Wednesday, April 24, 2024

లాక్‌డౌన్ తర్వాత ప్రజా రవాణా వాడకం తగ్గొచ్చు

- Advertisement -
- Advertisement -

Public transport may be reduced after Lockdown

 

ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్న జనం
సొంత వాహనాల వాడకం కూడా పెరుగుతుంది
నడక, సైక్లింగ్ వైపు మళ్లే వారూ పెరుగుతారు
సిఎస్‌ఇ తాజా సర్వేలో వెల్లడైన విస్తుపోయే వాస్తవాలు

 

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ఆరు నెలల పాటు జనం బస్సులు, మెట్రో రైళ్ల వంటి ప్రజా రవాణా సాధనాలను వినియోగించడం తగ్గిపోవచ్చని, ప్రజలు తమకు ఏది బాగా సరిపోతుందో ఆ ప్రయాణ సాధనాన్నే ఎంచుకోవచ్చని, అంతేకాదు ఆరోగ్య భద్రత అత్యంత ప్రాధాన్యతగల అంశంగా ఉంటుందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్( సిఎస్‌ఇ) సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వే పేర్కొంది. లాక్‌డౌన్ తర్వాత మారుతున్న ప్రయాణ ఎంపికలు అనే అంశంపై ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాలైన ఎన్‌సిఆర్ సిటీలకు చెందిన 400కు పైగా మధ్య, ఉన్నతస్థాయి వర్గాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ‘ సమీప భవిష్యత్తులో ప్రజా రవాణాను ఉపయోగించుకోవడం తగ్గవచ్చని, అలాగే దీర్ఘ కాలంలో అనవసర ప్రయాణాలను తగ్గించుకోవడానికి హై క్వాలిటీ ప్రజా రవాణా, జనాల కాంటాక్ట్‌లు లేని వాకింగ్, సైక్లింగ్ వాటిపట్ల మొగ్గుచూపడంతో పాటుగా జీవన శైలిలో సర్దుబాటు ధోరణులు చోటు చేసుకోవచ్చు’అని పర్యావరణానికి సంబంధించిన మేధావి వర్గాల వేదిక అయిన ఆ సంస్థ తెలిపింది.

లాక్‌డౌన్ తర్వాత ఆరోగ్య భద్రత అత్యంత ప్రాధాన్యతా అవఃగా ఉంటుందని రోడ్డు భద్రత, ప్రయాణ సాధనాల అందుబాటు, సుఖమైన ప్రయాణం, ప్రయాణాల దూరం, ప్రయాణ ఖర్చు, పర్యావరణం పట్ల జాగరూకత లాంటి అంశాలు ఆ తర్వాతి ప్రాధాన్యతలుగా ఉండాయని సిఎస్‌ఇ తెలిపింది. సొంతకారు ఉండడం, వినియోగానికి ప్రాధాన్యత కూడా పెరుగుతుందని ఆ సర్వేలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో సొంతవాహనం లేని వారు 36 శాతం ఉండగా, వీరిలో 28 శాతం మంది సమీప భవిష్యత్తులో భద్రతా కారణాల దృష్టా సొంత వాహనం కొనుగోలు చేయాలని అనుకొంటున్నట్లు చెప్పడం గమనార్హం. లాక్‌డౌన్ తర్వాత అరు నెలలలోపు మెట్రో ఎక్కే వారి శాతం లాక్‌డౌన్‌కు ముందున్న 37 శాతంనుంచి 16 శాతానికి తగ్గిపోవచ్చని ఆ సర్వే అంచనావేసింది. అయితే కార్లు, ద్విచక్ర వాహనాల వాటా 28 శాతంనుంచి 38 శాతానికి పెరగవచ్చని, అలాగే వాకింగ్, సైక్లింగ్ వాటా కూడా 4 శాతంనుంచి 12 శాతానికి పెరుగుతుందని, ఇదొక మంచి పరిణామమని సిఎస్‌ఇ అభిప్రాయపడింది.

అయితే ప్రజా రవాణా సాధనాలు గనుక సేవల్లో అత్యంత నాణ్యమైన ఉత్తమ ప్రమాణాలను పాటించినట్లయితే తాము వాటికే మొగ్గు చూపుతామని సర్వేలో పాల్గొన్న వారిలో 73 శాతం మంది చెప్పడం గమనార్హం. అయితే తాము వ్యక్తిగత రవాణా సాధనాలకే ప్రాధాన్యత ఇస్తామని 22 శాతం మంది చెప్పగా, క్యాబ్‌లు, షేరింగ్ లంటి ఇతర పద్ధతులకు మారుతామని మిగతా వారు చెప్పారు. అయితే కనెక్టివిటీ, ఖర్చు తక్కువగా ఉండడం, సామర్థ్యం, ట్రాఫిక్ ఇబ్బందులనుంచి తప్పించుకోవడం లాంటి కారణాల దృష్టా చాలా మంది ప్రజా రవాణాకే మొగ్గు చూపుతామని చెప్పడం విశేషం. ఒక్కో నగరంలో సర్వే ఫలితాలు వేరుగా ఉండవచ్చునేమో కానీ జనం ప్రజా రవాణానుంచి వ్యక్తిగత రవాణా వైపు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని ఈ సర్వే స్పష్టం చేస్తోందని సిఎస్‌ఇ పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News