Home జాతీయ వార్తలు కేంద్రం అధికారాల అతిక్రమణ

కేంద్రం అధికారాల అతిక్రమణ

Priyanka remarks on epidemic diseases bill

ఎగువ సభలో పతిపక్షాల విమర్శ

న్యూఢిల్లీ : పలు కీలక సమస్యలపై ప్రతిపక్షాలు శనివారం రాజ్యసభలో ప్రభుత్వాన్ని నిలదీశాయి. కోవిడ్ 19, ఆర్డినెన్స్‌లు, వలసకూలీల సమస్యలపై ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించాయి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం తన రాజ్యాంగ పరిమితులను దాటుతోందని, రాష్ట్రాల వ్యవహారాలలో జోక్యం చేసుకొంటోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉంటే కంట్రోలు చేయలేకపొయ్యారని, అన్నింటికి మించి పేదలు, వలస కూలీలను ఏ విధంగా కూడా ఆదుకోలేకపొయ్యారని చర్చ సందర్భంగా తెలిపారు. శనివారం రాజ్యసభలో ఎపిడమిక్ డిజీజెస్ (సవరణ) బిల్లు 2020పై చర్చ జరిగింది. కేంద్రం ఇప్పుడు ఆర్డినెన్స్‌ల రాజ్‌గా మారిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ప్రజాస్వామ్య ప్రక్రియలోని మూడంచెల విధానాల్లోకి ప్రభుత్వం అతిక్రమణలకు దిగిందని తెలిపారు.

రాష్ట్రాల అధికారాలను హరించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని చర్చల దశలో టిఎంసి సభ్యుడు డెరెక్ ఒ బ్రెయిన్ విమర్శించారు. ప్రస్తుత బిల్లులోని అంశాలతో కేంద్రం రాష్ట్రాల అధికారాలను లాక్కుందని తెలిపారు. ఇప్పటికరోనా దశలో కానీ ఇటువంటి ఇతరత్రా మహమ్మారుల సమయంలో కానీ హెల్త్ కేర్ వర్కర్లపై దాడులకు దిగితే అటువంటి వారిపై ఐదేళ్ల జైలుశిక్షకు బిల్లులో వీలు కల్పించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తనకు దేశమంతటా తిరుగులేని అధికారం ఉందని అనుకొంటోందని, నిజానికి పశ్చిమ బెంగాల్, పంజాబ్, తెలంగాణ, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు ఈ పార్టీని తిప్పికొట్టాయని వ్యాఖ్యానించారు. అక్కడి రాష్ట్రాల నిర్వహణ బాధ్యతలను సిఎంలు చూసుకుంటారు. అయితే ఇటువంటి బిల్లులతో కేంద్రం రాజ్యాంగ పరిమితులను దాటుతోందని విమర్శించారు. వైస్రాయ్‌ల కాలం చెల్లిందని, అయితే ఈ బిజెపి ప్రభుత్వానికి ఇప్పటికీ అప్పటి అహంకార ధోరణి పోవడం లేదన్నారు.

ముందుగా రాష్ట్రాలతో మాట్లాడాలి : కెకె
కేంద్రం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ముందుగా రాష్ట్రాలతో సంప్రదించాల్సి ఉందని టిఆర్‌ఎస్ సభ్యులు కె కేశవరావు స్పష్టం చేశారు. రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశాలపై కేంద్రం నిర్ణయాలు తీసుకుంటే అది జోక్యంగానే పరిగణనలోకి తీసుకోవల్సి ఉంటుందన్నారు. చర్చలో పాల్గొన్న ఆయన అందులోని అంశాలపై విస్తారితంగా విమర్శకు దిగారు. ప్రైవేట్ రంగంలో ఆరోగ్య సౌకర్యాల గురించి ప్రస్తావించారు. హైదరాబాద్‌లో ఓ హాస్పిటల్‌లో చనిపోయిన వ్యక్తి బంధువుల నుంచి అధిక ఫీజులు డిమాండ్ చేశారని అన్నారు. ఇటువంటి ఆసుపత్రుల నుంచి ప్రజలకు సరైన రక్షణ అవసరం అని, దీనికి సరైన పద్ధతి అవసరం అన్నారు. కోవిడ్ దశలో కేంద్రం వైఖరితో వలసకార్మికుల కష్టాలు మరింత పెరిగాయని అన్నారు.

