Home ఎడిటోరియల్ ప్రజాగ్రహం యాంత్రికంగా వామపక్షాలకు తోడ్పడదు

ప్రజాగ్రహం యాంత్రికంగా వామపక్షాలకు తోడ్పడదు

1990 దశకంలో సోవియట్ యూనియన్ పతనమైంది. సోషలిస్టు దేశాల కూటమి బద్దలైంది. ప్రపంచ వ్యాపితంగా వామపక్ష శ్రేణులలో దిగ్భ్రాంతి, నిరాశ వ్యాపించాయి. నూతన వామపక్షాలు, సాయుధ పోరాట సిద్ధాంతాల శక్తులు రంగంలోకి వచ్చి పరిస్థితిని మరింత గందరగోళంలోకి నెట్టాయి.
ఈ నేపథ్యంలోనే భారత్‌తోపాటు అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు అలీనోద్యమానికి, స్వతంత్ర విదేశాంగ విధానానికి తిలోదకాలిచ్చి, సామ్రాజ్యవాదుల ఏకధృవ ప్రపంచానికి దగ్గరయ్యాయి. ఉదారవాద ఆర్థిక విధానాలను అమలులోకి తెచ్చాయి. దేశంలో మధ్య తరగతి వర్గం పెరిగి మరింత బలమైన శక్తిగా రూపొందింది.

