Friday, April 19, 2024

ప్రజారవాణా పునరుద్ధరణ?

- Advertisement -
- Advertisement -

sampadakiyam telugu నిరంతర జన ప్రవాహాలు లేని సమాజం జడపదార్థం వంటిదే. కరోనా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత గత 50 రోజులకు పైగా ఇదే దృశ్యం. ఒక్క మన దేశమే కాదు దాదాపు ప్రపంచమంతా అలముకున్న పరిస్థితి ఇది. బస్సులు, రైళ్లలో, విమానాల్లో ఇతరత్రా సాగిన కిక్కిరిసిన జనరవాణా స్తంభించిపోయింది. ఒక చోటి నుంచి మరొక చోటికి రాకపోకల దారులు గడ్డకట్టిపోయాయి. అనునిత్య ప్రజావాహిని అంతర్థానమైపోయింది. నెమ్మది నెమ్మదిగానైనా లాక్‌డౌన్‌ను ఎత్తివేసి సకల ఆర్థిక కార్యకలాపాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలంటే అందులో ప్రధాన భాగమైన ప్రజాయానాన్ని తిరిగి రోడ్ల మీదకు, పట్టాలపైకి తీసుకు రావలసిందే. మెట్రోలు, విమానాలు పూర్వం మాదిరిగా వస్తూపోతూ ఉండవలసిందే.

అల్ప వ్యవధిలో అనల్పమైన దూరాలను చేరుకునే మార్గాలు తెరచుకోవలసిందే. సినిమా సామూహిక మార్కెట్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు వంటివి బూజు దులుపుకొని సరికొత్తగా ముస్తాబై మురిపాలు ఒలకవలసిందే. ఇవన్నీ జరిగితేగాని మునుపటి మానవ విశ్వరూపం మళ్లీ సాక్షాత్కారం కాదు. అయితే అలా చేస్తే ఏమి జరుగుతుంది, ఇంత కాలం విధించిన సర్వ దిగ్బంధ, గృహ నిర్బంధాలతో ఎంతో కొంత అదుపులోకి వచ్చిందనుకున్న కరోనా వ్యాప్తి మళ్లీ విజృంభించి మరింతగా విరుచుకుపడి వేలు, లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకోదా? శవాలు గుట్టలుపడి అంత్యక్రియల కోసం క్యూ కట్టే దురవస్థ దాపురించదా? అమెరికాలో మాదిరిగా వాటిని రోజులు, వారాల తరబడి శీతల వాహనాలలో నిల్వ ఉంచవలసి రాదా? ఇన్నాళ్ల లాక్‌డౌన్ వ్రత ఫలితం స్మశానాల పాలై అంతులేని విషాదానికి, పశ్చాత్తాపానికి లోను కావలసి వస్తుంది కదా? ఇప్పుడు దేశ దేశాల పాలకులను పీడిస్తున్న ప్రశ్నలివే. బ్రిటన్‌లో లెక్క తేలిన 30 వేల పైచిలుకు కరోనా మరణాలలో సగానికిపైగా ఆ దేశ రాజధాని లండన్ నగరంలోనే సంభవించాయి.

అందువల్ల నలుగురితో కలిసి పయనించడమంటే ఆ నగర వాసులు భయపడుతున్నారు. అన్ని కార్యాలయాలు, పని స్థలాలు తెరుచుకున్నా బస్సుల్లో, రైళ్లల్లో వెళ్లడానికి వెనుకాడుతున్నారు. ప్రత్యామ్నాయంగా సైకిళ్లను ఆశ్రయించాలనుకుంటున్నారని ఒక సర్వే వెల్లడించింది. లండన్‌లో సైకిళ్లకు గిరాకీ ఇప్పటికే పెరిగిపోయింది. ఆ దుకాణాలకు ఆర్డర్లు రెట్టింపు అవుతున్నాయని వార్తలు చెబుతున్నాయి. నగరాల్లో, పట్టణాల్లో దగ్గరి గమ్యాలకు చేరుకోవలసి ఉన్నవారికైతే సైకిల్ సుఖ ప్రయాణమే. రోజూ శివారు ప్రాంతాల నుంచి పాతిక, యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసిన వారికి అది కుదరదు. ముంబై నగరంలో ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరిస్తే లోకల్ రైళ్లను కూడా మళ్లీ నడిపి తీరాల్సిందేనని మహారాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.

