Home హైదరాబాద్ తెలంగాణకు బంగారం ఆకుపచ్చని సింగారం

తెలంగాణకు బంగారం ఆకుపచ్చని సింగారం

Priyanka-Vargies

అంతరించిపోతున్న అటవీ సంపదను పెంపొందించడంతో పాటు తెలంగాణలో కోట్లాది మొక్కలు నాటాలన్న  ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు  ఆలోచనకు స్పందించి  రాష్ట్రాన్ని హరితవనంగా మార్చే బాధ్యతను తన భుజస్కం ధాలపై వేసుకున్నారు ముఖ్యమంత్రి  ఒ.ఎస్.డి ప్రియాంక వర్గీస్. హరితహారం పథకం  కింద అన్ని దిక్కులకు   పచ్చనాకు శోభను  సంతరించేందుకు కృషిచేస్తున్న ప్రియాంక వర్గీస్‌తో అఖిల ముఖాముఖి.

మీ బాల్యం ఎలా గడిచింది. చదువుతున్న రోజుల్లోనే జీవిత లక్ష్యాన్ని ఎంచుకున్నారా?
పుట్టింది కేరళలో. చదువంతా తమిళనాడులోని ఊటీలో సాగింది. అక్కడ ప్రకృతిని చూస్తూ ఎఁతో ఆనందపడుతూ ఏకాగ్రతతో చదువుకునే అవకాశఁ లభించింది. అడవులు, కొండ కోనలు, తివాచీలా పరుచుకున్న పచ్చదనం.. ఆకాశానికి నిచ్చెన వేసిన విధంగా పెరిగిన పొడవైన చెట్లు, ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చేవి. అదే నాకు ప్రేరణగా నిలిచింది. మన నుంచి ఏమీ ఆశించని చెట్లు, మనం జీవించడానికి కావల్సిన ప్రాణవాయువు నుంచి ప్రతిదీ అందిస్తున్నాయి. అక్కడి సంస్కృతి, నిజాయితీగల మనుషుల మధ్య ఉన్న అనుబంధాలు, ఆప్యాయతలు, వారి దినచర్య నన్ను ప్రభావితం చేశాయి. కొన్ని ప్రాంతాల్లో అడవులు దట్టంగా ఉంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో పలుచబడి ఉండేవి. నేను చిన్నతనంలో చూసిన వాటిని పదేళ్ల తర్వాత చూస్తే బాగా తక్కువగా కనిపించాయి. పర్యావరణానికి కలుగుతున్న విఘాతం నన్ను బాగా ఆలోపింపజేసింది. అడవులు లేకపోతే మానవ జీవితంలో చాలా సమస్యలు ఎదురౌతాయి. ప్రతి వ్యక్తి చెట్టును పెంచే బాధ్యత ఎందుకు తీసుకోరు అని నన్ను నేనే ప్రశ్నించుకునేదాన్ని.
సివిల్స్ వైపు రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది ?
ఒక వ్యక్తిగా కన్నా బాధ్యతగల అధికారిగా సమాజం కోసం ఎక్కువ పనిచేయగలం అనిపించింది. ప్రకృతి మధ్యలో ఉండాలని కోరుకున్నాను. ప్రకృతిలో మమేకమయ్యే ఉద్యోగం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా.
మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉండేది ?
అమ్మ మేరి వర్గీస్. గృహిణి. నాన్న వర్గీస్. బిల్డర్. వారిద్దరూ నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకుంటానని వారి నమ్మకం. చిన్నప్పటి నుంచి సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ. నాకు నచ్చిన కెరీర్‌ను ఎంచుకునే స్వేచ్ఛ ఉండేది. అడవులపై, ప్రకృతిపై నాకు ఉన్న ఆసక్తితో తమిళనాడు మేటుపాలెం యూనివర్సిటీ నుంచి ఎం.ఎస్సీ(ఫారెస్ట్ మేనేజ్ మెంట్) పూర్తి చేశాను. ఆ తర్వాత ఐఎఫ్‌ఎస్ రాశాను. ప్రకృతితో మమేకమై జీవించాలన్న నా ఆశయం బలమైంది కావడంతో కష్టపడి చదివాను. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఆలిండియా స్థాయిలో మూడో ర్యాంక్ వచ్చింది.
మొదటి పోస్టింగ్‌తోనే అడవుల్లో తిరగడం ఎలాగనిపించింది?
మొదటి పోస్టింగ్ శ్రీకాకుళంలోని అడవుల్లో వచ్చింది. చిన్నతనంలో చూసిన అడవులకు, అధికారిగా చూసిన అడవులకు చాలా తేడా ఉందనిపించింది. రోజురోజుకు అడవుల విస్తీర్ణం తగ్గిపోతుండటం ఆందోళన కలిగించింది. అడవులు తగ్గిపోతే పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతుంది. సకాలంలో వర్షాలు లేక ఆహారధాన్యాల కొరత ఏర్పడుతుంది. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలంటే అటవీసంపద సమృద్ధిగా ఉండాలి. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలోని దండకారణ్యంలో పనిచేశాను. చాలా దట్టమైన అడవుల్లో గలగలపారే సెలయేళ్లు ఆహ్లాదానిచ్చాయి. నా విధులకు కావల్సిన పరిజ్ఞానం ప్రకృతి నుంచే పొందాను. హక్కుల కోసం పోరాడిన కొమరం భీం సంచరించిన ప్రాంతంలో పనిచేయడం ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. అక్కణ్నుంచి ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యింది. ఈ మూడు ప్రాంతాల అడవుల మధ్య చాలా వైవిధ్యం ఉంది. అయితే అన్ని చోట్ల అడవుల విస్తీర్ణం తగ్గిపోతోంది. విభన్నమైన కారణాలున్నాయి. అడవులపై ఆధారపడి జీవించే వారు కొందరైతే…తమ స్వార్థం కోసం అడవులను నాశనం చేసే మరో వర్గం సమాజంలో ఉంది. ఈ సున్నితమైన తేడాలను గుర్తించి ఎవరు ప్రకృతితో అనుసంధానమై జీవిస్తున్నారో వారిని అడవుల పరిరక్షణలో ప్రోత్సహిస్తూ.. వారి జీవనవిధానం మెరుగుపరిచేలా కృషి చేస్తున్నాం. స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం.
ప్రకృతి పరిరక్షణకు మీరు తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు ఫలితాలనిస్తున్నాయి?
ముఖ్యమంత్రి కె.సి.ఆర్ తన చిన్నప్పుడు చూసిన అడవులు, చూసిన ప్రకృతి కండ్ల ముందు కరిగిపోయిందే అన్న ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు. అయితే గతమెలా గడిచిపోయినా.. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మన అభివృద్ధి మనమే చేసుకోవాలన్న తపనతో వివిధ పథకాలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మస్తిష్కంలో వచ్చిన ఆలోచనే హరితహారం. దశల వారీగా కోట్లాది మొక్కలను తెలంగాణలో నాటి వాతావరణ కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించాలన్న ఆదేశాలలో ఈ కార్యక్రమం అమలు జరుగుతోంది. అడవులు నశించడానికి అనేక కారణాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. కొంతమంది తమ అవసరాల కోసం, మరికొంతమంది పారిశ్రామిక రంగాల కోసం, ఇంకొందరు స్వార్ధ ప్రయోజనాల కోసం అడవులను నరుకుతున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మన రాష్ట్రంలో 66 లక్షల హెక్టార్ల భూవిస్తీర్ణంలో మొక్కలు నాటే అవకాశం ఉంది. దీనితో పాటు మైదాన భూములు, గృహ సముదాయాల్లోనూ చెట్లు నాటేందుకు అనువైన స్థలాలున్నాయి. చెట్లను నాటేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఉచితంగా మొక్కల పంపిణీ చేస్తున్నాం. ఇప్పటివరకు జరిగిన మూడు దఫాల్లో కోట్లాది మొక్కలు నాటాం. మొదటి దశలో 15కోట్లు, రెండో దశలో 31కోట్లు, మూడో దశలో 40కోట్ల మొక్కలు నాటి వాటిని పరిరక్షిస్తున్నాం. రహదారుల వెంట వెళ్తుంటే తొలిదశలో నాటిన మొక్కల ఎదుగుదల నాకెంతో ఆనందానిస్తోంది. మరికొంత కాలానికి రాష్ట్రాన్ని హరితవనంగా చూడాలనే ముఖ్యమంత్రి ఆశయం నేరవేరుతుంది.
వృక్షజాతులకే అధిక ప్రాధాన్యతనిస్తూ.. ఔషధమొక్కలు, పూలమొక్కలను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శ వినిపిస్తుంది. దీనికి మీ సమాధానం ?
