Saturday, April 20, 2024

మృత నిబంధనతో కేసులు

- Advertisement -
- Advertisement -

Provision of Section 66A of the IT Act deprives freedom of expression

దేశాలు, సమాజాలు తమకు తాము నిర్దేశించుకొనే విధి నిషేధాల మాల వంటివి రాజ్యాంగాలు. వాటి ప్రకారం అక్కడ చట్టాలు, జీవన నియమాలు నెలకొంటాయి. వాటిని రూపొందించడానికి, కాపాడడానికి చట్ట సభలు, న్యాయ, పోలీసు తదితర వ్యవస్థలు పటిష్ఠంగా రూపు దిద్దుకుంటాయి. అవి తమకు అప్పజెప్పిన బాధ్యతలను అందుకు సంబంధించిన విధి విధానాల ప్రకారం నిర్వర్తించినప్పుడే అక్కడ రాజ్యాంగ బద్ధ సామాజిక జీవనం శోభాయమానంగా వర్థిల్లుతుంది. అవి ఆ బాధ్యతను విస్మరించి ఇష్టావిలాసంగా వ్యవహరిస్తే అందుకు తీవ్ర విఘాతం కలుగుతుంది. దేశంలో ఈ ఉల్లంఘన, అతిక్రమణ పోలీసు వ్యవస్థలో తరచుగా జరిగిపోతున్న చేదు నిజాన్ని ఎవరూ కాదనలేరు. ఇందుకు తాజా ఉదాహరణగా సమాచార సాంకేతిక (ఐటి) చట్టం 66ఎ సెక్షన్ అది అంతరించిపోయిన తర్వాత కూడా సజీవంగా అమలవుతున్న తీరు దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. ఈ మృత నిబంధనను పోలీసులు తమ రాజకీయ యజమానులైన పాలకుల సంతృప్తి కోసం పౌరుల మీద యధేచ్ఛగా సంధిస్తున్నారని తేలింది.

సామాజిక మాధ్యమాల్లో, ఇంటర్‌నెట్ ఆధారిత సమాచార వ్యవస్థల్లో ఆన్‌లైన్‌లో చేసే విమర్శలకు, వ్యతిరేక వ్యాఖ్యలకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించడానికి అవకాశం కల్పించిన 2000 నాటి ఈ నిబంధనను ఆరేళ్ల క్రితం 2015లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఐటి చట్టం 66 ఎ సెక్షన్ నిబంధన అతి పవిత్రమైన, భావ ప్రకటన స్వేచ్ఛను బలి తీసుకుంటుందనే కారణం మీద న్యాయమూర్తులు జె. చలమేశ్వర్, ఆర్‌ఎఫ్ నారిమన్‌ల ధర్మాసనం దానిని తొలగించింది. రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన మనోభావాల వ్యక్తీకరణ స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కును ఈ సెక్షన్ కాలరాస్తున్నదని జస్టిస్ నారిమన్ అభిప్రాయపడ్డారు. ఇది దుర్వినియోగం కాకుండా చట్టంలో కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవచ్చునని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాను దీనిని అక్రమంగా ప్రయోగించబోనని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ధర్మాసనం అందుకు అంగీకరించలేదు. ప్రభుత్వాలు తరచూ మారుతుంటాయి గనుక అటువంటి హామీలకు విలువ ఉండదని స్పష్టం చేసింది.

