Home ఎడిటోరియల్ రాజ్యాంగ పరిరక్షణ ప్రజల బాధ్యత

రాజ్యాంగ పరిరక్షణ ప్రజల బాధ్యత

constitutional-protectionఅన్నెం-పున్నెం ఎరుగని ఓ ఏభైయేండ్ల వ్యక్తిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాద్రీ జిల్లా బిసాద గ్రామంలో గోమాంసం తిన్నావని ఇంటిలో నుంచి బయటకి లాగి, అమానుషంగా కొట్టి చివరకి ప్రాణాలు తీసిన దుర్ఘటన కార్చిచ్చులా నలుమూలల వ్యాపించింది. ఈ 200 మంది ఉన్మాద అల్లరిమూక వెనుక ఉన్న పైశాచిక శక్తులను ఉరికంబానికి ఎక్కించాలని అంటే అతిశయోక్తి కాదు! మహమ్మద్ అఖ్లాక్ తిన్నది గోమాంసం కాదు గొర్రే మాంసం . తన ఇంట్లోని ఫ్రీజ్‌లో ఉన్న మాంసాన్ని ఫోరెన్సిక్ పరీక్షలు దీన్ని ధృవపరి చాయి. ప్రపంచంలో బీఫ్ మాంసా న్ని ఎగుమతి చేసే దేశాలలో మన దేశం ప్రముఖ కిరీటాన్ని ధరించింది. ప్రభుత్వానికి ఈ కిరీటాన్ని గిరవాటు వేయగల దమ్ములున్నాయా? ప్రతిమతంలో కొన్ని ప్రియతమైనవి ఉన్నాయి. వాటిని ఇతర మతాలపై రుద్దడం మర్యాద కాదు. ఆహార వ్యవహారాలు తమ తమ హద్దులలో ఉంటాయి.

చాలా మంది కుడిచేతితో తింటే కొందరు ఎడమ చేతితో తినేవారు ఉన్నారు. వారిని కాదనలేం!పైగా రెండు చేతులతో తినేవారు కూడా ఉన్నారు కాని వాళ్లను పట్టించుకునే వారు లేరు. మన ప్రధాన మంత్రి మోదీగారి దిల్లిలోని నివాసానికి కేవలం 30 మైళ్ళలో ఉన్న దాద్రీలో జరిగిన వాస్తవం ఇది. ఈలవేస్తే వినిపించేంత దూరంలో ఉన్నదాద్రీలో జరిగిన భయంకర దుర్ఘటన గురించి ఒ ముక్కకూడ తన గొంతులో నుంచి పెగిలి రాలేదు. మన ప్రధాని గారికి కిచకిచలాడే (ట్విటర్) అలవాటున్నది. కనీసం అందులో కూడా తన ఓ సానుభూతి రాగం ఆలాపన చేయలేదు!? అసలు వారి చెవిన పడనట్లు వ్యవహరించారు.

ఓ కవి సమ్మేళనంలో ఓ వ్యంగకవి చెప్పినట్లు: ‘మన్మోహన్‌సింగ్‌గారు చెప్పేవారు కాదు… మోడీ గారు వినిపించుకునే వారు కాదు….’ అలాగే మోదీ గారు, ‘నా చతీ యాభై ఆరు ఇంచులూ (తనెంత ధైర్యవంతుడో అని చెప్పడానికి ) అని చెప్పగా ఆ వ్యంగ్య కవి ‘పెండ్లి చేసుకొని భార్యను మరచిపోయే విధానం ఉంటే మా చాతీ కూడా అంతే ఉంటుంది’ అని చెప్పాడు. ఇక్కడ చెప్పొచ్చేదేమి టంటే భావ స్వాతంత్య్రం గురించి. భావ స్వాతంత్య్రాన్ని ధైర్యం గా ప్రకటించిన కొందరు సాహిత్య వేత్తలను కూడా హిందుత్వాన్ని తమ తలలపై మోసుకొని తిరుగు తూన్న తీవ్రవాదులు చంపుక తిన్నారు. దానికి నిరస నగా సాహిత్య అకాడమి నుంచి పొందిన గౌరవ పురస్కారాలను కొందరు తిరిగి ఇచ్చేసారు. ఇదో చెంపదెబ్బ.

