Home ఎడిటోరియల్ విస్తరించనున్న పడగ నీడ!

విస్తరించనున్న పడగ నీడ!

Kashmir

 

భిన్నాభిప్రాయాలు, తీవ్ర విభేదాలు గల ఏ వ్యవహారమైనా ప్రజాస్వామిక పరిభాషలో ఒక సమస్యే అవుతుంది. దానికి మన్నికైన పరిష్కారం విభేదిస్తున్న పక్షాల మధ్య చర్చల ద్వారా, ఇచ్చి పుచ్చుకునే పద్ధతి పాటించడంతోనే సాధ్యమవుతుంది. అలా కాకుండా బలవంతమైన పక్షం బలగాల ప్రయోగంతో ఏక పక్షంగా ప్రకటించి అమల్లోకి తెచ్చేది సమస్యకు శాశ్వతంగా తెర దించలేకపోగా అది మరింతగా పెరిగి పేట్రేగడానికే దోహదం చేస్తుంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ ఆవిర్భవించిన రాజ్యాంగం 370వ అధికరణను రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేస్తూ పునర్విభజించడం సాహసోపేతమైన చర్యలైనప్పటికీ సామరస్యపూర్వకమైన చర్చల ద్వారా, విభేదిస్తున్న వర్గాల మధ్య సమ్మతితో తీసుకున్నవి కావు.

కేంద్రంలోని ఎన్‌డిఎ 2 ప్రభుత్వం అమిత శక్తిసంపన్నమైన భద్రతా బలగాలను, తన ఎదురులేని శాసనాధికార బలాన్ని ప్రయోగించడం ద్వారా మాత్రమే ఈ చర్యలను గైకొన్నది. దీనినే 70 ఏళ్లుగా నానుతున్న సమస్యకు సాధించిన ఘనమైన పరిష్కారంగా ప్రభుత్వం చెప్పుకుంటున్నది. విభేదిస్తున్న వారు మాత్రం దీనిని ఏక పక్ష నిరంకుశ చర్యగా పేర్కొంటూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి కశ్మీర్ ప్రజల సమ్మతితో నిమిత్తం లేకుండా తీసుకొన్న ఈ చర్య చెల్లదని మరిన్ని దుష్ప్రరిణామాలకు దారి తీస్తుందని ఇది ఎంత మాత్రం మన్నికైన పరిష్కారం కాదని హెచ్చరిస్తున్నారు. అయితే కశ్మీర్ మెడలు వంచి బేషరతుగా దేశంలో కలుపుకొన్న ఈ నిర్ణయాలు హైందవ మత భావజాలం గూడుకట్టుకొన్న మెజారిటీ ప్రజలను అమితంగా సంతృప్తి పరుస్తున్న జాడలు కనిపిస్తున్నాయి.

ఇంత కాలం మనకు దూరమవుతున్నదేమోననే భయాలు కల్పించిన ప్రాంతాన్ని ఇలా కలుపుకోడం ద్వారా ఒక మంచి ముగింపును సాధించుకోగలిగామనే భావన వారిలో గూడుకట్టుకోడం సహజం. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలలో సైతం ఒకరిద్దరు ప్రభుత్వ చర్యలను సమర్థించడం గమనార్హం. జమ్మూ కశ్మీర్ మనకున్న అత్యంత సున్నితమైన సరిహద్దుల్లోని రాష్ట్రం. దేశ విభజన నేపథ్యంలో జరిగిన షరతులతో కూడిన కశ్మీర్ విలీనానికి ఆధారభూతమైన ఆర్టికల్ 370 అనంతర కాలంలో అనేక శాసనబద్ధ చర్యలతో నీరుగారిన మాట వాస్తవం. అయితే ఆ చర్యలన్నీ కశ్మీర్ అసెంబ్లీ ఆమోదంతో అక్కడి పాలక పక్షాల మద్దతుతో అమల్లోకి వచ్చినవే. ఇప్పుడు ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఉనికిలోలేని సమయంలో కేంద్రం తన జేబులోని మనిషి వంటి గవర్నర్ మద్దతుతో, బలగాల సహకారంతో ఆర్టికల్ 370ని పూర్తిగా రద్దు చేసి ఆ రాష్ట్ర స్వరూపాన్నే మార్చివేసి తన ప్రత్యక్ష అధికార ఛత్రం కిందికి తెచ్చుకున్నది.

ఇందుకు పూర్వ రంగంగా ఆ రాష్ట్రంలో తీవ్ర నిర్బంధాన్ని విధించింది. ఇది నిస్సందేహంగా అక్కడి ప్రజలలో అసంతృప్తిని రెచ్చగొడుతుంది. కశ్మీర్‌కు బయట గల భారతావనిలో మెజారిటీ ప్రజలు మెచ్చుకోడానికి, అక్కడి జనం నొచ్చుకోడానికి గల తేడా చెప్పనక్కర లేదు. ఓటు బ్యాంకు రాజకీయాల రీత్యా కేంద్రంలోని పాలక బిజెపి పెద్దలకు మిగతా భారత దేశంలోని అధిక సంఖ్యాకులు భళీ అని బల్లలు చరచడమే ముఖ్యం కావచ్చు, దానికి శాశ్వతంగా దేశాధికారాన్ని కట్టబెట్టే పరమాయుధం అదే కావచ్చు. కాని కశ్మీర్ ప్రజల సమ్మతి సహకారం లేకుండా ఆ ప్రాంతం బేషరతు విలీనం అనేది ఆచరణలో ఎప్పటికీ కల్లగానే మిగిలిపోతుంది. దానిని అలా తొక్కిపెట్టి ఉంచడానికి నిరంతరం అక్కడ అసాధారణ స్థాయిలో బలగాలను కొనసాగించవలసి వస్తుంది.

సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత కశ్మీర్‌ను తిరిగి రాష్ట్రం చేస్తామని హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన హామీ ఎప్పటికీ అమలుకు నోచుకోకుండా పోతుంది. ఇప్పటికే అక్కడ అమితంగా ధన వ్యయం చేస్తున్నామని బాధపడుతున్న భారత జాతి మున్ముందు పెట్టబోయే ఖర్చును భరించలేని స్థితి తలెత్తుతుంది. దాని వ్యతిరేక ప్రభావం జాతి జనుల జీవన ప్రమాణాల మీద పడుతుంది.

అన్నింటికీ మించి ఈసరికే పాకిస్థాన్ తన ఉగ్ర కుట్ర హస్తాన్ని అమితంగా ప్రయోగిస్తున్న జమ్మూ కశ్మీర్‌లో భవిష్యత్తులో అది మరింతగా టెర్రరిస్టులను ఉసిగొల్పి చిచ్చు పెట్టడానికి దోహదం చేస్తుంది. ఇప్పుడు కశ్మీర్‌కే పరిమితమై ఉన్న ఈ ఉగ్ర కుంపటి ఇక ముందు దేశమంతటికీ పాకి మన పోలీసులకు, భద్రతా దళాలకు కునుకు లేకుండా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అయోధ్యలో బాబరీ మసీదు కూల్చివేత అనంతరం దేశ వ్యాప్తంగా జరిగిన ఉగ్ర దాడుల భ్రష్ట చరిత్ర మరుగున పడక ముందే అటువంటి మరొక అంధకార అధ్యాయానికి తెర లేస్తే ఈ జాతి శాంతియుతంగా ఎలా మనగలుగుతుంది?

Problems in Kashmir with cancellation of Article 370