దేశ అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగ విరుద్ధమైనదని ఢంకా బజాయించి రద్దు చేసిన ఈ సె క్షన్ కింద ఆ తర్వాతనే అనేక మంది మీద అనేక కేసులను పోలీసులు నమోదు చేశారంటే దేశంలో చట్టం, న్యాయం ఎదుర్కొంటున్న సంకట పరిస్థితి ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ అడ్వొకసి గ్రూప్ ఇంటర్‌నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ అనే సంస్థ సివిక్ డేటా ల్యాబ్‌తో కలిసి దేశంలోని 11 రాష్ట్రాల్లో జరిపిన పరిశీలనలో ఈ సెక్షన్ ఇంకా సజీవ సర్పమై పౌరులను కసిదీరా కాటేస్తున్న తీరు కళ్లకు కట్టింది. సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత ఈ రాష్ట్రాల్లో సెక్షన్ 66 ఎ కింద 1307 కేసులు నమోదయ్యాయని ఈ నివేదిక వెల్లడించింది. పౌరుల వాక్ స్వాతంత్య్రం పాలకులకు ఇబ్బందికరంగా పరిణమిస్తున్నదనిపించినప్పుడు చచ్చిన పాములకు కూడా ప్రాణం పోసి ప్రజల మీద ప్రయోగించడానికి మన పోలీసులు ఏ మాత్రం వెనుకాడడం లేదని రూఢి అవుతున్నది. ఆన్‌లైన్ విమర్శలు, వ్యాఖ్యలు ఆధార రహితమైనవని తేలినప్పుడే సందేహాతీతంగా రుజువైనప్పుడు చట్ట ప్రకారం చర్య తీసుకోడం ఆక్షేపణీయం కాదు.

అటువంటి రుజువులేమీ లేకుండానే కేసులు పెట్టి, అరెస్టులు చేసి వేధించడం జరుగుతున్నది. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్‌లో ఈ దుర్మార్గం నిరాఘాటంగా సాగిపోతున్నట్టు బోధపడుతున్నది. ఇటువంటి ఒక కేసును అలహాబాద్ హైకోర్టు కొట్టి వేసిన తర్వాత కూడా మరో కేసులో ఐటి చట్టం 66 ఎ సెక్షన్ కింద ప్రాథమిక అభియోగ పత్రం (ఎఫ్‌ఐఆర్) దాఖలైన ఉదంతం సుప్రీంకోర్టు ధర్మాసనం ఎత్తి చూపింది. అయితే ఈ దుర్వినియోగం ఇక్కడే ఆగిపోడం లేదు. జాతీయ భద్రతా చట్టం, దేశ ద్రోహ నేరారోపణ చట్టం వంటి శాసనాలను కూడా పోలీసులు దుర్వినియోగం చేస్తున్నట్టు రుజువవుతున్నది.పాలక పీఠాల్లోని వారికి ఏ మాత్రం అసౌకర్యం కలిగించే వ్యాఖ్య లు సామాజిక మాధ్యమాల్లో కనిపించినా పోలీసులు అతి తీవ్రమైన దేశద్రోహ నేరం వంటి అభియోగాలతో వారి మీద కేసులు దాఖలు చేయడానికి వెనుకాడరని వెల్లడవుతున్నది. ఇది దేశంలో అతి మౌలికమైన ప్రజాస్వామ్య స్వేచ్ఛ అయిన భావ ప్రకటనకు శాశ్వత సమాధి నిర్మించే నిరంకుశ వైఖరి.

ఇప్పటికైనా పై స్థాయి న్యాయ, పోలీసు వ్యవస్థలు దీనిని గుర్తించి కింది వరకూ తగిన ఆదేశాలు ఇచ్చి సెక్షన్ 66ఎ కింద మరొక్క కేసు కూడా నమోదు కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయవలసి ఉంది. పత్రికల్లో, ఎలెక్ట్రానిక్ మీడియాలో నిర్భ యంగా అభిప్రాయాన్ని ప్రకటించుకోడానికి అవకాశాలు తక్కువ కాబట్టి సోషల్ మీడియాను పౌరులు విరివిగా వినియోగిస్తున్నారు. ఆ విధంగా అది విశేష జనాదరణ పొందుతున్నది. ఇది పాలకులకు కంటకప్రాయంగా ఉండడం సహజం. అయితే పౌరుల భావ ప్రకటన అన్నింటి కంటే ఉన్నతమైనదని గుర్తించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News