గోమాంసం నేపథ్యంలో కొందరు మహాను భావులు , పరిశోధకులు వేదాలను త్రవ్వి నిజాన్ని బట్టబయలు చేశారు, గోమాంసం లేనిదే భోజనం చేసేవారు కాదని! ఈ విషయం పామరులకు కూడ అర్థమై పోయింది. ఇది కేవలం చెడ్డరాజకీయమని, హిందు త్వాన్ని మరో విధంగా ప్రజలపై రుద్దుతున్నా రని, హిందూమతాన్ని వేరే వాళ్లు గౌరవించడం లేదనే కుంటిసాకుతో ఇతర మతాలపై విరుచుకు పడడం వారి కుబుద్దికి నిదర్శనం. హిందూమతాన్ని కించపరుస్తూన్న అసలుసిసలైన వాళ్లు సంఘ్ పరివార్, ఆర్.ఆర్.ఎస్, బి.జే.పి వగైర వగైర లాంటి లైకింగ్ మైండ్స్ !మాత్రమే.

మరొక్క మాట: పదహారు (వయసు) గురించి అందరికి తెలుసు అదేలా ఉంటుందో! మన ప్రధాన మంత్రిగారు పద హారు నెలలు అయింది ప్రమాణ స్వీకారం చేసి. సంవిధానాన్ని మరియు భారతీయులందరిని కను రెప్పలా కాపాడుతానని చెప్పారు ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారి గారితో. మతం, వర్ణభేదం లాంటి వేమి పట్టించుకోకుండా అందరినీ ఒకే చూపుతో చూస్తానన్నారు. అప్పట్లో సాధారణ ప్రజలు అర్థం చేసుకోలేక పోయారు. కొన్నాళ్ల తర్వాత అర్థమైంది వారి చూపు ఒకే వైపు ఉన్నదని . అదే కాషాయవర్ణం, వారికి ఇష్టమైన రంగు అని. ఎందరో ముస్లిం రాజకీయ నేతలు , పెద్దలు, బుద్దిమంతులు కాంగ్రెస్ ప్రభుత్వంతో విసుగుచెంది, మోదీ గారిని గెలుపించాలని , ఓ ‘మార్పు’ ఆశిం చారు. కాని వారు పప్పులో కాలువేశారు. చిరుత తన మచ్చలను మార్చుకోలేదని నిరూపించబడింది. అఖండ భారతదేశాన్ని కాషాయ వర్ణంతో పులుము కోవాలని పగటి కలలు కంటున్నది! అని అర్థం చేసుకొన్నారు.

ఒక వేళ దేవుడు, మహాత్ముడితో పాటు భారత స్వాతంత్య్ర సమరంలో పొరాడి తమ ధన, మాన, ప్రాణాలను కోల్పోయి స్వరాజ్యం సంపాదించిన సమరయోధులను, వారి భారతదేశాన్ని ఓ సారి దర్శించిరండి అని భూలోకానికి పంపిస్తే… “దేవుడా నువ్వుకూడా మానవుల్లాగే తప్పిదం చేశావు. ఎక్కడ చూసి రమ్మని… ఎక్కడికి పంపించావ్? అది మేమున్న భారతదేశం కాదు!” అని చెప్తారు. ‘దాద్రి ఘటన దుర్మార్గం’ అని కనీసం అయోధ్య సాధువులు సైతం ఖండించినా, ప్రధాని గారికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. దాద్రీ ఘోరం మతసామరస్యానికిది గొడ్డలి పెట్టు. ఇది నూటికి నూరు శాతం చెడ్డ రాజకీయమని అందరికి తెలిసిన పచ్చి నిజం. కేవలం హిందు త్వాన్ని తలమీద పెట్టుకొని తైతక్కలాడుతూన్న పిశాచ శక్తులకు తప్ప అన్నీ మతాల వారు ఇలాంటి దుర్ఘటనలను ఎదుర్కోవ డానికి ఐక్యమై మూకుమ్మడిగా తమ నిరసనలను కొనసాగించాలి. మన రాజ్యాంగాన్ని రక్షించు కోవాలి.