*పాలేరు జలాశయం పక్కనే ఉన్న భూములు బీడుగా మారాయి
*పాలేరుకు 50కిలోమీటర్ల దూరంలో ఉన్న భక్తరామదాసు ఎత్తిపోతల పథకానికి నీరు ఎలా వెళ్తున్నాయి..?
*పది కిలోమీటర్ల పక్కనే ఉన్న మోతె మండలానికి నీళ్లు రావా..?
*పాదయాత్ర చేస్తున్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి
*పాదయాత్రకు సంఘీభావం తెలిపిన సిపిఎం నాయకులు
మన తెలంగాణ/మోతె: పాలేరు రిజర్వాయర్ నుండి ఎత్తిపోతల పథకం ద్వారా మోతె మండలంలోని అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలకు సాగు నీటిని అందించాలనే సంకల్పంతో పాదయాత్ర చేపట్టినట్లు కోదాడ శాసనసభ్యురాలు నలమాద ఉత్తమ్ పద్మావతిరెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం ఆంజనేయ స్వామి విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీడు భూములను సాగులోకి తేవాలనే పట్టుదల, ఎజెండాతో పాలేరు జలాశయం నుండి పాదయాత్ర సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు చివరి భూములకు నీరు అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని ఆమె అన్నారు. పక్కనే ఉన్న పాలేరు రిజర్వాయరు నుండి 50 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న భక్త రామదాసు ఎత్తిపోతల పథకం చేపట్టి నీటిని తీసుకెళ్తున్నారని చెప్పారు. పక్కనే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతె మండలానికి నీరు ఇవ్వడం సాధ్యం కాదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్ ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి మభ్యపెడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీసర సంతోష్‌రెడ్డి, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు ముదిరెడ్డి మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రలలో అఖిలపక్ష పార్టీ నాయకులు, రైతు సంఘాలు, మహిళా సంఘాలు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిద్రపోతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మేలుకొల్పాలని ఈ పాదయాత్రను చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు బూర్ల శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపిపి ఆరె లింగారెడ్డి, పందిళ్లపల్లి పుల్లారావు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు వీరండి రమాచారి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తండు సంజీవ్‌గౌడ్, రావిపహాడ్ గ్రామ శాఖ కార్యదర్శి ఎడ్ల పద్మారావు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటీసిలు ప్రతి పక్ష పార్టీ నాయకులు ఈ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు.
పాదయాత్రకు సిపిఎం సంఘీభావం
మండల కార్యదర్శి బాబు నాయక్, యేసు, సత్యం, గోపాల్‌రెడ్డి, జలాబి, శ్రీనివాస్, లక్ష్మమ్మ, రాజిరెడ్డి, శ్రీను తదితరులు ఈ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.