Home తాజా వార్తలు ఖరీఫ్‌కు ప్రతామ్నాయ ప్రణాళిక

ఖరీఫ్‌కు ప్రతామ్నాయ ప్రణాళిక

Cultivation

16నుంచి అమలు, జిల్లాలు, నేలల వారీగా అమలుకు సిద్ధం చేసిన జయశంకర్ వరిటీ

రాష్ట్రంలో ఖరీఫ్ సాగుకు తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు లేకపోవడంతో ఇప్పటి వరకు వేసిన పంటలు పలుచోట్ల మొలకెత్తలేదు. దుక్కులు పొడిబారి దుమ్ము లేస్తుంది. దీంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతాంగాన్ని అప్రమత్తం చేసింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాధారణంగా వేసే పంటలు కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాలని సూచించింది. వాస్తవానికి ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి జూలై 15వ తేదీ వరకు కురిసే వర్షాలను బట్టి సాధారణంగానే విత్తులు విత్తుకోవడం పద్ధతి. అయితే నైరుతి ఆలస్యంగా రావడంతో పాటు, వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో రైతులు వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో దిగాలు చెందుతున్నారు. కొందరైతే మళ్లీ సాగుకు పునుకుంటున్నారు. ఇప్పుడు ఇక దీర్ఘకాలిక రకాల విత్తనాలను వేసుకోవద్దని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది. అందులో భాగంగానే ప్రత్యామ్నాయ ప్రణాళికను ప్రకటించింది. దీని ప్రకారం నేల రకాలను బట్టి, స్వల్పకాలిక రకాల విత్తనాలనే వేసుకోవాలని స్పష్టం చేసింది.

మొత్తం 33 జిల్లాలకు ఆయా నేలలను బట్టి ఏయే పంటలను విత్తుకోవాలో తెలుపుతూ ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించింది. జూలై 16 నుంచి 31వ తేదీ వరకు, ఆ తరువాత ఆగస్టు 15వ తేదీ వరకు జిల్లాల వారీగా పంటల పేర్లు తెలిపింది. వరి కూడా స్వల్పకాలిక రకాలు జూలై 31 వరకు చేయవచ్చునని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో ఎరువుల వాడకంపై, నీటి ఆదాపై రైతులకు అవగాహన కల్పించనున్నారు. రైతులు ఇక అసలు పత్తి విత్తకూడదు. అలాగే చాలా వరకు దీర్ఘకాలిక రకమైన కందులు, మొక్కజొన్న పంట వేసుకోకపోవడమే మేలని ఆ ప్రణాళికలో స్పష్టంగా పేర్కొన్నారు. తేలికపాటి నేలల్లో ఆముదం, గడ్డి జొన్న, స్వల్పకాలిక కూరగాయలు, స్వల్పకాలిక రక కందులు విత్తుకోవాలని తెలిపింది. కొర్రలు, రాగులు సాగు చేసిన వర్షాలు అనుకూలించకపోయినా పంట వస్తుందని పేర్కొన్నారు. వర్షధార పంటల్లో కూడా చాలా తక్కువ నీటితో రెండు తడులు ఇస్తే పండే పంటల వైపు రైతులను మళ్లించనున్నారు.
స్వల్పకాలిక రకాలైన విత్తనాలను కూడా వ్యవసాయ శాఖ సిద్ధంగా పెట్టుకుంది. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, జాతీయ మెట్ట పరిశోధనల సంస్థ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా ఈ ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కూడా నైరుతి రుతు పవనాలు ఆలస్యం, రాష్ట్రంలోని పంటల సాగు పరిస్థితిపై జయశంకర్ వర్సిటీ శాస్త్రవేత్తలు, అధికారుల దగ్గర నుంచి నివేదికలు తెప్పించుకుని పలు సూచనలు చేస్తున్నట్లు తెలిసింది. విపత్కర పరిస్థితుల్లో పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.ఈ ఖరీఫ్‌లో 7.50 లక్షల మెట్రిక్ టన్నుల విత్తనాల పంపిణీ లక్షంగా ఉంది. ఇందులో ఇప్పటి వరకు కేవలం 3.93 లక్షల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే విక్రయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇందులో వరి ఈసారి 2.80 లక్షల విత్తనాల పంపిణీ లక్షం ఉండగా, ఇప్పటి వరకు 1.54 లక్షల క్వింటాళ్లు మాత్రమే అమ్ముడుపోయాయి. సోయాబీన్ 2.20 లక్షల క్వింటాళ్లకు గాను 1.43 లక్షల క్వింటాళ్లు విక్రయించారు. మొక్కజొన్న 80 వేల క్వింటాళ్లకు గాను, కేవలం 365 క్వింటాళ్లే రైతులు కొనుగోలు చేశారు.
39.38 లక్షల ఎకరాల్లో డ్రై క్రాప్స్
ప్రస్తుతం ఈ ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 1.08 కోట్ల ఎకరాలలో వివిధ పంటలు సాగవుతాయని ముందుగా అంచనా వేసింది. ఇప్పటి వరకు కేవలం 43.33 లక్షల ఎకరాలకే అంటే 40 శాతానికే పరిమితమైంది. అందులో అత్యధికంగా పత్తి 27.05 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇక ఆహారధాన్యాల సాగు సాధారణ విస్తీర్ణం 48.25 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 10.98 లక్షల (23%) ఎకరాలకే పరిమితమైంది. ఆహారధాన్యాల సాగులో కీలకమైన పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.82 లక్షల (46%) ఎకరాల్లో సాగైంది. అందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.29 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.66 లక్షల (50%) ఎకరాల్లో సాగైంది. మరో కీలకమైన వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, కేవలం 1.46 లక్షల ఎకరాల్లో మాత్రమే (6 శాతం) నార్లు పోశారు. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 12.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.15 లక్షల (33%) ఎకరాల్లో సాగైంది.సాధారణంగా 75.19 లక్షల ఎకరాల్లో డ్రై క్రాప్స్ సాగు చేయాల్సి ఉంది. ఇప్పటి ఇందులో సగమే 39.38 లక్షల ఎకరాల్లో డ్రై క్రాప్స్ సాగైనట్లు ప్రత్యామ్నాయ ప్రణాళికలో పేర్కొన్నారు.
320 మండలాల్లో లోటు వర్షపాతం
రాష్ట్రంలో 23 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో తీవ్రలోటు ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 320కుపైగా మండలాల్లో లోటు వర్షపాతం ఉన్నట్లు టిఎస్‌డిపిఎస్ పేర్కొంది. జూన్ 30వ తేదీ వరకు తీసిన సమాచారం ప్రకారం 122 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. ఇక వాతావరణ శాఖ లెక్కల ప్రకారం మూడు జిల్లాల్లో జూన్ ఒకటో తేదీ నుంచి బుధవారం నాటికి సాధారణంగా 181.8 ఎంఎంల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 58.3 ఎంఎంలే రికార్డు అయింది. జూన్, జులైలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 33 శాతం లోటు వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఈ కాలంలో ఇప్పటివరకు సాధారణంగా 197.8 మిల్లీమీటర్ల (ఎంఎం) వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 133.2 ఎంఎంలే రికార్డు అయింది.

Problems Of Kharif Cultivation