Home తాజా వార్తలు విసుగే ఉద్యోగమాయెనా?

విసుగే ఉద్యోగమాయెనా?

Employees

 

ఒకప్పటిలా 10 టు 5 ఉద్యోగాలు కావు ఇప్పుడు. రోజుకు పది గంటలు ఆఫీసుకే ఖర్చుపెడుతున్నారు ఉద్యోగులు. దీంతో ఇంటి గురించి పెద్దగా పట్టించుకునే అవకాశం లేకుండా పోతుంది. ఎక్కువ సమయం ఆఫీసుకే ఉపయోగించడం వల్ల వ్యక్తిగత జీవితానికి ఇంచుమించు దూరమౌతున్నారు. దీంతో కొన్నాళ్లకు తీవ్ర మనోవేదనకు గురవుతూ ఉద్యోగంలో వ్యక్తిగత సామర్థాన్ని కోల్పోతున్నారని చెబుతున్నాయి సర్వేలు. పనిలో చూపే విసుగునే ఆంగ్లంలో బర్నవుట్ అంటున్నారు. ఇలాంటి సమస్యతో బాధపడుతున్నవారు ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం మంది ఉన్నారు.

వీళ్లకి ఆఫీసంటేనే విరక్తి కలుగుతోంది. ఏదో మొక్కుబడిగా పనిచేయడం ప్రారంభిస్తారు. ఒత్తిడి శారీరకంగా దెబ్బతీస్తే, సామర్థం కోల్పోవడం అనేది మానసికంగా కుంగదీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ బర్నవుట్ అనే సమస్యను వృత్తిపరమైన జబ్బుగా గుర్తించింది. ఇటువంటి సమస్యకు ప్రత్యేకంగా మందులు ఉండవు. కౌన్సెలింగ్ తీసుకోవడమే ఉత్తమ మార్గం అంటున్నారు మానసిక నిపుణులు.

ఉద్యోగంలో చేరినప్పుడు ఉన్న ఉత్సాహం రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఉండకపోవడం సహజం. అలా కాకుండా పని ఒత్తిడికి లోనై అదికాస్తా సామర్థ లోపానికి దారితీస్తే అలాంటి సమస్యను కనుక్కోవడం కూడా కష్టమే అంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు.

టార్గెట్లు, డెడ్‌లైన్లు లేని ఉద్యోగాలు ఈ రోజుల్లో లేనేలేవు. జీతం పెరిగేకొద్దీ ఇవన్నీ అనుమతించాల్సిందే. ఫలితంగా కొంతకాలానికి పనిలో తీవ్ర ఒత్తిడికి గురై అది మానసిక సమస్యగా మరిపోతుంది. ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వల్ల ఆ ప్రభావం శరీరం, మనసుపై పడుతుంది. దీంతో పనిపై ఆ ప్రభావం కచ్చితంగా పడుతుంది. అప్పుడు చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతూ ఉంటారు. పదే పదే తప్పులు చేస్తుంటారు. సృజనాత్మకత తగ్గి యాంత్రికత, కృత్రిమత్వం ఎక్కువవుతుంది. ఇలా నిస్సత్తువతో ఉండే వారి సంఖ్య ఈ మధ్య కాలంలో ఎక్కువయిందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఉద్యోగులను బాధిస్తున్న సమస్య ఉద్యోగంలో విరక్తిని పెంచుకోవడం. ఒత్తిడిని సరిగ్గా అధిగమించకపోవడం వల్ల పుట్టే లక్షణమే సామర్థ లోపమని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచించింది.

అసలు సమస్యకు కారణాలేంటి…
* విశ్రాంతి తీసుకోకుండా పనిచేయడం. అదేపనిగా పనిచేస్తూ ఎవరితో కలవకపోవడం.
* బాగా పనిచేసినా తగిన గుర్తింపు లేకపోవడం
* అధిక ఒత్తిడి కలిగించే పనులు చేయడం
* సరైన నిద్ర, పోషకాహార లేమి.
* ఇంటి దగ్గర భాగస్వామి సహకారం లేకపోవడం.

సమస్య లక్షణాలేంటంటే…
* శరీరంలో శక్తి లోపించినట్లు అనిపించడం.
* ఉద్యోగంలో అలసత్వం పెరగడం. పనిలో ఉత్సాహం లేకపోవడం. పనంటే కోపం, విసుగు ఏర్పడటం.
* ఫలితంగా ఉద్యోగంలో ఎదుగుదల నిలిచిపోవడం. ఇదంతా ఉద్యోగం విషయంలోనే ఉంటుంది. దీన్నే బర్నవుట్ డిసీజ్ అంటారు. దీన్ని గుర్తించడం కష్టమే. కానీ ఈ విషయాన్ని స్నేహితులు, యాజమాన్యం తప్పక గుర్తిస్తారు.
* ఈ సమస్యతో బాధపడేవారు నిరాశగా ఉంటారు. తిండి సరిగ్గా తినరు. తలనొప్పి, కడుపునొప్పి, వెన్నునొప్పి అంటూ తరచుగా సెలవులు పెడుతుంటారు. ఏదో ఒక వంకతో ఆఫీసుకు డుమ్మా కొడతారు.
* ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. ఆత్మవిశ్వాసం కోల్పోతారు. ఒంటరితనం ఫీలవుతుంటారు. ఎంత పనిచేసినా సంతృప్తి ఉండదు.
* వీటితో పాటు బాధ్యతల నుంచి తప్పించుకునే తత్వం ఏర్పడుతుంది.
* సహోద్యోగులతో కలవరు. పని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. తమ నిరుత్సాహాన్ని ఇతరులపై ప్రదర్శిస్తుంటారు.
* పని తప్పించుకుంటూ ఆఫీసుకు ఆలస్యంగా రావడం, తొందరగా వెళ్లడం చేస్తుంటారు.
ఇటువంటి సమస్య నుంచి బయటపడే మార్గం లేదా అంటే ఉందనే అంటున్నారు సైకాలజిస్టులు.
* స్నేహితులు, ఆప్తులతో, భాగస్వామితో ఎక్కువ సమయం గడపాలి.
* పనిచేసే చోట నలుగురితో కలవాలి. సామాజిక కార్యక్రమాల్లో, సేవల్లో పాల్గొనాలి.
* ప్రతికూల అంశాలకు దూరంగా ఉండాలి.
* అప్పుడప్పుడు పనిలో కొంతకాలం సెలవు తీసుకుని ప్రయాణాలు చేయాలి.
* కుటుంబంతో నాలుగు రోజులు సరదాగా గడిపితే మనసు మన మాట వింటుంది.
* రోజూ తగినంత నిద్రపోవాలి. ధ్యానం, వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. శరీరం ఫిట్‌నెస్‌గా ఉంటే మనసు మాట వింటుంది.
వీటన్నింటితో పాటు సంస్థ అంటేనే ఉద్యోగులు. వారు బాగుంటేనే సంస్థ బాగుపడుతుంది. ఉద్యోగులు పనిలో మరింత సామర్థాన్ని చూపించాలంటే ఆఫీసుల్లో స్నేహపూర్వక వాతావరణం ఉండాలని సూచనలిస్తున్నారు నిపుణులు.

Problem that hurts Employees is aversion to work