Saturday, January 28, 2023

ట్రంప్ తెస్తున్న తంటా!

- Advertisement -

Donald Trump Warns American CEO'Sగట్టి ఉపాధి చట్టం కోసం అంటూ ఈ నెల 8న ఇద్దరు అమెరికా సెనెటర్లు అమెరికా వలసల సంస్కరణ ల ప్రతిపాదనలతో బిల్లులు తెచ్చారు. ఇది ఆ దేశంలోకి వచ్చే పదేళ్లలో చట్ట బద్ధమైన వలసలను సగానికి తగ్గించ డానికి ఉద్దేశించినది. ‘రైజ్ చట్టం’ దీని మరోపేరు. ఇది ఆమోదం పొందితే శాశ్వత నివాస పత్రాలు లేదా గ్రీన్ కార్డుల జారీ సంఖ్యను కూడా అమెరికా తగ్గించి వేస్తుంది. ఏటా గరిష్టంగా 10 లక్షల నుంచి కనీసంగా 5 లక్షల గ్రీన్ కార్డులను ఆ దేశం ప్రస్తుతం జారీ చేస్తోంది. ఇప్పటికే అమెరికాలో వేలాదిమంది భారతీయులు గ్రీన్ కార్డు కోసం 10 నుంచి 35 సంవత్స రాలు వేచి ఉంటున్నారు. కొత్త చట్టం వస్తే ఇలా వేచి వుండే కాలం ఇంకా హెచ్-1బిపై ఆంక్షలు పెరిగిపోతుంది.
ఇదిలా ఉంచితే గత నెల 31న ప్రతిపాదించిన మరో బిల్లు హెచ్-1బి వీసాలను గురిపెట్టింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే నైపుణ్య కార్మికులకు ‘వర్క్ వీసా’లను అది లక్షంగా చేసుకుంది. హెచ్-1బి వీసాలు అధికంగా పొందేది భారతీయ సంతతి వారే. ఉన్నత నైపుణ్యం, సక్రమ వర్తన చట్టం సవరణ ద్వారా హెచ్-1బి వీసా హోల్డర్లకు కనీస వార్షిక వేతనం ప్రస్తుతం గల 60,000 డాలర్లు(రూ.40.7లక్షలు) నుంచి 1,30,000 డాలర్లు (రూ.88 లక్షలు) కు పెంచాలని ఆ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఇది వేలాది మంది ఇంజనీర్ల నుంచి ఔట్ సోర్సింగ్ ద్వారా సేవలు పొందే భారతీయ ఐటి కంపెనీలకు మోయలేని భారం అవుతుంది. అలాగే అత్యంత ఉన్నతస్థాయి నైపుణ్యం కలిగి, చౌకగా పనిచేసే విదేశీ ఉద్యోగులు ఆధారంగా పని సాగించే అమెరికా టెక్ కంపెనీలకు కూడా ఇది భారమయ్యే అంశం. మధ్యరకం సిబ్బందిగా పనిచేసే అర్హత, నిపుణత గల అమెరికన్ల సంఖ్య ఇప్పటికీ చాలా స్వల్పం. ఆయా కంపెనీలు విదేశాల నుంచి వచ్చే వారికే అధారపడక తప్పదు. ప్రస్తుత ప్రతిపాదిత బిల్లులపట్ల భారతీయ వృత్తి నిపుణులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో రానున్న హెచ్-1బి వీసా సంస్కరణలు వర్క్ వీసాలు ఆశిస్తున్న వారికి శాపంగా భావిస్తున్నారు. విదేశీ నైపుణ్య కార్మికులకు కనీస వేతనాల విషయం మన దేశంలో రెండేళ్లుగా చర్చల్లో ఉంది. అంతలోకే ఈ బిల్లులు రావడం బలవంతంగా అమెరికాలో కఠిన నియమాలను వర్తింపచేయడానికేనని వారు భయ పడుతున్నారు. హెచ్-1బి వీసా సంస్కరణలపై ప్రస్తుతం సాగుతున్న చర్చలో బడా అమెరికన్ టెక్ కంపెనీలే ముందు వరుసలో నిలుస్తు న్నాయి. వలసల సంస్కరణలు తేవాలని కోరుకుంటున్నవారు వర్క్ వీసా లపై పరిమితులు అవసరమని, అందువల్ల స్థానిక అమెరికన్లకు ఉద్యోగాలు పెరుగుతాయని వాదిస్తున్నారు. అయితే వాటిని వ్యతిరేకి స్తున్న కంపెనీలు మాత్రం తగినంత మంది అర్హులైన స్థానిక అమెరికన్లు కొరవడ్డారని భావిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులోగల వారు చాలరని వాదిస్తున్నారు.
