Thursday, April 25, 2024

దొడ్డిదారి ప్రైవేటైజేషన్

- Advertisement -
- Advertisement -

Public sector companies to the private sector

 

ఎన్ని పేర్లతో పిలిచినా దేవుడొక్కడే అని ఆధ్యాత్మికులు నమ్ముతారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రకటించే ద్రవ్య సేకరణ పథకాలన్నీ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు అప్పనంగా అప్పగించే లక్షంతో కూడుకున్నవేనని చెప్పడానికి వెనుకాడనవసరం లేదు. ఈ ప్రభుత్వం దేశాన్ని పాలించడం ప్రారంభించిన తర్వాత గత ఏడేళ్లలో అది అవలంబించిన ప్రాధాన్య క్రమాన్ని పరిశీలిస్తే ప్రభుత్వ రంగంలోకి ప్రైవేటును పిలిచి పెద్ద పీట వేయడానికే ఎక్కువ విలువ ఇచ్చినట్టు బోధపడుతుంది. చివరికి ప్రజల జీవితాలకు ధీమాను కలిగిస్తున్న జీవిత బీమా సంస్థను కూడా స్టాక్ మార్కెట్‌లో పెట్టడానికి వెనుకాడడం లేదు. విశాఖ ఉక్కు, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ వంటి విలువైన ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు చవకగా అప్పగించే కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రభుత్వం అత్యుత్సాహంగా చేపట్టింది. ప్రజలు వీధుల్లోకి వచ్చి హృదయావేదనతో ఎంతగా నిరసన తెలిసినా వారి మాట పెడచెవిన పెట్టి ప్రభుత్వరంగ ఆస్తులను ప్రైవేటుకు ధారాదత్తం చేసే పనిని నిరాటంకంగా కొనసాగిస్తున్నది. ప్రైవేటు యజమానులు వారి సొంత డబ్బుతో పారిశ్రామిక వాణిజ్య రంగాల్లో ప్రవేశించి దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడితే వారికి అవసరమైన కొన్ని మౌలిక సదుపాయాలను ప్రజాధనంతో కల్పించడాన్ని దేశ ప్రగతికి దోహదం చేసే కృషిగా భావించి హర్షించవచ్చు.

కాని ప్రభుత్వం వద్ద గల విలువైన ఆస్తులను, ఏళ్ల తరబడిగా ఎన్నో శ్రమలకోర్చి పెంచుకున్న ప్రజల సంపదను ప్రైవేటుకు దఖలు పరిచి దాని వల్ల దేశానికి మేలు కలుగుతుందని చెప్పడం కంటే బూటకం మరొకటి ఉండదు. ప్రభుత్వ ఆస్తులను నేరుగా చవక బజారులో పెడితే అప్రతిష్ఠ వస్తున్నదని గమనించి కేంద్ర ప్రభుత్వం ఆకర్షణీయమైన వేరే పేర్లతో అదే పనిని కొనసాగిస్తున్నది. ఆస్తుల ద్రవ్యీకరణ పైప్ లైన్ పేరుతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నాడు ఆవిష్కరించిన అతి పెద్ద నిధుల సేకరణ పథకం ద్వారా ప్రభుత్వ రంగంలోని గ్యాస్ పైప్‌లైన్లు, రైల్వే ఆస్తులు, రోడ్లు, గోదాములు, స్టేడియంలు, విద్యుత్తు రంగ విభాగాలు వంటి విలువైన ఆస్తులను ప్రైవేటు రంగానికి అప్పగించదలిచారు. తద్వారా వచ్చే నాలుగేళ్లలో రూ. 6 లక్షల కోట్ల నిధులను సమీకరించాలని ఉద్దేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దీని ద్వారా రూ. 88 వేల కోట్లు చేసుకోవాలని సంకల్పించారు. ఈ కార్యక్రమం దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుందని నిర్మలా సీతారామన్ అంటున్నారు. ప్రభుత్వం తన వద్ద గల వివిధ సంస్థల యాజమాన్యాన్ని ప్రైవేటుకు అప్పగించి తాను అతి కొద్ది అతి ప్రధానమైన రంగాలకే పరిమితం కాగలదని ప్రధాని నరేంద్ర మోడీ గతంలోనే ప్రకటించి ఉన్నారు.