అందుచేత జనజీవనం పూర్తిస్థాయిలో పురివిప్పుకోవాలంటే జనబాహుళ్యాన్ని గమ్యాలకు చేర్చే ప్రజా రవాణా తిరిగి ప్రారంభం కావాల్సిందే. అలాగే ప్రజా వినోద శాలలనదగిన సినిమా హాళ్లు, సువిశాలమైన ఆహార కూడళ్లు, హోటళ్లు తెరుచుకోవలసిందే. మన దేశంలో గృహ నిర్మాణం తదితర ఉత్పాదక రంగాలు పుంజుకోవాలంటే శారీరక శ్రమ చేసే కార్మిక శక్తి అందుకు కీలకమవుతుంది. లారీలు, ట్రక్కులు, బస్సులు, రైళ్లు విరివిగా తిరిగితేగాని వారిని పని స్థలాలకు చేర్చడం సాధ్యం కాదు. దేశంలో 16 లక్షల పైచిలుకు బస్సులు నమోదై ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో గల లక్షా 70 వేల బస్సులు మామూలుగా ప్రతి రోజు 7 కోట్ల మందిని గమ్యాలకు చేరుస్తుంటాయి.

13 నగరాల్లో 630 కిలోమీటర్ల దూరం మెట్రో రైళ్లు తిరుగుతాయి. 13,452 ప్యాసింజర్ రైళ్లు అనుదినం 2 కోట్ల 30 లక్షల మందిని గమ్యాలకు చేరుస్తుంటాయి. ప్రజా రవాణాతోపాటు సరకు చేరవేత కూడా ఆర్థిక రంగానికి అత్యవసరమైనది. దేశంలో 85 లక్షలు ట్రక్కులున్నట్టు అంచనా. ఇవన్నీ రోడ్డు మీదకు వస్తేగాని దేశానికి పడిన తాళం తిరిగి పూర్తిగా తెరుచుకున్నట్టు కాదు. ప్రజా రవాణా సర్వీసులను త్వరలో ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ప్రకటించారు. అయితే అందుకు కొన్ని షరతులు, మార్గదర్శకాలుంటాయని వాటిని విధిగా పాటించవలసి వస్తుందని కూడా అన్నారు. మొన్న 12వ తేదీ నుంచి కొన్ని ప్యాసింజర్ రైళ్లను మాత్రం నడుపుతున్నారు.

వాటితో పాటు వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడానికి శ్రామిక రైళ్లు సైతం నడుస్తున్నాయి. అయితే కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతున్న విషాద నేపథ్యంలో ప్రజా రవాణాను పూర్తి స్థాయిలో పునరుద్ధరించడం సాహస నిర్ణయమే అవుతుంది. ఇళ్లకు చేరుకుంటున్న వలస కార్మికుల వల్ల కూడా వైరస్ సోకుతున్నదనే సమాచారం గమనించదగినది. ప్రపంచం మొత్తంలో కరోనా కేసులు 43,47,921 కి చేరుకున్నాయి. 2,97,220 మంది మరణించారు. భారత దేశంలో కేసులు 78,003కి, మృతులు సంఖ్య 2549 మందికి ఎగబాకాయి. చాలా మంది కోలుకుంటు న్నప్పటికీ ఖచ్చితంగా నయం చేసే లేదా నిరోధించే మందు లేకపోడం వల్ల ప్రజా రవాణాను పునరుద్ధరించడం వల్ల వైరస్ మరింతగా వ్యాపిస్తుందనే భయం తొలగడం లేదు.

Public transport restoration

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News