Home హైదరాబాద్ మట్టుబెట్టడమే!

మట్టుబెట్టడమే!

murder-images

వినకపోయినా, అవమానపరిచినా హత్యలే నగరంలో భీతి గొల్పేలా బహిరంగ నేరాలు
వేళ్లూనుకుంటోన్న విష సంసృ్కతి ‘ఆపరేషన్ చబుత్ర’ తరహా తనిఖీలు మేలు

మన తెలంగాణ/సిటీబ్యూరో : కుషాయిగూడ పరిధిలోని ఓ ఖాళీ స్థలం విషయమూ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఓ వ్యక్తిని నగ్నంగా బట్టలూడదీసి అపహరించింది అనంతపురంకు చెందిన ముఠా. గత రెండేళ్ళ క్రితం నగరంలోనే కాదు రాష్ట్రంలోనూ సంచలనం కలిగించింది ఈ సంఘటన. అదే రాయలసీమకు చెందిన మరో ముఠా మాజీమంత్రి కుమారుడు విక్రంగౌడ్ విషయంలోనూ కాల్పుల కలకలం రేకెత్తించింది. ఇదీ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నేరేడ్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో తన స్వంత బావ నందిరాజును చంపేందుకు సుఫారీ ఇచ్చి నడిరోడ్డుమీద నరికి చంపారు అతని బావమరిది సత్యనారాయణ, అతని సహచరులు. కూకట్‌పల్లిలో సుధీర్ అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని అతని ప్రత్యర్థులుగా భావిస్తున్న మహేశ్, అతని మిత్రులు కలిసి నడిరోడ్డుమీద వేటకొడవళ్ళతో నరికి చంపారు. పారిపోతున్నా.. పట్టుకొచ్చి మరీ అతి కిరాతకంగా హత్యచేశారు. కాచిగూడ పోలీ సు స్టేషన్ పరిధిలో అంబర్‌పేట్ గోల్నాక వద్ద రెండు గ్యాంగ్‌లు బహిరంగంగా దాడులకు దిగాయి. చార్మినార్ పోలీసు స్టేషన్ పరిధిలో పదిమంది వరకు వచ్చి నగల తయారీ దుకాణాల్లో దోపిడీ చేసి మరీ పారిపోయారు. ఈ విధమైన అతి భయంకరమైన నేరాలు నగరంలో సర్వసాధారణంగా మారుతున్నాయి.
మట్టుబెట్టడమే : బహిరంగ హత్యలు, ముఠాకక్షలు, వేటకొడవళ్లు దాడులు, దోపిడీలు వంటివి హైదరాబాద్ మహానగరాన్ని వత్తిడిలోకి నెట్టుతున్నాయి. ఇప్పుడు ఏ రోడ్డులో ఏ హత్య చోటుచేసుకుంటుందో, ఏరకమైన దోపిడీ జరుగుతుందోననే ఆందోళన నగరవాసుల్లో వ్యక్తమవుతోంది. తమ యోచనకు, తమ స్నేహితులకు ఎదురు తిరిగితే చాలు ప్రాణాలు తీసేస్తున్నారు. ముందస్తుగా హెచ్చరికలు చేయడంగానీ, పోలీసులకు ఫిర్యాదులు చేయడంగానీ, లేదా తమ సహచరులతో కలిసి గాయపరచడంగానీ చేయడంలేదు. ఒక్కసారి దాడికి దిగితే అవతలి వ్యక్తిని హతమార్చే వరకు వదలడం లేదు. ఇప్పుడు నగరంలో స్నేహితులే ఒక వర్గంగా అప్పటికప్పుడే ఏర్పడి ఎవరిని చంపాలనుకుంటారో అతిడిని దొరికించుకుని మరీ మట్టుబెడుతున్నారు. చూపరులకు భీతికొల్పేవిధంగా, నిర్దాక్షిణ్యం గా, కిరాతకంగా హత్యచేస్తున్నారు. అనంతరం పోలీసులకు లొంగిపోతున్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు ప్రాణాలకు విలువనివ్వడంలేదు. సమాజంలో వేళ్ళూనుకుంటున్న ఈ సంస్కృతి అత్యంత భయంకరమైనదనే చర్చ జరుగుతున్నది.
సినిమాల ప్రభావం : ప్రధానంగా యువతపై నేర సం స్కృతి చలనచిత్రాల ప్రభావం ప్రధానంగా పడుతున్న ట్టు యువత అభిప్రాయం. వెంటపడి నరకడం, మార ణాయుధాలతో దాడిచేయడం, ప్రణాళికలను రచించ డం, అమలుకు పరిసరప్రాంత వాసుల సహకారాన్ని తీసుకోవడం, ఫోన్‌లలో కోడ్ భాషతో సమాచారాన్ని చేరవేసుకోవడం వంటివి అధి కంగా చలన చిత్రాల్లోనే కనిపిస్తుందని పలువురు యు వకులు వివరిస్తున్నారు. దీనికి తోడు హత్యలు చేసిన వారు నెలరోజుల్లోనే బయట యథేచ్ఛగా తిరగడంతో ఇతరులు కూడా ప్రభావితమవుతున్నట్టు పలువురు వెల్లడిస్తున్నారు.
ఆపరేషన్ చబుత్ర తరహా : నగరం, శివారు ప్రాం తాల్లో పోలీసులు ఆపరేషన్ చబుత్ర తరహాలో తనిఖీలు నిర్వహించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. దక్షిణ మండలంలో రాత్రి 11 గం.లు దాటితే పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. యువకులు, విద్యార్థులు రాత్రివేళల్లో అరుగులపై కూర్చుని తెల్లవారుజాము వరకు మాట్లాడుకుంటూనే ఉంటున్నారు. దీంతోనే యువకులు, విద్యార్థులు చెడు అలవాట్లకు, వ్యసనాలకు అలవాటుపడుతున్నట్టు యువకులే వెల్లడిస్తున్నారు. పోలీసులు ఆపరేషన్ చబుత్ర మహానగరంలో అమలు పరిచితే ఫలితాలుంటాయనేది వారి అభిప్రాయం.