Home ఎడిటోరియల్ నితీశ్ ‘ఔట్ సోర్స్’ కోటా!

నితీశ్ ‘ఔట్ సోర్స్’ కోటా!

edit

ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోటాను ప్రవేశపెట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రైవేటురంగాన్ని కూడా రిజర్వేషన్ల విధానం పరిధిలోకి తీసుకురావాలని గట్టిగా వాదిస్తున్నారు. ప్రైవేటు సంస్థలకు ఔట్ సోర్స్ చేసిన 34 తరగతి ఉద్యోగాలను రిజర్వేషన్ల నియమాల ప్రకా రం భర్తీ చేయాలని నితీశ్ నిర్ణయం నిర్దేశిస్తోంది. కానీ ఇది పూర్తిగా రాజకీయ ఎత్తుగడ అని చెప్పాలి. ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేయిస్తూ తన నైతిక బాధ్యత నుంచి నితీష్ ప్రభుత్వం తప్పుకుందని చెప్పాలి.
స్వార్థ దృష్టితో 3వ, 4వ తరగతి ఖాళీలను పూరించకుండా వదిలేస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. రిక్రూట్‌మెంట్ల ఖరారు తర్వాత అధికారగణం ఈ ఉద్యోగులను ‘సాధారణ ఉద్యోగాలు’ గా మార్చుతుంది. ఆ తర్వాత తమ ప్రాపకం గల వ్యక్తులతో వాటిని నింపుతుంది.
ఈ ప్రక్రియలో భారీ ఎత్తున లంచాలు చేతులు మారడం కూడా ఉంది. కానీ ఒకోసారి అనుకూల అభ్యర్థులు దొరకక ఆ ఖాళీలను పూరించకుండా వదిలివేసే ఆనవాయితీ ఉంది.
ప్రైవేటు రంగంలో రిజర్వేన్లు గురించి మాట్లాడే హక్కు నితీశ్‌కు ఉన్నది దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. దశాబ్దం క్రితం లోక్ జనశక్తి నేత రామ్‌విలాస్ పాశ్వాన్ వంటి నాయకులు ఇదే డిమాండ్‌ను గట్టిగా తెరమీదకు తెచ్చినప్పుడు ప్రైవేటురంగం ఆ ఆలోచనను గట్టిగా వ్యతిరేకించింది.
తమ వ్యాపారం తమ ఇష్టం అన్న రీతిలో ప్రైవేటు రంగం ఆ సూచనను అభ్యంతరపెట్టింది. తాము చట్టానికి కట్టుబడి, ఎటువంటి అక్రమాలకు తావులేకుండా తమ వ్యాపారం సాగిస్తామని చెప్పుకొంది. అయితే విమర్శకులను అవగాహన లేనివారుగా నితీశ్ కొట్టిపారేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో నిబంధనలు వేరుగా ఉంటాయని నొక్కి చెబుతున్నా రు.
చట్టానికి వక్రభాష్యాలు
ఓటు బ్యాంకును సృష్టించుకొనే తొందరలో నితీశ్ చట్టానికి వక్రభాష్యాలు చెబుతున్నారు కూడా. మద్యనిషేధ చట్టంపై ఇలాగే లేనిపోని వ్యాఖ్యలు చేసి, ప్రజల చప్పట్ల కోసం బీహార్ మద్యం చట్టాన్ని సవరించారు. ఆ చట్టానికి 76(2)సెక్షన్‌ను జోడించారు. ఆ నిబంధన మద్యం సేవించినందుకుగాని, మద్యం అమ్ముతున్నందుకు గాని అరెస్టయిన వ్యక్తికి బెయిల్ దొరకకుండా చేస్తోంది. అయితే ఆ సెక్షన్‌ను రాజ్యాంగ వ్యతిరేకమయినదిగా పాట్నా హైకోర్టు కొద్ది రోజుల క్రితం అభివర్ణించింది. అరెస్టయిన వ్యక్తికి ముందస్తు జామీను ఇచ్చే అధికారాన్ని దిగువ కోర్టుకు కూడా కట్టబెడుతూ హైకోర్టు తీర్పు చెప్పింది.
ప్రస్తుత నిర్ణయం రిజర్వేషన్లను దొడ్డిదోవలో ప్రైవేటు రంగానికి వర్తింపచేసే ప్రయత్నంగా కొందరు నితీశ్ విమర్శకులకు కనిపిస్తోంది. అందుకు పార్లమెంట్ ద్వారా చట్టం రావాలి తప్ప ఒక రాష్ట్రప్రభుత్వం ద్వారా కాదని విమర్శకులు వాదిస్తున్నారు.
చట్టప్రకారం రిజర్వేషన్లు ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు మాత్రమే వర్తిస్తాయి. అలాగే వికలాంగులు తదితరులకు కూడా విద్య, ఉద్యోగాలు, ఆరోగ్య రక్షణ వంటి రంగాలలో కూడా రిజర్వేషన్లను చట్టం అనుమతిస్తుంది. అయితే ఇందుకు చట్టంలో కొన్ని సెక్షన్లను పొందుపర్చారు. వాటి కిందకు వచ్చే వారికి రిజర్వేషన్లు వర్తిస్తాయి. రాని వారికి వర్తించవు.

