Home ఖమ్మం పర్యావరణ పరిరక్షణకు సహకరించండి

పర్యావరణ పరిరక్షణకు సహకరించండి

Environment

 

మొక్కలను నాటి లక్షాన్ని అధిగమించండి
రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

ఖమ్మం/కామేపల్లి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తూ పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వేత్తున కొనసాగిస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మాత్యులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు, శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మినారాయణ, ఖమ్మం, వైరా శాసన సభ్యులు పువ్వాడ అజయ్‌కుమార్, లావుడ్యా రాములు నాయక్, ఖమ్మం నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ గుగులోత్ పాపాలాల్‌తో కలిసి రిజర్వ్ ఫారెస్టు రామస్వామి గుట్టలో నాటిన మొక్కలను పరిశీలించారు.

కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ రిజర్వ్ ఫారెస్టులో తొలుత మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 3.30 కోట్ల మొక్కలు నాటే లక్షాన్ని అధిగమించి నాటిన ప్రతి మొక్కను బతికించి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంతో పాటు ప్రజా ప్రతినిధులు, ప్రజలపై కూడా ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా శాఖలకు ఇచ్చిన లక్షాలను అధిగమించి మొక్కలు నాటి పరిరక్షించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు, చీఫ్ కన్వర్వేరటర్ ఆఫ్ ఫారెస్టు పివి. రాజారావు, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి బెల్లం ఇందుమతి, జిల్లా అటవీశాఖ అధికారి ప్రవీణ, ఖమ్మం నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ ప్రసాద్, ఖమ్మం నగర పాలక సంస్థ కార్పొరేటర్లు కమర్తపు మురళి, సీహెచ్. నాగేశ్వరరావు, పగడాల నాగరాజు, చావా నారాయణరావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Protect the Environment with planting of plants