Home జాతీయ వార్తలు సువర్ణాధ్యాయం

సువర్ణాధ్యాయం

Prime Minister

 

దేశ అభివృద్ధికి అంతా కలిసి నడవాల్సిన సమయం
సుప్రీం తీర్పును అందరూ స్వాగతించారు
సంయమనం పాటించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
దశాబ్దాల వివాదానికి శాశ్వత ముగింపు
అయోధ్యపై తీర్పు తర్వాత జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
నవంబర్ 9 ఎంతో చరిత్రాత్మకమైన రోజు. అయోధ్యపై సుప్రీంకోర్టు మహోన్నతమైన తీర్పును వెలువరించింది. నవ భారత నిర్మాణం కోసం వైరుధ్యాలను పక్కనబెట్టి ఐక్యంగా నడవాల్సిన సమయం ఇది. తీర్పును స్వాగతించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజలు చాలా సంయమనం పాటించారు.

న్యూఢిల్లీ : అయోధ్య తీర్పు న్యాయవ్యవస్థలో చారిత్రాత్మకమైనదని ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో శనివారం సాయంత్రం మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. నూతన భారత్ నిర్మాణానికి సుప్రీంకోర్టు తీర్పు నాంది పలుకుతుందన్నారు. దశాబ్దాలుగా వస్తున్న వివాదానికి తాజా తీర్పుతో శాశ్వతంగా ముగింపు పలికినట్లయిందని అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పును దేశమంతా స్వాగతిస్తోందని, ప్రపంచానికి మనదేశ గొప్పతనం తెలిసిపోయిందని అన్నారు. ‘నవంబర్ 9 ఎంతో చారిత్రాత్మకమైన రోజు. అయోధ్యపై సుప్రీంకోర్టు మహోన్నతమైన తీర్పును వెలువరించింది. నవ భారత నిర్మాణం కోసం వైరుధ్యాలను పక్కనబెట్టి ఐక్యంగా నడవాల్సిన సమయం ఇది అన్నారు.

తీర్పును స్వాగతించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజలు చాలా సంయమనం పాటించారన్నారు. భారత న్యాయవ్యవస్థపై అంతర్జాతీయంగా ప్రశంసలు అందుతున్నాయని, న్యాయమూర్తులు, న్యాయాలయాలకు అభినందనలు తెలుపుతున్నానని మోడీ పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, భిన్నత్వంలో ఏకత్వానికి నేటి పరిస్థితే నిదర్శనం అన్నారు. 30 సంవత్సరాల క్రితం ఇదే నవంబర్ 9న బెర్లిన్ గోడ కూలిందని, అయోధ్య తీర్పుతో పాటు పాక్‌లోని కర్తార్‌పూర్‌కు కూడా ఇదే రోజు దారులు పడ్డాయని గుర్తు చేశారు. తద్వారా ఇదంతా కలికట్టుగా నడవాలని ఇస్తున్న సందేశంగా మోడీ అభివర్ణించారు.

ఎవరి విజయమో.. పరాజయమో కాదు
‘అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును ఏ ఒక్కరి విజయమో.. మరొకరి పరాజయంగానో భావించరాదు. రామ భక్తులైనా, రహీం భక్తులైనా దేశభక్తి భావనను పెంపొందించుకోవాలి. అప్పుడే శాంతి, సద్భావన, ఐక్యత, సౌభ్రాతృత్వం వర్ధిల్లుతాయి. ఇది చరిత్రాత్మక తీర్పు. సుహృద్భావ వాతావరణంలో ఈ సమస్య పరిష్కరించబడింది. న్యాయ వ్యవస్థలోని స్వతంత్రత, పారదర్శకత, దూరదృష్టి మరోసారి తేటతెల్లమైంది. దేశ న్యాయాలయం(సుప్రీంకోర్టు) దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యకు స్నేహపూర్వక ముగింపునిచ్చింది.

ఈ తీర్పు దేశ న్యాయవ్యవస్థపట్ల ప్రజలకున్న విశ్వాసాన్ని మరింత ఇనుమడింపజేస్తుంది. జ్యుడిషియరీని బలోపేతం చేస్తుంది. చట్టం ముందు అందరూ సమానులే అని తేల్చింది. 130కోట్ల మంది భారతీయులు ఐకమత్యంతో అందరం ముందుకు సాగుతూ జాతి అభివృద్ధికి పాటుపడదాం. ఇలాంటి సమయంలో ప్రపంచానికి ఐక్యతాభావాన్ని చాటుదాం. తద్వారా ప్రతి భారతీయుడు సాధికారత సాధిస్తాడన్నది నా విశ్వాసం
ట్విట్టర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ.

Prime Minister Modi’s speech on Ayodhya verdict