Home స్పెషల్ ఆర్టికల్స్ ప్రైవేటు రంగం గుప్పెట్లో ప్రజారోగ్యం

ప్రైవేటు రంగం గుప్పెట్లో ప్రజారోగ్యం

edit

భారతదేశంలో ఆరోగ్యహక్కు కోసం వినిపిస్తున్న గళాలను సమా ధాన పరిచేందుకు, ఆరోగ్య బీమాను వెలుగులోకి తీసుకువచ్చారు. అందరికీ ఆరోగ్య భాగ్యం అనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆసుపత్రి ఖర్చులకు గాను బీమా కల్పిస్తే సరిపోతుందనే భావన అధికారిక వర్గా లలో ఉంది. మరోవైపు, దేశంలోని జనాభాకు… మరీ ముఖ్యంగా బీదలకు ఆరోగ్యాన్ని కల్పించేందుకు ఉపయోగ పడే ‘ప్రజా రోగ్య సేవల’కు తగినన్ని నిధులందించకుండా, క్రమంగా బలహీనపరు స్తున్నారు. ప్రస్తుత ఆర్థికశాఖామంత్రి, తన చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతూ, ఆరోగ్యంమీద దృష్టి సారిస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఆయన ప్రకటించిన “ఆయుష్మాన్ భారత్‌” పథకం కోసం, ఆరోగ్యరంగంలో అదనపు నిధులేవీ కేటాయించినట్లు కనిపించలేదు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోసం గత బడ్జెట్‌లో 53,294 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది 54,600కోట్లు కేటాయిం చారు. ద్రవ్యోల్బణాన్ని కనుక పరిగణనలోకి తీసుకుంటే, ఈ కేటా యింపు తగ్గినట్లుగానే చెప్పుకోవాలి. ఆరోగ్య రంగానికి దేశ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 3 శాతం, రాష్ట్రాల స్థూలదేశీయోత్పత్తిలో 1.5 శాతం ఉండాలన్న నియమానికి ఈ అంకెలు ఏమాత్రం చేరువలో లేవు. ఒక దేశంలో కనీస ఆరోగ్య సేవలు నిర్వహించాలంటే పైన పేర్కొన్న శాతాలలో కేటాయింపులు ఉండాలంటూ అనేక ప్రభుత్వ సంఘాలు, సమితులతో పాటు ‘జాతీయ ఆరోగ్య విధానం – 2017’లో కూడా పేర్కొ న్నారు.
తన బడాయి మాటలకు కొనసాగింపుగా, ఆర్థికమంత్రి ‘జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం(ఎన్‌హెచ్‌పీఎస్)’ పేరుతో ఒక ప్రధాన కార్యక్రమాన్ని ప్రకటించారు. పదికోట్ల మంది పేదల, బాధిత కుటుంబా లకు చేయూతనిచ్చే ఈ పథకం, ‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రభుత్వ సహాయక ఆరోగ్య పథకం’గా పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కుటుంబానికి ఐదు లక్షల చొప్పున ఆసుపత్రి ఖర్చులను భరించేందుకు అనుగుణంగా బీమా సదుపాయం కల్పించేందుకు, ప్రజా నిధులను ఉపయోగిస్తారు. ఈ పథకం సజావుగా సాగేందుకు తగిన నిధులను కేటాయిస్తామంటూ, ప్రసంగంలో పేర్కొన్నా… బడ్జెట్ కేటాయింపులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా కోసం తక్కువలో తక్కువగా మూడువేల రూపాయల చొప్పున లెక్క కట్టినా, పది కోట్ల కుటుంబాలకు 30,000కోట్ల రూపాయలు ఖర్చవు తుంది. ప్రస్తుతం ఉన్న ‘రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన(ఆర్‌ఎస్‌బీవై)’ పథకం ద్వారా పేద కుటుంబాలకు 30,000రూపాయల బీమా అందించేందుకు 2018-19 జాతీయ బడ్జెటులో కేవలం 2,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్ నుంచి వెలువడిన ప్రకటనల ప్రకారం…ఎన్‌హెచ్‌పిఎస్ పథకం ఈ ఏడాది మొదలవడం కూడా సందేహాస్పదమే!
ప్రాథమిక ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు 1.5లక్షల ఆరోగ్య స్వాస్థ్య కేంద్రాలకు 1200కోట్ల రూపాయలు కేటాయించారు. ఇవి “పరిపూర్ణ ఆరోగ్య పరిరక్షణ”లో భాగంగా దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స, తల్లీ బిడ్డా సంరక్షణ వంటి సేవలతో పాటు ఉచిత మందులని అందించడం, రోగనిర్ధారణ పరీక్షలను నిర్వహించడం వంటి సేవలను కూడా అందిస్తున్నాయి. ఒకో కేంద్రానికీ కేవలం 80,000 రూపాయలు కేటాయించడం చూస్తుంటే, ప్రాథమిక ఆరోగ్యసేవలు ఎలాంటి నిధుల