ప్రైవేటురంగం బడా ఖాతాదారు ప్రభుత్వమే
ఆరోగ్య, పట్టణాభివృద్ధి, విద్య, సాంఘిక సంక్షేమ శాఖల్లో 15,000 మందిని ప్రైవేటు సంస్థలు తీసుకుంటున్నాయి. ఇంతవరకు అత్యంత సమర్థులనే ప్రైవేటు సంస్థలు తీసుకుంటున్నాయి. రిజర్వేషన్లను ప్రైవేటు రంగంలో కూడా ప్రవేశపెడితే కులాలవారీ కోటా నిబంధనలకు ఆ సంస్థలు తలొగ్గాలి. ముఖ్యమంత్రి తమకు దయతో ఇచ్చిన ఉద్యోగంగా ఆ నియామకాన్ని కొత్త సిబ్బంది భావిస్తారు. కానీ ప్రైవేటు సంస్థలకు పెద్దపెద్ద ఆర్డర్లు ప్రభుత్వం నుంచే వస్తాయి. అందుచేత వాటిని కోల్పోవడానికి ఎట్టి పరిస్థితిలో ప్రైవేటు సంస్థలు సిద్ధపడవు.
అలాగే ఔట్ సోర్సింగ్‌లో రిజర్వేషన్లను ప్రవేశపెడితే భవిష్యత్తులో ఆయా తరగతుల ఉద్యోగాలకు ఖాళీలే ఉండకపోవచ్చు. ఉన్నా చాలా తక్కువ కావచ్చు. ఒబిసి, ఎస్‌సి, ఎస్‌టి ఓటర్ల అభీష్టాన్ని గెలుచుకోడానికి నితీశ్ పన్నిన చురుకైన వ్యూహంగా ఈ మొత్తం వ్యవహారాన్ని విమర్శకులు భావిస్తున్నారు. ఈ అంశంపై రాష్ట్ర బిజెపి నిలువునా చీలిపోయింది. అగ్రకులాల నాయకత్వం దీనిని వ్యతిరేకిస్తోంది. సమాజానికి రిజర్వేషన్ల వ్యవస్థ ప్రధాన శత్రువు అని ఆ వర్గాలు వాదిస్తున్నాయి. దేశాభివృద్ధికి రిజర్వేషన్లు పెద్ద అడ్డంకి అని చెబుతాయి. అంతేకాకుండా రిజర్వేషన్లు ఎవరికి దక్కాలో వారికి దక్కకుండా పోతున్నాయని వారంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల వంటివి అధికాదాయ వర్గాలకే చెందుతున్నాయని వారు విమర్శిస్తున్నారు కూడా.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో రిజర్వేషన్లకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల గట్టిగా సానుకూలత ప్రకటించారు. నితీష్, కెసిఆర్‌ల ప్రకటనలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలలో రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ఇక ప్రైవేటు రంగాన్ని రిజర్వేషన్ల కోటా పరిధిలోకి తేవాలన్న డిమాండ్ ఎప్పటినుంచో వుంది. దీనిపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సి ఉంది. ఇది కేంద్రం చేతిలోని అంశం. రాష్ట్రాలు చేయ గలిగింది అంతగా లేదు.
 * అరుణ్ శ్రీవాస్తవ (ఐపిఎ సర్వీస్)