ఆ ప్రకారం 2022 మార్చి నాటికి ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ద్వారా రూ. 1.75 లక్షల కోట్లను సమీకరించాలని లక్షంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే బిపిసిఎల్, ఎయిర్ ఇండియా సంస్థల అమ్మకం, ఎల్‌ఐసి వాటాల విక్రయాన్ని తలపెట్టారు. కేంద్రం తలపెట్టిన జాతీయ మౌలిక సదుపాయాల కల్పన పైప్‌లైన్ పథకానికి అవసరమైన రూ. 43 లక్షల కోట్లలో 14 శాతం నిధులను దీని ద్వారా సంపాదించాలని లక్షంగా పెట్టుకున్నారు. ఆ మేరకు ఈ ఏడాది 15 శాతం ప్రభుత్వ ఆస్తులను అమ్మదలిచారు. వీటి వాస్తవ విలువ లీజు ద్వారా వచ్చే నిధుల కంటే అనేక రెట్లు ఎక్కువగా ఉంటుందనేది సుస్పష్టమే. ఇలా ప్రైవేటుకు అప్పగించిన ప్రభుత్వ ఆస్తులపై యాజమాన్య హక్కు ప్రభుత్వానికే ఉంటుందని వాటిని నిర్ణీత వ్యవధికి ప్రైవేటుకు అద్దెకివ్వడమే జరుగుతుందని ఆ వ్యవధి తర్వాత అవి తిరిగి ప్రభుత్వానికే చెందుతాయని నిర్మలా సీతారామన్ నమ్మబలికారు. దీని వల్ల యువతకు భారీ ఎత్తున ఉద్యోగావకాశాలు కలుగుతాయని కూడా ఆమె చెప్పారు. నేరుగా అమ్మితే అంతటి అపరిమిత ధన రాశులను ప్రైవేటు యాజమాన్యాలు కుమ్మరించలేవని గమనించి వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు ఈ లీజు పద్ధతిని ప్రవేశపెట్టినట్టు ఈ పథకాన్ని చూడగానే అర్థమవుతుంది.

ఈ ప్రభుత్వ ఆస్తులను ఉపయోగించి వీలైనన్ని లాభాలు చేసుకోడంపైనే ప్రైవేటు రంగం దృష్టి పెడుతుంది గాని వీలైనన్ని ఎక్కువ ఉద్యోగాలు కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తుందని ఎంత మాత్రం అనుకోలేము. ప్రైవేటు వ్యాపారులు ప్రజా సేవ కోసం నిధులు వెదజల్లడమనేది ఎక్కడా లేదు. ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థ లోతుగా వేళ్లూనుకున్న మన దేశంలో ప్రైవేటు వారు ప్రభుత్వ ఆస్తులను గరిష్ఠ స్థాయిలో స్వప్రయోజనానికి వినియోగించుకుంటారు. విద్యుత్ వంటి రంగాలను ప్రైవేటుకు అప్పగిస్తే వాటిపై రకరకాల ఛార్జీలు విధించి ప్రజల జేబులు కొల్లగొట్టడానికి ప్రైవేటు యాజమాన్యాలు వెనుకాడవు. ప్రజలు ఓటు వేసి ఏ పార్టీనైనా, పార్టీల కూటమినైనా గద్దె ఎక్కించడంలో తమ ఆస్తులను మరింత ప్రయోజనకరంగా నిర్వహిస్తారనే ఆశతోనేగాని వాటిని పట్టపగలు ఇలా ప్రైవేటుకు దోచిపెడతారని కాదు. ఈ ప్రజాస్వామిక ధర్మ సూత్రాన్ని ఎన్‌డిఎ పాలకులు గ్రహించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News