వారుస్వరాష్ట్రాలకు వెళ్లాలనుకుంటే దిక్కులేని స్థితిని అనుభవించారని, కేంద్రం రైళ్లను నిలిపివేసిందని, అంతరాష్ట్ర బస్సులను నిలిపివేయాలని రాష్ట్రాలను ఆదేశించిందని తెలిపారు. సమాజ్‌వాది పార్టీ ఎంపి రామ్ గోపాల్ యాదవ్ మాట్లాడుతూ వైద్య చికిత్సల విషయంలో జులుం ప్రదర్శించే వారి పట్ల శిక్షలకు ప్రత్యేక నిబంధనలు ఉండాలన్నారు.వలసకూలీల పరిస్థితిపై డిఎంకె సభ్యులు ఎం షణుగ్మం ప్రశ్నించారు. సరైన ఏర్పాట్లు లేకుండానే కేంద్రం లాక్‌డౌన్‌కు దిగిందన్నారు. వలసకూలీలను ముడిసరుకులుగా భావించరాదని అన్నారు. చర్చలో అన్నాడిఎంకె సభ్యులు ఎ విజయ్‌కుమార్, వైఎస్‌ఆర్‌సిపి సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ , బిజెపి సభ్యులు సరోజ్ పాండే ఇతరులు పాల్గొన్నారు.

డాక్టర్లు సిబ్బందిపై దాడికి ఐదేళ్ల జైలు
సుదీర్ఘ చర్చ తరువాత ఎపిడమిక్ డిజీజెస్ సవరణ బిల్లు 2020ని ఎగువసభ ఆమోదించింది. కోవిడ్ 19 తలెత్తిన ప్రస్తుత దశలో కానీ ఇటువంటి విపత్కర పరిస్థితుల దశలో కానీ వైద్య చికిత్సల విధుల్లో ఉన్న డాక్టర్లు, ఇతరత్రా వైద్య సిబ్బంది భద్రతకు ఈ బిల్లును ఉద్ధేశించారు. వీరిపై దాడులకు దిగే వారికి ఐదేళ్ల వరకూ జైలు శిక్ష ఉంటుంది. శనివారమే ఈ బిల్లును కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్‌వర్థన్ సభలో ప్రవేశపెట్టారు. ఎప్రిల్‌లో దీనికి సంబంధించి ప్రభుత్వం తీకువచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లు ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది.

ఆరోగ్య పరిరక్షణ సిబ్బందిపై దాడులు జరిగితే అటువంటి ఉదంతాలపై కేసులు నమోదు చేసుకుని నెల రోజుల వ్యవధిలో ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ స్థాయి అధికారి సారథ్యంలో దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. విచారణ ప్రక్రియ ఏడాదిలో ముగియాల్సి ఉంటుంది. ఘటనల తీవ్రతను బట్టి దోషులుగా ఖరారు అయిన వారికి కనీసం మూడు నెలల నుంచి ఐదేళ్ల వరకూ జైలు శిక్షలు పడుతాయి. ఇక జరిమానాల స్థాయి రూ 50వేల నుంచి రూ 2,00,000 వరకూ ఉంటుంది. ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాలు ఇతరత్రా ఆరోగ్య కేంద్రాలపై దాడులు జరిగి ఆస్తినష్టం కల్పిస్తే తగు విధంగా జరిమానాలు ఇతరత్రా శిక్షలు ఉండేలా నిబంధనలను పొందుపర్చారు.

Priyanka remarks on epidemic diseases bill