేశపు రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. పద్మభూషణ్ అందుకున్న ప్రముఖుల్లో… ప్రాచీన సరస్వతీ నది ఆనుపానుల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు దర్శన్ లాల్ జైన్, ఎండిహెచ్ వ్యవస్థాపక సిఇఓ ధరమ్‌లాల్ గులాటి, వైద్యరంగానికి చెందిన అశోక్ లక్ష్మణ్‌రావ్ కుకాడే, శాస్త్రవేత్త నంబి నారాయణ్, పర్వతారోహకుడు బచేంద్రిపాల్, మాజీ కాగ్ వికె షుంగ్లూ ఉన్నారు.

రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్లో కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు రాజ్‌నాథ్‌సింగ్, హర్షవర్ధన్, రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్, విజయ్ గోయల్‌తో పాటు భారతీయ జనతాపార్టీ సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ, సీనియర్ అధికారులూ హాజరయ్యారు. ఈ ఏడు పద్మ అవార్డులకు ఆయా రంగాల్లో ప్రసిద్ధి గాంచిన 112 మందిని ఎంపిక చేశారు. రిపబ్లిక్ దినోత్సవం రోజున వారి పేర్లు ప్రకటించారు. ఈ అవార్డుల ప్రదానం రెండు దఫాలుగా జరిగింది. మార్చి 11న 47 మందికి అవార్డులు ప్రదానం చేయగా, శనివారం 54 మంది అందుకున్నారు. పద్మశ్రీ అవార్డులు అందుకున్న వారిలో ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, అపూర్వ చిత్రకారుడు బాజ్‌పాయీ, తబలా విద్వాంసుడు ఘరానా స్వపన్ చంధూరి, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితుల తరఫున ఏళ్ల తరబడి న్యాయపోరాటం చేసిన లాయర్ హెచ్.ఎస్. ఫూల్కా, సైంటిస్ట్ లక్ష్మణ్ కాటే, పురాతత్వవేత్త మహమ్మద్ కెకె, కణ శాస్త్రవేత్త రోహిణి మధుసూదన్ గోడ్‌బోలే మొదలైన వారున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక ‘పాంచజన్య’ మాజీ సంపాదకుడు దేవేంద్రస్వరూప్‌కు మరణాంతరం పద్మశ్రీ లభించింది.

 మాతృభావనా వాత్సల్యానికి రాష్ట్రపతి భవన్ కఠినమైన ప్రోటోకాల్ అవరోధం కాలేదు. శనివారంనాడు రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కర్ణాటకలో వేలాది చెట్లు నాటి వృక్షమాతగా పేరు తెచ్చుకున్న 106 ఏళ్ల సాలుమరాద తిమ్మక్క పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆశీర్వదించడంకోసం ఆయన నుదుటిని వాత్సల్యంతో తాకారు. అవార్డు అందుకోడానికి తిమ్మక్క లేతాకుపచ్చ చీర, నుదుట త్రిపుండ్రం అలదుకొని, చిరునవ్వులు చిందిస్తూ వేదికపైకి వచ్చారు. ఆమె కన్నా 33 ఏళ్లు పిన్న వయస్కుడైన రాష్ట్రపతి తిమ్మక్కను కెమెరా వైపు చూడమన్నారు. ఆ శుభవేళ ఈ శతాధిక వృద్ధురాలు ఆప్యాయంగా రాష్ట్రపతి నుదుటిని చేత్తో తాకారు. ఆమె వాత్సల్యం చూసిన రాష్ట్రపతి ముఖంపై చిరునవ్వు వెల్లివిరిసింది. ఈ సన్నివేశాన్ని చూసిన ప్రధాని నరేంద్రమోడీ, ఇతర ప్రముఖులు హర్షాతిరేకంతో పులకించిపోయారు.

President Kovind presents Padma awards at Rashtrapati Bhavan