Home జాతీయ వార్తలు అడ్డుకోవడం అనుచితం

అడ్డుకోవడం అనుచితం

pmచర్చా వేదికగా పార్లమెంట్‌ను మననివ్వాలి : ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్
ఉగ్రవాదం నేడు అంతర్జాతీయ సవాల్
సమర్ధవంతంగా ఎదుర్కొంటాం
పఠాన్‌కోట్ వీరులకు అభినందనలు
పేదరిక నిర్మూలనకు అత్యధిక ప్రాధాన్యత
సామాజిక భద్రత, సమ్మిళిత ప్రగతి
ప్రధాని జన్‌ధన్ యోజన గర్వించదగినది
నల్లధనంపై సమగ్ర చర్యలు
న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో వాదనలు, చర్చలు జరగాలని , సమావేశాలను అడ్డుకోవడం అనుచితం అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావే శాల ప్రారంభం సందర్భంగా మంగళవారం రాష్ట్రపతి ఆనవాయితీగా తొలిరోజు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. పలు కీలక అంశాలను ప్రస్తావించిన రాష్ట్రపతి ప్రత్యేకంగా ఇటీవలి కాలంలో పార్లమెంట్ సమావేశాలకు తీవ్ర స్థాయిలో ఆటంకాలు ఏర్పడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో పార్లమెంట్ దేశ ప్రజల సమున్నత ఆకాంక్ష లకు వేదికగా నిలుస్తుందని, అడ్డంకులు కల్పించడం తగదని పార్లమెంట్ సభ్యులకు రాష్ట్రపతి హితవు పలికారు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవడం, సహకార స్ఫూర్తితో ఎంపిలు తమ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉందని పిలుపు నిచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ అజెండా మౌలిక రూపాన్ని రాష్ట్రపతి తమ ప్రసంగంలో తెలియచేశారు. పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం నిరంతరం యత్నిస్తుందని తెలిపారు. చర్చలతోనే ప్రజాస్వామిక ధోరణికి న్యాయం దక్కుతుందని, అడ్డుకోవడం వల్ల కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో పాటు సంబంధిత అన్ని పక్షాలూ సహకార ధోరణితో వ్యవహరించాలని , అన్ని అభిప్రాయాలకు స్థానం దక్కేలా చేసుకోవల్సి ఉంటుందని తెలిపారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి 20 పేజీల ప్రసంగ పాఠం చదువుతున్నప్పుడు సభ యావత్తూ శ్రద్ధగా ఆలకించింది. అన్ని వైపుల నుంచి వివేకాత్మక ఆలోచనలు వెలువడాలని, ప్రజాస్వామిక దేవాలయం అయిన పార్లమెంట్‌లో వీటిపై నిర్మాణాత్మక చర్చలు జరగాలని రాష్ట్రపతి కోరారు. ఈ సమున్నత సభ సభ్యులు అయిన వారు ఇతోధిక గౌరవాన్ని సంతరించుకుంటారు, ఇదే సమయంలో వారికి కీలక బాధ్యతలు కూడా వర్తిస్తాయని రాష్ట్రపతి ఎంపిలకు తెలిపారు.
ఉగ్రవాద సవాళ్లను తిప్పికొడతాం
దేశ భద్రతకు సంబంధించి అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటామని, ఉగ్రవాదం ఇప్పుడు ప్రపంచ స్థాయి సవాలుగా మారిందని, దీనిని నిర్మూలించేంకు పటిష్టమైన సమన్వయ చర్యలు సంఘటితంగా తీసుకోవల్సి ఉంటుందని తెలిపారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టినందుకు జాతి తరఫున వారిని అభినందిస్తున్నానని , సీమాంతర ఉగ్రవాద సవాలును ధైర్యంగా తిప్పికొట్టేందుకు ఖచ్చితమైన, సమర్థవంతమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి తెలిపారు. సీమాంతర ఉగ్రవాద నివారణకు తమ ప్రభుత్వం పాకిస్థాన్‌తో పరస్పర గౌరవప్రద సంబంధాలను ఏర్పాటు చేసుకుంటుందని, సహకార వాతావరణానికి కృషి చేస్తుందని చెప్పారు. ఇరుగుపొరుగ దేశాల భద్రత, వాటి విలసిత భవిత తమ ఆకాంక్ష అని , వసుధైక కుటుంబ సూత్రానికి కట్టుబడి తగు విధంగా స్పందన ఉంటుందని వెల్లడించారు.