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఔషధమొక్కలను కూడా విరివిరిగా పంపిణీ చేయాల్సి ఉంది. ఔషధమొక్కల అవగాహన కోసం అధికారుల బృందం డెహ్రడూన్ వెళ్లి అధ్యయనం చేశారు. ఈ మేరకు మన రాష్ట్రంలో ఔషధమొక్కలను పెంచే కార్యక్రమం జోరుగా సాగుతోంది. వచ్చే ఏడాది నిర్వహించే హరితహారంలో వీటికి కూడా ప్రాధాన్యతనిస్తాం.
హరితహారంపై ప్రజలు, విద్యార్థులు ప్రభుత్వానికి ఏ మేరకు సహకరిస్తున్నారు ?
ప్రజల్లో కొంతమేరకు అవగాహన వచ్చింది. ఇంకా రావాల్సి ఉంది. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు మొక్కలు నాటుతూ.. వారి తల్లిదండ్రుల్లో కూడా మొక్కలు నాటేలా చేస్తున్నారు. స్వచ్ఛందసంస్థలు స్వతహాగా ముందుకొస్తున్నాయి. రాజకీయనాయకులు, అధికారులు హరితహారాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. తప్పని సరిగా మెుక్కలు నాటాలనే భావన ప్రతి ఒక్కరిలో వచ్చినప్పుడు ఈ కార్యక్రమం మరింత విజయవంతమౌతుంది. మిషన్ కాకతీయ లో పునరుద్ధరించిన చెరువు గట్ల పై వేలాది మెుక్కలు నాటడంతో ప్రకృతి ఆహ్లాదకరంగా మారిపోతుంది. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వం హరితహారం నిర్వహిస్తోంది.
ప్రకృతిని పరిరక్షించాలన్న మీ ఆశయం ఏ మేరకు నెరవేరుతోంది. ఈ సందర్భంగా మీరు ప్రజలకు చెప్పే సూచనలు?
ప్రధానంగా ఎరుపు, నీలం, పచ్చరంగులకు ప్రాధాన్యత ఉంటుంది. వీటిలో నీలం ఆకాశమైతే.. భూమిని ఎరుపుగా భావించవచ్చు. ఈ రెండికి మధ్యన ఉన్న పచ్చరంగు ప్రకృతికి చిహ్నం. ఆకాశాన్ని, భూమిని మనం మార్చలేం. పెంచలేం. కానీ, పచ్చదనాన్ని మాత్రం ఎంతైనా పెంచుకోవచ్చు. అయితే ఆ పచ్చదనంలో పెరిగే మొక్కలు, పూసే పూలు, వీచే గాలిలో మొక్కలు నాటిన వారి జ్ఞాపకాలు విహరిస్తూ ఉంటాయి.
కోట్లాది మెుక్కలను ప్రభుత్వం నాటుతున్నా అవి పూర్తి స్థాయిలో చిగురించడం లేదనే విమర్శ ఉంది? మెుక్కలను నాటడంతోనే ప్రభుత్వ బాధ్యత తీరిపోతుందా?
మెుక్కలను నాటడంతో పాటు వాటి పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేక పరిరక్షణ దళాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వం కూలీలకు బాధ్యతలు అప్పగించి ఉపాధి అవకాశాలను పెంచింది. అయితే అనేక కారణాలతో కొంతమేరకు మెుక్కలు ఎండి పోతున్నాయి. ప్రధానంగా వర్షాభావ పరిస్థితులు కారణం. మొదటి దశలో మెుక్కలు నాటినప్పుడు ప్రకృతి సహకరించ లేదు. అయినా ట్యాంకర్ల ద్వారా నీటి సౌకర్యం కల్పించి మెుక్కలను నాటేందుకు ప్రయత్నించాం. మంచి ఫలితాలువచ్చాయి. ఆ తర్వాత అలాంటి సమస్య రాలేదు. నాటిన మెుక్కలు ఎక్కువ శాతం పెరుగుతున్నాయి. జాతీయ రహదారుల వెంట నాటిన మెుక్కలు రహదారులకే ఎంతో అందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. మెుక్కలు నాటడంతోనే ప్రభుత్వ బాధ్యత తీరిపోదు ప్రజల సహకారంతో వాటిని రక్షించేందుకు నిరంతరం తపిస్తుంది.
అటవీ భూముల్లో సమస్యలు వస్తున్నట్లు తెలుస్తున్నాయి ?
