Home తాజా వార్తలు జన తెలంగాణ స్వాప్నికుడు

జన తెలంగాణ స్వాప్నికుడు

05WLWGL01P1మన తెలంగాణ/వరంగల్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌సార్ జన తెలంగాణ స్వాప్నికుడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ప్రాథమిక లక్షంగా పనిచేసినప్పటికీ ఆయన భవిష్యత్ తెలంగాణ కోసం అనేక కలలుగన్నారు. రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో ఏర్పాటైన తెలంగాణ జెఎసికి ఆయన మార్గదర్శకుడిగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి, టిఆర్‌ఎస్ రాష్ట్రంలో తొలి ప్రభుత్వంగా కొలువుదీరి ఏడాది గడిచిన నేపథ్యంలో సార్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు. ఉద్యమ సహచరులు జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. నేడు జయశంకర్‌సార్ జయంతి సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

తొలి నుంచి పచ్చి తెలంగాణవాదిగా నిలిచిన మొండిమనిషిగా ఆయనకు పేరున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను చెప్పేముందు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నిధులు, నీళ్ళు, నియామకాలలో జరుగుతున్న అన్యాయాన్ని వాస్తవాలు, గణాంకాలతో వివరించేవారు. రాజకీయ రంగంలో ఆంధ్రానేతల ఆధిపత్యాన్ని ప్రశ్నించేవారు. రాష్ట్ర సాధనకు రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒక్కటి చేసినపుడు ఫలితం లభిస్తుందని తేల్చిచెప్పేవారు.

రాజకీయ భిన్నాభిప్రాయాలున్నప్పటికీ సమయం, సందర్భానుసారంగా కలిసి అడుగువేయాలని చెప్పి ఆ విధంగా ఉద్యమానికి మార్గదర్శకుడయ్యారు. ‘మా తరంతో పోల్చితే ఈ తరం యువత రాజకీయ చైతన్యం కలిగి ఉన్నారని. ఇక రాష్ట్రాన్ని ఆపడం ఎవరితరం కాదనే నమ్మకాన్ని కలిగించేవారు. కాంగ్రెస్,టిడిపి, కమ్యూనిస్టులు, నక్సలైట్‌పార్టీలనే తేడా లేకుండా రాజకీయ విమర్శచేస్తూనే రాష్ట్ర సాధన ఆవసరాన్ని విడమరిచిచెప్పేవారు. నిజంగానే ఆయన మార్గదర్శనం ఉద్యమ ఎత్తుపల్లాలో ఎంతో ఉపకరించింది. ముఖ్యంగా 69 ఉద్యమ అనుభవం నేపథ్యంలో హింసకు తావివ్వకుండా రాష్ట్రాన్ని సాధించేందుకు ఓపికగా వ్యవహరించారు.
నేడు జయంతోత్సవం
జయశంకర్‌సార్ జయంతి ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలిసారి అధికారికంగా ఆయన జయంతిని నిర్వహించనున్నందున అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన పేరుతో ఏర్పాటు చేసిన స్మృతివనం (ఏకశిలపార్కు)లోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా జరిగే సార్ జయంతి కార్యక్రమంలో అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలని టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవిందర్‌రావు, గ్రేటర్ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్‌లు కోరారు. తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.