అందరి అభివృద్ధిపై దృష్టి
తరచూ పతాక శీర్షికలలో కన్పించే వార్తలలో విన్పించే ఆర్థిఖ పురోగతి అంశం ఒక్కటే కాకుండా , అందరి అభివృద్ధి దిశపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తుందని రాష్ట్రపతి తెలిపారు. ఇదే ఆర్థిక ప్రగతికి కీలకం అవుతుందని చెప్పారు. పేదలు, అణగారిన వర్గాల వారు స్వచ్ఛమైన సాధికారతను సంతరించుకోవల్సి ఉంది. జీవన ప్రమాణాల పెంపుదలకు తీసుకునే చర్యల అవకాశాలు అందరికీ దక్కాలని పిలుపు నిచ్చారు. వెనుకబడిన వర్గాలు సమాన రీతిలో, దేశ ప్రగతిలో సమంజసమైన వాటాదార్లు అయితేనే సమ్మిశ్రిత ప్రగతికి సార్థకత దక్కుతుందని రాష్ట్రపతి తెలిపారు. అందరికీ అభివృద్ధి అనేది కేవలం దేశానికే వర్తించదని, ప్రపంచం యావత్తూకు చెందుతుందని, ప్రపంచ సమాజంలో బాధ్యతాయుత సభ్యదేశంగా భారత్ ఉగ్రవాదం, పర్యావరణ, ఆర్థిక అస్థిరత వంటి పలు కీలక సవాళ్లను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు
పేదరిక నిర్మూలన ధ్యేయం
పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుందని, పేదరికం, దిక్కులేనితనం వంటి తరాల మచ్చలను తొలగించడం ప్రభుత్వాలపై ఉండే నైతిక, పవిత్ర బాధ్యత అని ముఖర్జీ తెలిపారు. ఇది సామాజిక భద్రత, సమ్మిళిత ప్రగతితో సాధ్యం అవుతుందని చెప్పారు. ఆహార భద్రత, గృహ నిర్మాణం, అత్యవసరంగా సబ్సిడీలు అందాల్సిన వారికి వాటిని సక్రమంగా అందేలా చేయడంపై దృష్టి కేంద్రీకృతం చేస్తున్నట్లు , ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన పథకం పట్ల తాను గర్విస్తున్నానని, ప్రపంచంలోనే ఇది అత్యంత విజయవంతమైన ఆర్థిక సమ్మిశ్రిత కార్యక్రమంగా పేరొందిందని తెలిపారు. దీని పరిధిలో 21 కోట్ల ఖాతాలు ప్రారంభం అయినట్లు, వీటిలో 15 కోట్ల ఖాతాల నిర్వహణతో దాదాపుగా రూ 32 వేల కోట్ల డిపాజిట్లు నమోదు అయినట్లు వెల్లడించారు. పేదలకు సామాజిక భద్రతా చర్యలలో భాగంగా ప్రభుత్వం పలు ఇతర చర్యలూ తీసుకుందని చెప్పారు.
రాష్ట్రాలతో తగు సమన్వయం
సమాఖ్య విధానాన్ని ప్రాతిపదికగా చేసుకుని కేంద్రం రాష్ట్రాలతో కార్యకలాపాల వెసులుబాటుకు తగు వాతావరణం కల్పించిందని పెట్టుబడుల సమీకరణలు, పరిశ్రమల స్థాపనకు తగు సానుకూలతను కల్పించిందని నిబంధనలను సరళీకృతం చేయడంతో సామరస్య వాతావరణ ఏర్పడిందని తెలిపారు. పెట్టుబడులకు ఇతోధిక , సజావైన ప్రోత్సాహం కోసం ఆన్‌లైన్ సంబంధిత విధానాలను పొందుపర్చడం వల్ల అస్పష్టతకు వీలులేకుండా పోయిందని తెలిపారు. ఉద్యోగార్థులను ఉద్యోగ ప్రదాతలుగా మార్చే విధంగా పలు సంస్కరణలు చేపట్టినట్లు, స్టార్టప్ ఇండియా ఉద్యమం చేపట్టినట్లు, దీని వల్ల వినూత్న సృజనాత్మక ఎకో సిస్టం విస్తరించి, పాదుకుపొయ్యేందుకు వీలేర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
నల్లధనం వెలికితీతకు సమగ్ర చర్యలు
బ్లాక్‌మనీ ఆటకట్టుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, బ్లాక్‌మనీ ( అబహిర్గత విదేశీ ఆదాయం, ఆస్తులు ) మరియు పన్నుల చట్టం 2015 ప్రవేశపెట్టడంతో దేశంలో బ్లాక్‌మనీ మూలాల వెలికితీతకు సరైన వాతావరణం ఏర్పడింది. నవంబర్‌లో గోల్డ్‌బ్యాండ్‌ల పథకం తీసుకురావడం వల్ల బంగారపు ఆస్తి మూల్గుతూ ఉండకుండా తగు విధంగా ప్రయోజనకారిగా మారేందుకు మార్గం ఏర్పడిందని రాష్ట్రపతి తెలిపారు. ఇక పన్నుల విధానంలో సహేతుక మార్పులు ప్రవేశపెట్టినట్లు, అంతర్జాతీయ స్థాయిలో అమలులో ఉన్న అత్యుత్తమ పన్నుల నిర్వహణ విధానాలతో అందరికీ మేలు జరుగుతోందని వివరించారు.