Friday, April 19, 2024

వినోదంతో పాటు సందేశం ఉన్న ‘ప్రెషర్ కుక్కర్’: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

pressure cooker

 

సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించిన చిత్రం ‘ప్రెషర్ కుక్కర్’. ‘ప్రతి ఇంట్ల ఇదే లొల్లి’ అనేది ఉపశీర్షిక. అభిషేక్ పిక్చర్స్ సమర్పణలో కారంపురి క్రియేషన్స్ , మైక్ మూవీస్ పతాకాలపై సుశీల్ సుభాష్ కారంపురి, అప్పిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుజోయ్, సుశీల్ దర్శకులు. శుక్రవారం ఈ సినిమా విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. శనివారం ఈ చిత్రాన్ని రాష్ట్ర మంత్రి కెటిఆర్ వీక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ “సుజోయ్ నాకు 15 ఏళ్లుగా పరిచయం. స్టీరియో టైప్ కాకుండా ఒక రకమైన రాడికలిజం అతనిలో ఉండేది. అప్పట్లో అతనొక బ్లాగ్ రాసేవాడు. అది చదివి అతనికి మరింత దగ్గరయ్యాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బెంగుళూర్‌లో ఉద్యోగం చేస్తున్న తనని నేనే ఇక్కడికి రమ్మన్నాను. దాంతో మా స్నేహం కూడా పెరుగుతూ వచ్చింది.

అతని రచనలు, ఆలోచనలు వైవిధ్యంగా ఉంటాయి. సుజోయ్, సుశీల్‌లు తమ పిల్లల పేర్లను కూడా కవితాత్మకంగా ఉండేలా పెట్టారు. గతంలో తన ఫొటోగ్రాఫ్స్, పెయింటింగ్స్‌తో నన్ను ఆశ్చర్యపరిచిన సుజోయ్… తాజాగా తన తమ్ముడితో కలిసి సినిమా తీశాను అని చెప్పి నన్ను మరింత ఆశ్చర్యపరిచాడు. ఇక సినిమా విషయానికి వస్తే మంచి వినోదంతో పాటు సందేశం ఉన్న సినిమా ఇది. సహజత్వానికి చాలా దగ్గరగా ఉంది. పరిమిత వనరులతో సుజోయ్, సుశీల్ చక్కగా తెరకెక్కించారు. సాయి రోనక్, ప్రీతి బాగా నటించారు.

డాలర్ డ్రీమ్స్, అమెరికా కోసం పరిగెత్తడం, ఇక్కడున్న తల్లి తండ్రులు ఓ వైపు గర్వంగా ఉన్నా మరోవైపు పైకి చెప్పుకోలేక బాధ పడడం లాంటి అంశాలను సహజత్వానికి దగ్గరగా చూపించారు ఈ సినిమాలో. సంగీతం కూడా ఆకట్టుకుంది. సుజోయ్ మరో ఏడు, ఎనిమిది టైటిల్స్ కూడా రిజిస్టర్ చేశాడు అని తెలిసింది. అతడు మరిన్ని మంచి సినిమాలు తెరకెక్కించాలని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. ఈ కార్యక్రమంలో సుజోయ్, సుశీల్, అభిషేక్ నామా, ప్రీతి అస్రాని, మధుర శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

pressure cooker is Message oriented movie
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News