అలాంటి సమస్యలు ఏమీ రావడం లేదు. అనేక కారణాల తో తరిగిన అడవులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తోంది. దండకారణ్యాల్లోని కొన్ని ప్రాంతాల్లో సైతం ప్రజా నాయకులు హరితహారంలో భాగంగా మెుక్కలు నాటుతున్నారు. తరిగిన అడవుల ప్రాంతాల్లో సీడ్ బాల్స్ వేసి మెుక్కలను పెంచే ప్రయత్నాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
హరితహారం ఆదర్శంగా మిగులుతుందా?
హరితహారంపై దేశం లోని అనేక రాష్ట్రాలు దృష్టి సారించాయి. ఇటీవల తెలంగాణ గ్రీనరీకి అవార్డులు కూడా లభించాయి. అంతరించిన అడవులను పెంపొందించడం ఒక మహా యజ్ఞంగా ప్రభుత్వం భావిస్తుంది. ఈ కార్యక్రమానికి నిధుల కొరత లేకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్తు లో మరింత పటిష్టంగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పటి వరకు రెండు విడతల హరితహారం పూర్తయింది. మూడవవిడత కొనసాగుతుంది. అయితే మెుదటి విడత హరితహారానికి ఇప్పటికీ ప్రజల్లో చైతన్యం వచ్చిందని భావిస్తున్నారా ?
పనితీరును మరింత మెరుగు పర్చుకునేందుకు అవకాశంగా భావించవచ్చు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ లక్ష్యాలపై అటవీశాఖ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ, అటవీ, వన్యప్రాణి సంపదను కాపాడుకోవడం పట్ల ఇప్పటివరకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించి నూతన కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. హరితహారానికి ప్రజలు సహకరిస్తున్నారు. ప్రజల్లో అవగాహనను ఇంకా పెంచాలి.
భూముల సర్వే హరిత హారానికి ఏ మేరకు ఉపయోగకరంగా ఉంటుంది ?
భూసర్వేల ఫలితం కచ్చితంగా ఉంటుంది. రికార్డులు పూర్తి అయితే ఏ భూముల్లో ఏ మేరకు మెుక్కలను నాటాలనే పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవచ్చు. పార్కుల నిర్మాణంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్తగా అర్బన్ పార్కుల నిర్మాణాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని అటవీ భూముల్లోను ఉద్యానవనాల ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
జాతీయ రహదారులతో పాటు ఔటర్ రింగ్ రోడ్డులో మెుక్కలను నాటే కార్యక్రమం ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది ?
రాజధానికి మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పచ్చదనంతో కళకళలాడేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. ఔటర్ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును పచ్చదనంతో పాటు రంగురంగుల పూల మెుక్కలతో తీర్చిదిద్దాలనే ఆయన ఆలోచన త్వరలో రూపుదిద్దుకోనుంది. పది కిలోమీటర్లకు ఒకటిచొప్పున 15 సెగ్మెంట్లుగా విడదీసి ఒక్కో సెగ్మెంట్‌కు ప్రత్యేక అధికారిని పర్యవేక్షణాధికారిగా నియమించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. యాక్షన్ ప్లాన్ రూపొందించిన అనంతరం పనులు ప్రారంభంకానున్నాయి.
పూలమొక్కలకు, ప్రజల్లో మొక్కలకు వస్తున్న మొక్కలనుపెంచడానికి కోరిక
హరితహారం మీ అభిరుచులను, ఆశయాలను ఆవిష్కరిస్తుందని భావించవచ్చా?
ప్రకృతిని పరిరక్షించే అరుదైన బాధ్యత నాకు లభించడం ఎంతో సంతోషం. ప్రకృతిపై ప్రేమతో ఉద్యోగం చేస్తున్నా…

ప్రకృతిని ఆరాధించడం…ప్రకృతిని పరిరక్షించడం…మెుక్కలు నాటడం అనేది ఓ మహత్తరమైన కార్యక్రమం. నాటిన మెుక్కలను పరిరక్షించడం ఎంతో బాధ్యతాయుత మైంది..ఈ బాధ్యతను ప్రతిఒక్కరు గుర్తిస్తే చిగురించే మెుక్కల్లో… రంగురంగుల పుష్పాల గుబాళింపు, సరిగమలకు అందని పక్షుల కిలకిలారావాల్లో భాగస్వాములుకారా…పులకరించే ప్రకృతిని చూసి ఆనందించరా…..