లేమిని ఎదుర్కొంటున్నాయో అర్థమవుతుంది. పైగా ఆరోగ్య, స్వాస్థ్య కేంద్రాలు భాగంగా ఉన్న జాతీయ ఆరోగ్య పథకానికి కేవలం 30,634 కోట్ల రూపాయలు కేటాయించారు. గత సంవత్సరం సవరించిన అంచనాలతో పోల్చుకుంటే ఇది 658కోట్లు తక్కువ. ప్రాథమిక ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు ఎన్‌హెచ్‌ఎం వ్యవస్థలో అనేక కీలకమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా జాతీయ ప్రభుత్వ నిధులతో నడుస్తాయి. వీటిని నీరుగార్చడం అంటే జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకంలో భాగంగా గత పదేళ్లలో సాధించిన ప్రగతిని వెనక్కి మళ్లించడమే!
దేశంలో ఐదేళ్లలోపు ఉన్న మూడోవంతు మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతూ, అంటువ్యాధులూ, దీర్ఘకాలిక వ్యాధులూ ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న పరిస్థితులలో… అనారోగ్య భారానికి కొనసాగింపుగా ఈ అలక్ష్యం కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు పెరిగిపోతు న్న ఆరోగ్య ఖర్చుల వల్ల ప్రజలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోను, దారిద్య్రం లోను కూరుకుపోతున్నట్లు ప్రభుత్వ పత్రాలు పేర్కొంటున్నాయి. ఆరోగ్య బీమా వల్ల సొంత ఖర్చుల మీద కానీ పేదల ఆరోగ్య భద్రత మీద కానీ పెద్దగా ప్రభావం లేదని నివేదికలు తేల్చి చెబుతున్నాయి. భారతదేశంలో 67శాతం ఆరోగ్య ఖర్చులను చేతి నుంచే భరించాల్సి ఉంటుంది. ఇందులో 63 శాతం తాత్కాలిక చికిత్స (ఔట్ పేషెంట్) కోసమే ఖర్చవుతుంది. ప్రస్తుతం ఉన్న ఆర్‌ఎస్‌బీవై పథకం కింద ఆసుపత్రి ఖర్చులను పూర్తి మొత్తంగానో, కొంత భాగంగానో తిరిగి పొందేవారి శాతం చాలా తక్కువ. పైగా ఈ పథకం కింద ఉచిత సేవ లను అందించే ఆసుపత్రులు ఎక్కడో పట్టణాల్లో ఉండటమో, వాటికంటే ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య గణనీయంగా ఉండటమో జరుగుతోంది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ విధానాలు, ఖర్చులు, బీమా వైపుగా మొగ్గు చూపడంతో…ప్రాథమిక ఆరోగ్య పరిరక్షణ, ప్రజోపయోగ ఆరోగ్య సేవలు మరింత అలక్ష్యానికి గురవుతున్నాయి. పైగా ఇది ప్రైవేటురంగంలో ఉన్న బీమా సంస్థలకు ప్రయోజనకారిగా ఉండటం వల్ల బడ్జట్ ప్రసంగం తర్వాత సదరు కంపెనీల షేర్లు ఒక్క సారిగా ఎగిసిపడ్డాయి. 2017 జాతీయ ఆరోగ్య విధానం “దృఢమైన ఆరోగ్య పరిశ్రమ రెండంకెల వృద్ధి”ని సాధించగలదని పేర్కొంది. ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల, స్తోమత లేనివారు కూడా ప్రైవేటు ఆరోగ్యరంగం మీద ఆధారపడక తప్పడం లేదు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో మౌలికసదుపాయాల లేమి, సిబ్బంది లోటు, తగినన్ని యంత్రాలు మందులు లేకపోవడం వంటి సమస్యలు ఉండటం వల్ల జనం ప్రైవేటు ఆరోగ్యరంగం మీద ఆధారపడక తప్పడం లేదు. ప్రస్తుత ఆరోగ్య విధానం కూడా ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ వైపే మొగ్గు చూపుతోంది. వీటికి భారతీయ ప్రజల ఆరోగ్యం, స్వస్థతకు లాభార్జనే ముఖ్యం. ప్రతిపాదిత బీమా పథకం కూడా దీనికే ఉపకరిస్తుంది.
సరైన నియంత్రణ, పరిపూర్ణమైన ఆరోగ్య సేవలు లేకుండా… ప్రజ లు ఆరోగ్య అవసరాల కోసం ప్రైవేటు రంగం మీద ఆధార పడటం వల్ల ఆరోగ్యం అందరికీ చేరువవ్వదనేది ప్రపంచవ్యాప్తమైన అనుభవం. ఈ నేపథ్యంలో మెరుగైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులను వినియోగించి ప్రజారోగ్య యంత్రాంగాన్ని బలపరచడం మీద భారత దేశం దృష్టి సారించాలి. ఇదే సమయంలో ఎప్పటికప్పుడు పెరిగిపోతు న్న ప్రైవేటురంగాన్ని అదుపు చేయడంలో కూడా పురోగతి సాధించాలి.

* (ఇ.పి.డబ్ల్యు.సంపాదకీయం)