Home మంచిర్యాల ఓపెన్‌కాస్టు వైపే సింగరేణి అడుగులు

ఓపెన్‌కాస్టు వైపే సింగరేణి అడుగులు

SAND

కళ్యాణిఖని ఓపెన్‌కాస్టులో ఉత్పత్తి ప్రారంభం
భూ గర్భంలో 45.32 మిలియన్ టన్నుల బొగ్గు
ఓపెన్ కాస్టు జీవిత కాలం 20 సంవత్సరాలు
రూ. 417.30 కోట్లతో ఓపెన్‌కాస్టు పనులు

మంచిర్యాల : యాజమాన్యం ఓపెన్‌కాస్టుల ఏర్పాటు వైపే మొగ్గు చూపుతోంది. అండర్‌గ్రౌండ్ గనులను ఏర్పాటు చేసి, కార్మికుల పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించే మార్గం కానరావడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ఓపెన్‌కాస్టులు ఉండవని కేవలం అండర్ గ్రౌండ్ గనుల ద్వారా కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తామని స్వయంగా సిఎం కెసిఆర్ హామీఇచ్చినప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా సింగరేణి యాజమాన్యం ఓపెన్‌కాస్టుల వైపే మొగ్గు చూపుతుంది. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ పట్టించు కోవడం దు.నిరసనలు,ఆందోళనలు జరిగినప్పటికీ ప్రభుత్వం స్పందించకుండా సింగరేణి యాజమాన్యానికి వత్తాసు పలుకుతుండగా సింగరేణి యాజమాన్యం ఓపెన్‌కాస్టులను ఏర్పాటు చేస్తోంది. ప్రజల నుంచి భూ సేకరణ ద్వారా తీసుకున్న వివాదాలు కోర్టు మెట్లు ఎక్కగా సింగరేణి యాజమాన్యం ఓపెన్‌కాస్టులను ఏర్పాటు చేసి, బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తుంది. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి ఏరియాలో కళ్యాణిఖని ఓపెన్‌కాస్టులో బొగ్గు ఉత్పత్తిని నెల రోజుల క్రితం ప్రారంభించారు. యాజమాన్యం నిరాటంకంగా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. మందమర్రి ఏరియాలో మూసివేసిన సోమగూడెం-1, 1ఎ, 3, కళ్యాణిఖని -2, 2ఎ గనుల్లో మిగిలి ఉన్న బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు యాజమాన్యం ఓపెన్‌కాస్టును ఏర్పాటు చేసింది. కళ్యాణిఖని ఓపెన్‌కాస్టు ఏర్పాటుపై స్థానికులు సమీప గ్రామాల ప్రజలు తమ పంటపొలాలను నష్టపోయి జీవనాధారాన్ని కోల్పొతామని, పర్యావరణ సమస్యలు ఎదురవుతాయని ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమాలు చేపట్టగా అన్ని సంఘాలు మద్దతు పలికాయి. అయినప్పటికీ యాజమాన్యం వీటిని ఖాతరు చేయకుండా బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది. మందమర్రి ఏరియాలోని మూసివేసిన గనుల ప్రాంతంలో కళ్యాణిఖని ఓపెన్‌కాస్టును ఏర్పాటు చేసింది. అయితే ఓపెన్‌కాస్టు కింద 45.32 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, దీని జీవిత కాలం 20 సంవత్సరాలు ఉంటుందని నిర్ణయించారు. వెలికి తీసే బొగ్గు 30.54 మిలియన్‌టన్నుల కాగా ప్రాజెక్టులోతు 300 మీటర్లు , బొగ్గు రకం జి-10 గ్రేడ్ ఉంటుందని, అధికారులు ప్రణాళిక వేసుకున్నారు.దీనికిముందు రూ.417.30కోట్లతో 365.49మిలియన్ క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికితీశారు. ఈ ఓపెన్‌కాస్టు కోసం 800హెక్టార్ల భూమి అవసరం కాగా ఇందులో సింగరేణి సంస్థకు చెందిన భూములు 300 హెక్టార్లు ఉండగా మరో 490 హెక్టార్లను ప్రైవేట్‌వ్యక్తుల నుంచి సేకరించింది. ప్రతి సంవత్సరం 1.75 నుంచి 2 మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తి చేయాలని అంచనా వేసుకుంది. ఇదిలా ఉండగా అండర్‌గ్రౌండ్ గనులు నష్టాలతో నడుస్తున్నాయని, దీని వలన మందమర్రి ఏరియా గను ల్లో 540 కోట్ల నష్టాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా బొగ్గు ఉత్పత్తి లక్షాలు నెరవేరడం లేదని, మందమర్రి ఏరియాలో ఉన్న ఏకైక ఆర్‌కెపి-ఓసి ఏర్పాటు చేసినప్పటికీ నిర్ధేశిత బొగ్గు ఉత్పత్తి లక్షాలను చేరుకోవడం లేదు. దీంతో బొగ్గు ఉత్పత్తి కుంటుపడుతుందని, మందమర్రి ఏరియాకు మంచిరోజులు తేవడానికే కళ్యాణిఖని ఓపెన్‌కాస్టును ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నారు. కాగా కళ్యాణిఖని ఓపెన్‌కాస్టులో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావడంతో నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. భూములకు సంబంధించిన వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా సింగరేణి యాజమాన్యం మాత్రం నష్టపరిహారం చెల్లించకుండా గ్రామాలను బొందల గడ్డలుగా మార్చే ఓపెన్ కాస్టును ప్రారంభించిందని ఆందోళన చెందుతున్నారు.