Thursday, April 25, 2024

సంపాదకీయం: పట్టాలపై ప్రైవేటు

- Advertisement -
- Advertisement -

Private investment in railway department కరోనా కర్కశ కాలంలో ప్రధాని మోడీ ప్రభుత్వం మరో భారీ ప్రైవేటైజేషన్ క్రతువుకు తెర లేపింది. తన చిర సంకల్పమైన రైల్వేలలో ప్రైవేటు పెట్టుబడులను అనుమతించే ప్రక్రియకు నాంది పలికింది. 109 రూట్లలో 150 ఆధునిక ప్రయాణికుల రైళ్లను నడిపించడానికి ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించింది. ఇందువల్ల రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు రాగలవని ఆశిస్తున్నది. వాస్తవానికి ఇప్పటికే ఢిల్లీ లక్నో, ముంబై అహ్మదాబాద్, వారణాసి ఇండోర్ మార్గాలలో తేజస్ రైళ్లను రైల్వే శాఖకు బయట ఐఆర్‌సిటిసి (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) అనే పబ్లిక్ రంగ సంస్థ ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు. ఆకర్షణీయమైన సదుపాయాలు, అధిక ఛార్జీలతో నడుస్తున్న తేజస్ రైళ్లలో ఆలస్యంగా గమ్యానికి చేర్చినా, మరే ఇతర అసౌకర్యం కలిగినా ప్రయాణికులకు పరిహారాన్ని చెల్లించే పద్ధతిని పాటిస్తున్నారు. ప్రైవేటైజేషన్ వల్ల వచ్చే అదనపు పెట్టుబడులను రైల్వేలను ఆధునికీకరించడానికి వినియోగిస్తామని ప్రభుత్వం చెబుతున్నది.

ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో తయారయ్యే రైలు పెట్టెలు, వ్యాగన్లు వంటి రోలింగ్ స్టాక్‌ను ప్రవేశపెట్టి, నిర్వహణ ఖర్చును పరిమితం చేసుకోడానికి, రైళ్లు తొందరలో గమ్యాలకు చేరేలా చేసి మరింత భద్రతతో కూడిన ప్రపంచ స్థాయి ఆహ్లాదకర ప్రయాణానుభవాన్ని కలిగించడానికి ప్యాసింజర్ రైళ్లకున్న డిమాండ్‌కు, అందుబాటుకు మధ్యగల వ్యత్యాసాన్ని తగ్గించడానికి ప్రైవేటు ఆధునిక రైళ్లకు అవకాశమివ్వదలచినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ అంశాలన్నింటినీ శ్రద్ధగా గమనించినప్పుడు ప్రైవేటు ఆధునిక రైళ్ల వల్ల మొదటిసారిగా దేశంలో పేద, ధనిక వర్గాలకు వేర్వేరు రైలు ప్రయాణాన్ని ప్రవేశపెడుతున్నారని విశదమవుతుంది. ఆ విధంగా ఇప్పటికే పెరిగిన పేద, సంపన్న వర్గాల మధ్య దూరం మరింత పెంచినట్టువుతుంది. ప్రస్తుతం ఒకే రైలులో సంపన్నులకు ఫస్ట్ సెంకడ్ క్లాస్ ఎసి బోగీలు, సాధారణ ప్రయాణికులకు సాదాసీదా నాన్ ఎసి రైలు పెట్టెలు ఉంటున్నాయి. అయినా రెండు వర్గాలు ఒకే రైలులో ప్రయాణిస్తున్నారు. ఈ ఆధునిక ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కితే దీనికి పూర్తిగా తెరపడిపోతుంది. ధనిక, పేద ప్రయాణికుల రైళ్ల గమనాలు వేర్వేరు అవుతాయి.

