Home అంతర్జాతీయ వార్తలు అమెరికాలో ఆగని నిరసనలు

అమెరికాలో ఆగని నిరసనలు

Protests continue in america curfue

 

చాలావరకు శాంతియుతంగానే ఆందోళనలు
ఫ్లాయిడ్ కేసులో మరో ముగ్గురు పోలీసులపై కఠిన అభియోగాలు

మినియాపొలిస్: పోలీసుల చేతిలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి నిరసనగా, జాతి వివక్షకు నిరసనగా అమెరికాలోని నగరాల్లో బుధవారం కూడా భారీ ప్రదర్శనలు జరిగాయి కానీ గతానికి భిన్నంగా ఈ ప్రదర్శనలు శాంతియుతంగా జరగడం గమనార్హం.

కాగాజార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంతాన సూచకంగా ఆయన చనిపోయిన మినియాపోలిస్‌తో పాటుగా, ఆయన స్వస్థమైన నార్త్ కరోలినాలోని రాఫోర్డ్, ఆయన జీవితంలో ఎక్కువ కాలం గడిపిన హ్యూస్టన్‌లోను గురువారంనుంచి సం తాప సమావేశాలు వరసగా జరగనున్నాయి. మరోవైపు ఫ్లాయిడ్ హత్యకు సంబంధించి ప్రధాన నిందితుడు డెరెక్ జావిన్‌పై సెకండ్ డిగ్రీ హత్యానేరం కింద కేసు నమోదు చేయడమే కాకుండా మరో ముగ్గురు పోలీసులపైనా హత్యకు ప్రోత్సహించారన్న అభియోగాల కింద కేసులు నమోదు చేయడం కూడా నిరసనలు కాస్త సద్దు మణగడానికి కారణమైనాయి. ఒక వేళ నేరం రుజువైతే ఈ ముగ్గురు పోలీసులకు 40 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాగా ఆందోళనలకు సంబంధించి దేశవ్యాప్తంగా పదివేల మందికి పైగా అరెస్టు చేసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. అల్లర్లలో మరో డజను మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

బుధవారం కూడా చాలా నగరాల్లో భారీ నిరసన ప్రదర్శనలే జరిగాయి కానీ పోలీసులు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండా మౌనంగా ఉండిపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా ఫ్లాయిడ్ మృతికి సంతాపం తెలియజేస్తూ గురువారం మధ్యాహ్నం మినియాపోలిస్‌లో తొలి సంతాప సభ జరగనుంది. ఈ సభలో పౌర హక్కుల ఉద్యమ నాయకుడు అల్ షర్పటన్‌తో పాటు ఫ్లాయిడ్ కుటుంబం తరఫు న్యాయవాది బెన్ క్రంప్ పాల్గొంటారు. ఆ తర్వాత ఫ్లాయిడ్ మృత దేహాన్ని ఆయన జన్మస్థమైన నార్త్ కరోలినాలోని రాఫోర్డ్‌కు తీసుకు వెళ్తారు. ఆదివారం అక్కడ సరిగే స్మారక కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొంటారు. కాగా సోమవారం హ్యూస్టన్‌లో జరిగే కార్యక్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ కావచ్చని భావిస్తున్న జో బిడెన్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. అనంతరం మృతదేహం అత్యక్రియలు జరుగుతాయి.

ఫ్లాయిడ్‌కు కరోనా పాజిటివ్
ఇదిలా ఉండగా, పోలీసుల చేతిలో నరహత్యకు గురయిన జార్జ్ ఫ్లాయిడ్ పూర్తి శవపరీక్ష నివేదికను వైద్యులు బుధవారం విడుదల చేశారు. అనేక క్లినికల్ విషయాలు వెల్లడించిన ఆ నివేదిక ఫ్లాయిడ్‌కు గతంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించింది. అయితే వైరస్ లక్షణాలు అతనిలో పైకి కనిపించకుండా ఉండవచ్చని తెలిపింది. హెన్నెపిన్ కౌంటీ మోడికల్ ఎగ్జామినర్ కార్యాలయం విడుదల చేసిన ఈ 20 పేజిల నివేదిక కుటుంబ సభ్యుల అనుమతితో విడుదలైంది. ఈ సందర్భంగా చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ ఆండ్రూ బేకర్ మాట్లాడుతూ ‘మెడపై తీవ్రమైన ఒత్తిడివల్లే ఫ్లాయిడ్ మరణించాడు. అతడు మరణించిన తీరుటి దీన్ని నరహత్యగా పేర్కొనవచ్చు’ అని అభిప్రాయపడ్డారు. గత ఏప్రిల్ 3న ఫ్లాయిడ్‌కు కరోనా పాజిటివ్‌గా పరీక్షించారని, కానీ లక్షణ రహితంగా ఉన్నాడని వెల్లడించారు. మరణించిన సమయంలో ఫ్లాయిడ్ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా కనిపించాయని కూడా తెలిపారు.

Protests continue in america curfue