Saturday, April 20, 2024

సూడాన్‌లో ఉధృతమవుతున్న నిరసనలు

- Advertisement -
- Advertisement -

Protests erupt across Sudan

సైన్యం కాల్పుల్లో 10కి చేరిన మృతులు
30న భారీ ప్రదర్శనలకు సన్నాహాలు

కైరో: పౌర ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సూడాన్‌లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. రాజధాని ఖార్‌టౌమ్ దాని జంట నగరమైన ఓమ్‌డుర్మన్‌లో మంగళవారం కూడా నిరసనలు కొనసాగాయి. బారికేడ్లను ఛేదించుకొని ఆందోళనకారులు రహదారులపైకి చేరుకున్నారు. టైర్లు కాల్చి నిరసన తెలిపారు. నిరసనకారులను చెదరగట్టేందుకు సైన్యం జరిపిన కాల్పుల్లో మంగళవారం ఉదయానికి 10 మంది చనిపోగా, 140మందికిపైగా గాయపడ్డారు. సోమవారం ఉదయం సూడాన్‌లో సైనిక తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే. సూడాన్‌లో ప్రజాస్వామ్యాన్ని కోరుతున్న సూడానీస్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్, సూడాన్ పాపులర్ లిబరేషన్ మూమెంట్‌నార్త్ సైనిక తిరుగుబాటుకు నిరసనగా వీధుల్లోకి రావాలని ఆ దేశ ప్రజలకు పిలుపునిచ్చాయి. శనివారం(ఈ నెల 30న) దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శనలకు సన్నాహాలు జరుగుతున్నాయి.

తిరుగుబాటు అనంతరం ప్రధాని అబ్దల్లా హామ్‌డాక్‌తోపాటు మరికొందరు మంత్రుల్ని సైన్యం నిర్బంధించి రహస్య ప్రాంతానికి తరలించింది. రాజకీయ ముఠాల మధ్య వైషమ్యాలకు అంతం పలికేందుకే తిరుగుబాటు జరిపామన్న జనరల్ అబ్దెల్‌ఫతాహ్ బుర్హాన్ మంగళవారం మరోసారి వివరణ ఇచ్చారు. ప్రధాని హామ్‌డాక్‌ను భద్రత కోసమే తన సొంత ఇంట్లో ఉంచానని బుర్హాన్ తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. రెండేళ్ల క్రితం నియంత ఒమర్ అల్‌బషీర్‌ను పదవీచ్యుడిని చేసిన తర్వాత సూడాన్‌లో ప్రజాస్వామిక ప్రక్రియను ప్రారంభించారు. అందులో భాగంగా సైన్యం, పౌర నేతల సంయుక్త భాగస్వామ్యంతో హామ్‌డాక్ నేతృత్వంలో ప్రభుత్వం, సార్వభౌమాధికార మండలిని ఏర్పాటు చేశారు.

జనరల్ బుర్హాన్ తన నేతృత్వంలోని మండలిని మరో నెల రోజుల్లో పౌర నాయకత్వానికి బదిలీ చేయాల్సి ఉండగా తిరుగుబాటు చేయడం గమనార్హం. ప్రస్తుతం సైనిక మండలి నేతగా సూడాన్ పరిపాలనా బాధ్యతల్ని జనరల్ బుర్హాన్ చేపట్టారు. 2023 జులైలో ఎన్నికలు నిర్వహించే వరకూ తాను అధికారంలో ఉండనున్నట్టు తాజా ప్రకటనల ద్వారా తెలిపారు. సూడాన్ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం కానున్నది. ఆందోళనకారులపై హింసను వెంటనే నిలిపివేసి, ఇంటర్‌నెట్‌ను పునరుద్ధరించాలని సైనిక ప్రభుత్వానికి అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ పిలుపునిచ్చారు. సూడాన్‌లో అస్థిరతను తొలగించేందుకు తమ సహకారముంటుందని బ్లింకెన్ అన్నారు. సూడాన్‌కు గతంలో అమెరికా ప్రకటించిన 700 మిలియన్ డాలర్ల సహాయాన్ని నిలిపివేస్తున్నట్టు బ్లింకెన్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News