ఇది అనివార్యంగా పేదల రైళ్ల నడిచే తీరును ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వ రైల్వే శాఖ కేవలం సాధారణ ప్రయాణికుల రైళ్లను నడపడానికే అంకితమవుతుంది. పట్టాలపై ప్రాధాన్యం ప్రైవేటు ఆధునిక రైళ్లకే లభిస్తుంది. తక్కువ స్పీడ్‌తో నడిచే పేదల రైళ్లు గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించే ‘పెద్దల’ బళ్లకు దారివ్వక తప్పని పరిస్థితి తలెత్తుతుంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందిన భారతీయ రైల్వే ప్రస్తుతం ప్రభుత్వ రైల్వే శాఖ ఆధ్వర్యంలో నడుస్తూ సాధారణ ప్రయాణికులకు, సరకు రవాణాకు విశేష సేవలందిస్తున్నది. దాదాపు 60 శాతం రూట్లు విద్యుదీకరణ అయ్యాయి. దూరాలకు వెళ్లేవి, శివారు రైళ్లు కలిసి 13,523 ప్యాసింజర్ ట్రైన్లను రైల్వే శాఖ నడిపిస్తున్నది. సాధారణ బోగీల్లో ప్రయాణించే పేద, మధ్య తరగతి ప్రయాణికులు అసంఖ్యాకం. అత్యధిక శాతం సామాన్య ప్రజలు రైలు ప్రయాణాన్నే ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు ఆధునిక రైళ్లలో వీరికి చోటుండదని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. అధిక ఛార్జీలతో నడిపే ప్రైవేటు రైళ్లు లాభసాటిగా రుజువు చేసుకుంటే సాధారణ ప్రయాణికుల రైళ్ల వ్యయ భారాన్ని పరిమితం చేసుకోడానికి రైల్వే శాఖ ముందు ముందు వాటి సంఖ్యను బాగా తగ్గించివేసే ప్రమాదమున్నది. భారతీయ రైల్వేలలో 12,30,000 మంది సిబ్బంది పని చేస్తున్నారు.

క్రమక్రమంగా రైల్వేల ప్రైవేటైజేషన్‌ను పరిపూర్ణం చేస్తే ఇంత మంది సిబ్బంది భారాన్ని తగ్గించుకోవచ్చనే వ్యూహం తెర వెనుక ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. జనాభాలో 70 శాతం, అంతకంటే ఎక్కువగా ఉన్న దేశంలో వారికి విశేషంగా ఉపయోగపడుతున్న రైల్వేలను ప్రైవేటుకు అప్పగించబోవడంలోని విజ్ఞత ప్రశ్నించదగినదే. రైళ్ల ప్రైవేటైజేషన్‌లో బ్రిటన్ అనుభవం ఘనంగా లేదు. అక్కడ జరిపిన పలు ప్రజాభిప్రాయ సేకరణల్లో అత్యధిక శాతం మంది రైల్వేలను తిరిగి జాతీయం చేయాలని డిమాండ్ చేశారు. 2014 జులైలో మన ప్రధాని రైల్వేలలో ప్రైవేటు పెట్టుబడులకు భారీగా అవకాశమివ్వదలచామని మొదటి సారి చెప్పినప్పుడు ఎన్నికల మధ్య వున్న బ్రిటన్‌లో రైల్వేలను తిరిగి జాతీయం చేస్తామని వాగ్దానం కోసం లేబర్ పార్టీపై ఒత్తిడి పెరిగింది. దీనిని బట్టి రైల్వేల ప్రైవేటైజేషన్ వల్ల దేశంలోని మెజారిటీ ప్రజలకు మంచి జరుగుతుందనే నమ్మకం కలగడం లేదు. ఆ నమ్మకాన్ని కలిగించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉన్నది. ఇప్పటికే రైల్వే బడ్జెట్‌ను విడిగా రూపొందించే విధానానికి స్వస్తి చెప్పి, దానిని సాధారణ బడ్జెట్‌లో భాగం చేయడంతో ప్రభుత్వం రైల్వేల బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకోగలదనే ఊహాగానాలు బయలు దేరి ఉన్నాయి. ఇప్పుడవి నిజమవుతున్నాయని భావించక తప్పడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News