* రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు
* కొత్త జిల్లాల్లో రింగు రోడ్డులు
* ప్రతి గ్రామం నుండి మండలానికి…
మండలం నుంచి జిల్లాకు రహదారి సౌకర్యం
* ఆరు నెలలో నిర్మాణాల పూర్తికి కార్యాచరణ
ఉమ్మడి జిల్లాలో రహదారుల నిర్మాణానికి ప్రభు త్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. ఇందులో భాగంగానే ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి, అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు రోడ్డు మార్గాలను నిర్మించబోతుంది. దీని కోసంగాను ప్రభు త్వం కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసింది. ఓ వైపు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనూ మరోవైపు ఆర్‌అండ్‌బి ఆధ్వర్యంలో ఈ రోడ్లను నిర్మించతలపెట్టారు. దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాల కింద కూడా ఈ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రణాళికలను రూపొందించారు. ముఖ్యంగా మారుమూల పల్లెలకు రోడ్డు సౌకర్యాన్ని తప్పనిసరి చేస్తున్నారు. ఇక నుంచి రోడ్డు లేని గ్రామమంటూ ఉండకుండా ప్రణాళికలకు పదును పెడుతున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరవుతుండడంతో సంబంధిత అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలను రూపొందించి పనుల ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ఇంజనీరింగ్ అధికారులు తమ తమ శాఖల పరిధిలో చేపట్టబోయే పనులకు సంబంధించి యాక్షన్‌ప్లాన్ రూపకల్పనలో నిమగ్నమయ్యారు. వీటికి తోడుగా పెండింగ్‌లో ఉన్న రోడ్లకు కూడా మోక్షం కల్పించే లక్షంతో అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే అటవీ శాఖ అనుమతులు ఇవ్వకుండా నిలిచిపోయిన రోడ్లను సైతం పూర్తి చేసేందుకు ఆ దిశగా అధికారులు సమాయత్తం అవుతున్నారు. అనుమతుల జారీ కోసం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరపడం అలాగే అటవీ, పర్యావరణానికి సంబంధించిన నష్టాలు, ఆ నష్టాలను తీర్చేందుకు మరో చోట పరిహారం రూపంలో భూముల కేటాయింపు లాంటి అంశాలను సైతం పరిగణలోకి తీసుకొని సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ తీసుకోబోతున్నారు. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ పరిధిలో నిర్మల్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో చాలా చోట్ల అటవీ శాఖ క్లియరెన్స్ లేక రోడ్డు పనులు నిలిచిపోవడంతో అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. నిర్మాణాల అంచనాలు పెరగడం అలాగే భూ సేకరణ సమస్య లాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇలా రోడ్లను నలు దిశలా నిర్మిస్తూనే మరోవైపు కొత్తగా ఏర్పాటైన నిర్మల్, మంచిర్యాల, కొమరంభీమ్ జిల్లాలలో రింగ్ రోడ్లను నిర్మించాలని తలపెడుతున్నారు. రోజురోజుకు జిల్లా కేంద్రాలలో జనాభా పెరిగిపోవడం, ట్రాఫిక్ తీవ్రమవడంతో ఆ సమస్యకు పరిష్కార మార్గంగా రింగ్ రోడ్ల నిర్మాణాలను ఎన్నుకుంటున్నారు. ఈ రింగ్ రోడ్లు మూడు, నాలుగు వైపుల నుంచి పట్టణానికి అనుసంధానం చేయబోతున్నారు. ఇప్పటికే రింగ్ రోడ్లకు సంబంధించిన ప్రణాళికలను పంచాయతీరాజ్ శాఖ, ఆర్‌అండ్‌బీ శాఖలు అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి అనుమతుల కోసం నివేదించాయి. నిధులు, అనుమతులు మంజూరు కాగానే పనులను చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. మొత్తానికి ఈ రోడ్ల నిర్మాణాలతో ఉమ్మడి జిల్లాకు ప్రగతి బాటలు పడనున్నాయని అంటున్నారు.