CPI-m2004లో 14వ లోక్‌సభలో 61 స్థానాలతో కమ్యూనిస్టులు మరోసారి బలమైనశక్తిగా, కీలక శక్తిగా పెరిగారు. బిజెపి అధికారంలోకి రాకుండా నివారించేందుకు కామన్ మినిమవ్‌ు ప్రొగావ్‌ు ప్రాతిపదికపై కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎకు మద్దతిచ్చాయి. అమెరికాతో అణు ఒప్పందం కారణంగా ఆ మద్దతు ఉపసంహరించుకున్నాం. కనీస ఉమ్మడి కార్యక్రమ సత్ఫలితాలు కాంగ్రెస్ పొందింది. ఎన్నికలలో కమ్యూనిస్టుపార్టీలు దెబ్బ తిన్నాయి. ప్రజలకు లోతుపాతులు అర్థంకాని అణు ఒప్పందంపై కాకుండా, అధికధరలు, అవినీతి ప్రజా సమస్యలపై అంతకు ముందే తోడ్పాటు ఉపసంహ రించి ఉండాల్సిందని అనంతరం భవించటం జరిగింది.
ఈ నేపథ్యంలో మతతత్వపార్టీలు, కుల పార్టీలు, ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకున్నాయి. ఎన్నికలు ధన ప్రభావానికి లోనయ్యాయి. కోటీశ్వరు లు, నేరచరిత్రులు, సంఘ వ్యతిరేకశక్తులు రాజకీయ పార్టీల నిర్వాహకులుగా, ప్రజాప్రతినిధులుగా రంగంలోకి వచ్చారు. మూడవ ప్రత్యామ్నాయం పుంజుకోలేదు.
ఈ దశలో ప్రజా సమస్యల పరిష్కారంలో ఘోరవైఫల్యంతో, అంతులేని అవినీతితో కాంగ్రెస్ 2014 ఎన్నికలలో ఘోరంగా ఓటమి చెందింది. బిజెపి మెజారిటీ సీట్లు గెలుపొంది, నరేంద్రమోడీ నాయకత్వాన ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. అధికారం లోకి వచ్చిన మొదటి రోజు నుండి కార్పోరేట్ల కోసమే బిజెపి పనిచేస్తున్నది. గ్రామీణ ఉపాధి పథకం, ఆరోగ్యం, విద్య, పరిశోధన తదితర రంగాలకు బడ్జెట్‌లో కోత విధించింది. రైతుల భూములు బలవంతంగా లాక్కునే ఆర్డినెన్స్ తెచ్చింది. కార్మిక సంస్కరణల పేరుతో శ్రామికులకు న్యాయమైన హక్కులు కాలరాస్తున్నది. కార్పోరేట్ టాక్స్ 30% నుండి 25% తగ్గించింది.
సంఘ్‌పరివార్ శక్తులు, మైనారిటీలు, హేతు వాదుల పట్ల ద్వేషపూరిత వాతావరణాన్ని, హత్యా కాండను మతఘర్షణలను రెచ్చగొడుతున్నది. దేశంలో అభద్రత, అనిశ్చిత వాతావరణం నెల కొన్నది. తమ అజ్ఞానాంధకార ఆలోచనలతో ఏకీభవించని వారిపై, ముఖ్యంగా హేతువాదులు, రచయితలు, మైనారిటీల పట్ల హిందూత్వ శక్తులలో అసహనం పెరుగుతున్నది. దాడులకు, హత్యాకాండ కు దారితీస్తున్నది.
మోడీ వాగాడంబరం, బిజెపి నిజస్వరూపం బహిర్గతమౌతున్నాయి. ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల శాసన సభల ఎన్నికలలో, యు.పి, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు ఓడించారు. కానీ వారి విధానాలు మారటంలేదు. ప్రజలలో బిజెపి పట్ల అసంతృప్తి ఒక్కటే చాలదు. వారిపట్ల ఆగ్రహం రాజకీయ, ఆర్థిక ప్రత్యామ్నాయా నికి దారి తీయాలి.
వామపక్షాలు ఓట్లరీత్యా, సీట్ల రీత్యా బలహీనపడ్డ వాస్తవాన్ని గుర్తిస్తున్నాం. కానీ పోరాట పటిమలో బలహీనపడలేదు. స్వతంత్ర ప్రజా ఉద్య మాలు, వామపక్ష ఐక్య ఉద్యమాలు గత 18 మాసా ల్లో ఎన్నో నిర్వహించాం. వామపక్షాలు సంక్షోభంలో పడ్డాయన్న మాట అతి శయోక్తి. వాస్తవంతో సంబంధం లేనిది.
ప్రపంచవ్యాపితంగా పెట్టుబడిదారి వ్యవస్థ సంక్షోభంలో ఉంది. యూరోప్‌లో, లాటిన్ అమెరికాలో వామపక్ష ఉద్యమాలు బలోపేత మవుతున్నాయి. అదృశ్య మైందనుకున్న అరుణ పతాకం, ఫీనిక్స్ పక్షి లాగా పునరుజ్జీవం పొంది శ్రామికవర్గం చేతిలో రెపరెపలాడుతున్నది. నేపాల్‌లో కమ్యూనిస్టులు ఏకమై ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చారు. చైనా, క్యూబా, వియత్నాం. ఉత్తర కొరియాల్లో కమ్యూనిస్టులు సోషలిజం వైపుకు అజేయంగా పురోగమిస్తున్నారు.
భారతదేశంలో పెరిగిన అసాధారణ సంపదలో 72% పదిశాతం ధనికుల చేతుల్లో ఉంది. దారిద్య్రం పెరుగుతున్నది. గత కొద్ది సంవత్సరాలలో మూడు లక్షలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 30 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, కనీసం వేతనం లేదు. 36 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన అర్థాకలితో జీవిస్తున్నారు. మన సహజ సంపద దోపిడీకి గురవుతున్నది. కోట్లాది మంది ఆదివాసీ లు తమ నివాసాల నుండి గెంటివేయబడ్డారు. దళితు లు వివక్షకు, దాడులకు గురవు తున్నారు. అవినీతి విశృంఖలంగా పెరిగింది.
పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా, దోపిడీకి, వంచనకు వ్యతిరేకంగా ప్రజలు ఆగ్రహంగా తిరగ బడుతున్నారు. ఈ దేశం లో ఈ సమస్యల పరి ష్కారం చేయగలిగిన శక్తి ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు స్పష్టంగా ఉన్న కమ్యూనిస్టులకు, వారితో ఏకీభవించే ప్రజాస్వామ్య శక్తులకే సాధ్యం.
ప్రజాగ్రహం యాంత్రికంగా వామపక్షాలకు అధికారంలోకి తీసుకు రాదు. మతోన్మాదానికి, కులపిచ్చికి, రాజకీయ అవినీతి, దోపిడీకి వ్యతిరేక మైన మహత్తర రాజకీయ పోరాటాలు చేయాలి. చేయగలిగిన సత్తా కమ్యూనిస్టులకుంది. పరిస్థితి సానుకూలంగా ఉంది. పోరాటాలకు నాయకత్వం వహించే రాజకీయ నిర్మాణం శక్తివంతంగా రూపొందా లి.
బిజెపిని ఓడించటం తక్షణ సమస్య. ఆర్థిక దుష్ఫలితాల నుండి, దుర్భరమైన దోపిడి నుండి, దారిద్రం నుండి ప్రజలను విముక్తి చేయటం ప్రధాన సమస్య. ధరల పెరుగుదల నుండి రైతుల ఆత్మహత్య ల నుండి, పోరాటాలకు సన్నద్ధం చేయాలి. పోరాటాలు సమరశీలంగా వుండాలి. విస్తృత ప్రజా సమీకరణతో కూడిన పోరాటాలుగా మారాలి. ప్రజా బాహుళ్యంలో విశ్వాసం పెరగాలి. సిపిఐ లేక సిపియం మాత్రమే వీటిని చేయటంలో పరిమితు లుంటాయి. కమ్యూనిస్టు ఉద్యమ పునరైక్యత ప్రజలలో అలాంటి విశ్వాసాన్ని నింపగలదు.
5 దశాబ్దాల నాటి కాలం చెల్లిన విభేదాలను పరిష్కరించుకునే ప్రయత్నాలు ప్రారంభంకావాలి. ప్రజలకు కావాల్సింది ఐక్యత, కార్యాచరణ. ఆ చారిత్రక బాధ్యత పరిపూర్తికి కృషి చేస్తున్నాం. 9 దశాబ్దాల కమ్యూనిస్టుపార్టీ మహాప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు చూసాం. దారి పొడుగునా రక్తతర్పణ చేస్తూ అరుణపతాకాన్ని ముందుకు తీసు కెళ్తున్నాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో పోరాటాల పతాకాన్ని నిలబెట్టేందుకు ప్రాణాలర్పించిన అమరు లకు జోహార్లు. త్యాగ ధనులకు రెడ్ సెల్యూట్. సమరశీలయోధులకు ఎర్రెర్ర వందనాలు. 90 సంవత్సరాల పార్టీని ప్రజలకు పునరింకితం చేస్తున్నాం. పార్టీని, వామపక్ష ఐక్యతను పటిష్టం చేస్తాం. కమ్యూనిస్టు ఉద్యమ పునరైక్యత సాధన ధ్యేయంగా ముందుకు సాగుతాం.
(సమాప్తం)