2010 నవంబర్‌లో నైపుణ్యంగల విదేశాల వారికి ఏడాదికి 25,000 డాలర్లు కనీస వేతనం చెల్లించాలని మన ప్రభుత్వం నిర్దేశిం చింది. ఈ మొత్తం ప్రస్తుత రేట్ల ప్రకారం రూ. 16.6 లక్షలు. ఇంత మొత్తం చెల్లిస్తేనే భారత్‌లో వర్క్ వీసా కోసం విదేశీయులు దరఖాస్తు చేసుకుంటారని ప్రభుత్వం భావించింది. భాషాపరమైన అధ్యాపకు లుగా, అనువాదకులు, తెగలవారి వంటల కుక్‌లు, హై కమిషన్, రాయబార కార్యాలయం సిబ్బందిగా నియమితులయ్యే విదేశీయులకు మాత్రం ఈ కనీస వేతనం నియమం వర్తించదు. నైపుణ్యంలేని విదేశీ ఉద్యోగులను వదుల్చుకోడానికి ప్రభుత్వం 2010లో ఈ ఆలోచన చేసింది. భారతీయ ఉద్యోగాలను రక్షించడం కూడా మరో లక్షం.
ఉన్నతస్థాయి ఉద్యోగాలలో విదేశీ జాతీయులను నియమించే భారీ భారతీయ సంస్థలకు 25,000 డాలర్ల కనీస వేతనం అంకె పెద్ద అడ్డంకేమీ కాదు. మన దేశంలో వార్షిక కనీస వేతనం అంశమే కాదు. ఎందుకంటే కొద్దిమంది విదేశీ సిబ్బందికి మాత్రమే ఆ కంపెనీలు అత్యంత సులభంగా 25,000 డాలర్ల కనీస వేతనం చెల్లిస్తున్నాయి. ఢిల్లీకి చెందిన మానవ వనరుల అభివృద్ధి శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయం చెప్పారు. మరో కీలకాంశం ఏమిటంటే అసలు విదేశీ యులను తీసుకునే కంపెనీలు కూడా చాలా తక్కువ. కాని అనేక స్టార్టప్ లు, లాభాపేక్షలేని సంస్థలు, మరికొన్ని చిన్నస్థాయి కంపెనీలకు 25,000 డాలర్ల కనీస వేతనం భయపెట్టే అంశం.
వర్ధమాన ఆర్థిక వ్యవస్థగా మనం ప్రపంచ వ్యాప్తంగా యువ వృత్తి నిపుణులను ఆకర్షిస్తున్నాం. ముఖ్యంగా తూర్పు యూరప్ నుంచి వచ్చే వారి సంఖ్య ఎక్కువ. వైవిధ్యంతో కూడిన పని సంస్కృతిని ప్రేమించే యువతరం అక్కడ తగినంతగా ఉంది. భారతదేశంలో పనిచేయడానికి ఇష్టపడుతున్న తూర్పు యూరోపియన్లలో 20 ఏళ్ల వయస్సు వారు ఎక్కువ. 25,000 డాలర్లకు మించి కనీస వేతనం ఇవ్వడానికి తగిన పని అనుభవం వారికి ఉండదు. ముంబయిలో విద్యారంగంలోని క్లాప్ గ్లోబల్ అనే స్టార్ట్‌ప్ నాయకురాలు ఆర్తీ చాబ్రియా ఈ విషయం వివరించారు.
రష్యా, స్పెయిన్ తదితర దేశాల నుంచి తగిన యువ నిపుణులను తెచ్చుకోవడానికి తాము చాలా ఇబ్బందులు పడినట్లు ఆమె చెప్పారు. ‘దేశంలో ఉన్న విదేశీ టూరిస్టులతో సంప్రదించడం మా పనిలో భాగం. అందుచేత మాకు అంతర్జాతీయ సిబ్బంది అవసరం ఎంతైనా ఉంది. కాని వారికి ఉండాల్సినంత అనుభవం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.
ఈ దృష్టా చూస్తే విదేశీ ఉద్యోగికి 25,000 డాలర్లు కనీస వేతనం దండుగే అనిపిస్తోంది’ అని ఆర్తీ వివరించారు. 2013 నుంచి అనేక సందర్భాల్లో విదేశీ జాతీయులకు వర్తించే కనీస వేతనాన్ని తగ్గించే విషయమై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయినప్పటికీ నిబంధనల మార్పు జోలికి పోలేదు. ఫలితంగా ఇప్పటికీ 25,000 డాలర్ల కనీస వేతనం నియమం కొనసాగుతోంది. ముందు కొందరు విదేశీ జాతీయు లను ‘స్టైఫండ్’పై వలంటీర్లుగా నియమించాలన్న ప్రతిపాదన ఉందని ఆర్తీ చెప్పారు. ప్రస్తుతం అమలులో ఉన్న కనీస వేతన నియమం వాస్తవ దృష్టితో రూపొందించినది కాదని ఆమె వాదన. మన దేశంలో జీవన వ్యయాన్ని బట్టి విదేశీయులకు వేతనాలను నిర్ణయించాలన్నది ఆమె సూచన.
అమెరికాలో హెచ్-1బి వీసాల ‘తేనె తుట్టె’ కదిలింది. అక్కడ మాదిరిగా ఇక్కడ కూడా విదేశీ నిపుణ సిబ్బంది కనీస వేతనం పెంచ వలసి వస్తే దేశీయ కంపెనీల్లో విదేశీ సిబ్బంది నియామకం మరింత క్లిష్టతరమవుతుంది. దేశదేశాల్లోని విదేశీ జాతీయుల వేతనాల అంశం ప్రముఖంగా తెర మీదకు వచ్చి, చిన్నస్థాయి సంస్థలు ఆందోళనకు గురవుతున్నాయి.

– ఆరెఫా జోహారీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles