Home ఎడిటోరియల్ ప్రైవేటు రంగం సామాజిక సేవ

ప్రైవేటు రంగం సామాజిక సేవ

Scholarshipకార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతను నెత్తిన ఎత్తుకోడానికి వాటి దాతృత్వాన్ని పరిగణనలోకి తీసుకున్నా, దీని వెనుకాల ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనలు కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వం 2013లో కంపెనీ చట్టాన్ని సమీక్షిస్తున్న సమయంలో ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబలిటీ’ ని ప్రవేశపెట్టింది. ఈ బాధ్యతను ఖచ్చితంగా పాటించేలా చేసిన దేశాల్లో భారత్ ప్రపంచంలోనే మొదటిది. ఈ సవరణ ప్రకారం ఏప్రిల్ 2014 నుండి రూ. 500 కోట్ల నికర విలువ ఉండి ఏడాదికి రూ. 1000 కోట్ల టర్నోవర్ కలిగి ఉన్న కంపెనీలు రూ. 5 కోట్లకు పైగా నికర లాభం సంపాదిస్తే అందులోంచి కనీసం 2% సామాజిక అభివృద్ధికి మూడేళ్ల పాటు ఖర్చుచేయాలి. అందులో విదకు సాయం ఒక అంశమే. దీనిని పాటించని కంపెనీలకు భారీ జరిమానా వేసి సవరణ 2019లో జరిగింది.

చదువు విలువ పెరుగుతున్న కొద్దీ చదవుకొనే వెల కూడా పెరిగిపోతుంది. ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఉన్నత విద్యా సంస్థలు సైతం ఏడాది కేడాది ఫీజులు పెంచుతూ ఉండడంతో ఆర్థిక బలహీనులకు ఉన్నత విద్య బహుదూరమై పోతోంది. దేశంలో పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల్లో 52% మాత్రమే ఇంటర్మీడియెట్ విద్యనందుకోగలుగుతున్నారు.

దేశంలోని టాప్ కాలేజీల్లో సీటు సంపాదించిన పేద విద్యార్థి ఫీజులు కట్టలేని దుస్థితిలో సీటును వదలుకోక తప్పడం లేదు. ఆర్థికంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వాలు ఉపకార వేతనాల సర్దుబాట్లు, ఫీజు రీయంబర్స్‌మెంట్లు అందించినా చదువుకు అవసరమైన ఖర్చుకు అది సరిపోవడం లేదు. ఆ వ్యత్యాసాన్ని పూడ్చడానికన్నట్లు ప్రైవేటు రంగంలోని పారిశ్రామికవేత్తలు ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందజేస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం పత్రికలకు, ఆయా కళాశాల యాజమాన్యాలకు సంస్థలు తెలియపరస్తున్నాయి. విద్యార్థులు సకాలంలో సమాచారం అందుకొని వాటి ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

ప్రముఖ పారిశ్రామికవేత్తలయిన టాటా, బిర్లాలు స్వాతంత్య్రానికి పూర్వం నుండే పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం చేస్తున్నారు. మహేంద్ర కంపెనీ కూడా ఇందులో ముందుం ది. ధీరూబాయి అంబానీ స్కాలర్ షిప్‌ను 1996 నుండి ఆయన కుటుంబీకులు అందజేస్తున్నారు. ఒపి జిందాల్ ప్రతిభా స్కాలర్‌షిప్‌ను జిందాల్ ట్రస్టు ఎంపిక చేసుకొన్న కాలేజీల్లోని విద్యార్థులకు ఇస్తున్నారు.

హెచ్.డి.ఎఫ్.సి, ఇండిస్ ఇండ్ సంస్థలు ఇంటర్మీడియెట్‌లో 80% ఆపై మార్కులు వచ్చిన వారికి ఉపకార వేతనం వసతి కల్పిస్తున్నారు. ఇండియన్ ఆయిల్ కంపెనీ ఏటా 2600 మంది విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇస్తోంది. ఇంటర్మీడియెట్ వారి నెలకు రూ. 1000/ చొప్పున రెండేండ్లు, ఇంజినీరింగ్, ఎంబిఎ విద్యార్థులకు నెలకు రూ. 3000/ నాలుగు సం॥ రాల పాటు అందజేస్తుంది. చమురు, సహజ వాయువుల ప్రభుత్వ రంగ సంస్థ (ఒఎన్‌జిసి) ఏటా 500 మంది షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందిన ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు ఇస్తోంది.

విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ తన ఆదాయంలో కొంత భాగం విద్యాభివృద్ధికి కేటాయిస్తున్నారు. బెంగళూరులో 2000 సంవత్సరంలో అజీం ప్రేమ్ జీ యూనివర్శిటీ స్థాపించబడింది. దానికి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు కూడా ఉంది. లాభాపేక్ష లేకుండా 50% నుండి 70% దాకా ఫీజులు విద్యార్థుల ప్రతిభ, ఆర్థిక పరిస్థితి ఆధారంగా తగ్గించబడతాయి.

ఇంటర్, ఆపై స్థాయి చదువులకు కోల్గేట్, కీప్ ఇండియా స్మైల్ ఫౌండేషన్ తరపున ఆర్థిక సాయం అందిస్తోంది. కుటుంబ ఆదాయం ఏడాదికి అయిదు లక్షలు మించని విద్యార్థులకు ఇంటర్ చదువు కోసం ఏటా రూ. 20,000/ చొప్పున చెల్లిస్తారు. పదో తరగతిలో 75% పై మార్కులు వచ్చి ఉండాలి. ఇంటర్‌లో కనీసం 60% మార్కులు సాధించిన వారికి డిగ్రీ, డిప్లొమా కోర్సుల్లో ఏడాదికి రూ. 30,000/ అందజేస్తారు. కీప్ ఇండియా స్మైలింగ్ అనే వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు, చివరి తేదీ జనవరి 30, 2020. ప్రస్తుతం పదవ తరగతిలో ఉన్నవారు, మిగితా కోర్సుల్లో చివరి సంవత్సరం చదువుతున్న వారు ఈ ఉపకార వేతనానికి ప్రయత్నించవచ్చు.

ఇంజినీరింగ్, మెడిసిన్‌లాంటి వృత్తి విద్యా కోర్సులకే కాకుండా సంగీతం, నృత్యం లాంటి లలిత కళలు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేసే సంస్థలున్నాయి. కళాకృతి ఫెల్లోషిప్, టోటో మ్యూజిక్ అవార్డు, టాలెంట్ బ్యాండ్, మధోబి చటర్జీ స్మారక ఫెల్లోషిప్. లలిత కళా అకాడెమి సహకారం ఇలా పలు సంస్థలు కళలను ప్రోత్సహిస్తున్నాయి.

చదువులో పాటు క్రీడల్లో రాణించేవారిని వారి ప్రతిభకు సాన పెట్టేందుకు అవసరమైన ఆర్థిక తోడ్పాటును స్కాలర్ షిప్ రూపంలో అందించే సంస్థలు కూడా ఉన్నాయి. ఎఎఐ స్పోర్ట్ స్కాలర్ షిప్, మహాత్మా గాంధీ చెస్ స్కాలర్ షిప్, సించియాసిస్ సొసైటీ ఫౌండేషన్ తదితర సంస్థలు విద్యార్థుల్లో ఉన్న క్రీడల పురోగతికి తమ సొమ్ము వెచ్చిస్తున్నాయి.

కేవలం విద్యార్థినులకు ఆర్థిక సాయం అందించే సంస్థలు కూడా ఉండడం విశేషమే. డా॥ రెడ్డీస్ ఫౌండేషన్ వారు సశక్త్ స్కాలర్ షిప్ ఇంటర్ తర్వాతి చదువులకు అందజేస్తున్నారు. సంతూర్ వుమెన్, లారెల్ ఇండియా, లెగ్రెండ్, శ్రీమతి గీతా లోచన్, ప్రభాదల్ ఫెల్లోషిప్ కల్పనా చావ్లా స్మారక అవార్డు, లేడీ మెహర్ బాయి టాటా, నెస్లె ఇలా మహిళా విద్యాభివృద్ధికి సంస్థలు తోడ్పడుతున్నాయి.

బేగం హజ్రత్ మహల్ జాతీయ ఉపకార వేతనం ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీ బాలికలకు అందజేయబడుతుంది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ స్కాలర్ షిప్ కూడా ముస్లిం మహిళలకు ప్రత్యేకమైనది. ఫెయిర్ అండ్ లవ్‌లీ ఉత్పత్తి సంస్థ 60% పై మార్కులు వచ్చిన విద్యార్థినులకు పది, ఇంటర్ చదువులకు సాయపడుతోంది. ఎల్& టి బిల్ట్ ఇండియా స్కాలర్ షిప్ ఐఐటిలో ఎంటెక్ విద్యార్థులకు చేదోడుగా ఉంటోంది. అమర్ చిత్ర కథా అనే ప్రముఖ బాల సాహిత్య సంస్థ అయిదవ తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇస్తోంది.

ఎన్‌టిపిసి అనే ప్రభుత్వ రంగ సంస్థ ఏటా 35 మంది దళిత, గిరిజన ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తోంది. ఎల్‌ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ 2006 నుండి వివిధ కోర్సుల విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పడుతోంది. అలాగే భారత పెట్రోలియం సంస్థ పోస్టు గ్రాడ్యుయేట్ విద్యను చదువుతున్న వారిని ఆదుకుంటోంది. రిజర్వు బ్యాంకు, స్టేట్ బ్యాంకులు కూడా ప్రతిభ గల విద్యార్థులను ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నాయి.

ఇలా కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతను నెత్తిన ఎత్తుకోడానికి వాటి దాతృత్వాన్ని పరిగణనలోకి తీసుకున్నా, దీని వెనుకాల ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనలు కూడా ఉన్నాయి. భారత ప్రభుత్వం 2013లో కంపెనీ చట్టాన్ని సమీక్షిస్తున్న సమయంలో ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబలిటీ’ ని ప్రవేశపెట్టింది. ఈ బాధ్యతను ఖచ్చితంగా పాటించేలా చేసిన దేశాల్లో భారత్ ప్రపంచంలోనే మొదటిది.

ఈ సవరణ ప్రకారం ఏప్రిల్ 2014 నుండి రూ. 500 కోట్ల నికర విలువ ఉండి ఏడాదికి రూ. 1000 కోట్ల టర్నోవర్ కలిగి ఉన్న కంపెనీలు రూ. 5 కోట్లకు పైగా నికర లాభం సంపాదిస్తే అందులోంచి కనీసం 2% సామాజిక అభివృద్ధికి మూడేళ్ల పాటు ఖర్చుచేయాలి. అందులో విదకు సాయం ఒక అంశమే. దీనిని పాటించని కంపెనీలకు భారీ జరిమానా వేసి సవరణ 2019 లో జరిగింది. సామాజిక బాధ్యత నిధిని వెచ్చించని సంస్థలకు రూ. 50,000 నుండి రూ. 25 లక్షల దాకా పెనాల్టీ వేయవచ్చు. బాధ్యులకు వ్యక్తిగతంగా రూ. 5 లక్షల పెనాల్టీ పాటు మూడే ళ్ల జైలు శిక్ష పడుతుంది.

ఇలా స్కాలర్ షిప్ అందజేస్తున్న సంస్థలకు ఎంపికలో సొంత విధానాలున్నాయి. వీటి గురిం చి ఆయా సంస్థల వెబ్‌సైట్లలో తగిన సమాచారముంటుంది. ఏ విద్యార్థి అయినా ఏదో ఒక సంస్థ నుండి మాత్రమే ఆర్థిక సహాయం పొందవచ్చు. వీటి వివరాల కోసం తాము చదువుతున్న విద్యా సంస్థల అధికారులను కూడా సంప్రదించవచ్చు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రైవే టు రంగం చేస్తున్న ఈ సాయం ఇంకా పెరగవలసిన అవసరం కూడా ఉంది.

Private sector is a social service

బి.నర్సన్, 9440128169