Tuesday, March 21, 2023

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి వేదిక: కలెక్టర్

- Advertisement -

meeting

మన తెలంగాణ / సిరిసిల్ల : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణిని చక్కని వేదికగా ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన డివైసి, ప్రజావాణి కార్యక్రమాలలో కలెక్టర్ కృష్ణభాస్కర్, జెసి షేక్ యాస్మిన్ భాషాలు పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని 13 మండలాల్లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ కృష్ణభాస్కర్ అధికారుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెరిగిందని, చాలా వరకు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం జిల్లా అధికారులు చేశారని తెలిపారు. ప్రజల నుండి స్పందన కూడా బాగుందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో అధికారులు పనిచేసి 100 శాతం ఫిర్యాదులు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని మండలాలకు చెందిన నాయబ్ తహసీల్దార్లు జిలా స్థాయి ప్రజావాణికి రావాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో మొదటిస్థానంలో నిలిచిన డిఆర్‌డివో రవీందర్ ను కలెక్టర్ అభినందించారు. డిఆర్‌డివో మొత్తం 55 ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరించి, లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. అర్జీల పరిష్కారంలో డిసిడివో, ఉపాధి కల్పన కార్యాలయం, సెస్, డిపివో, లీగల్ సెల్, ఆర్ అండ్ బి ఈఈ, ఆర్డీవో, డిడబ్లూవోలు వరుసగా ఉన్నాయని తెలిపారు. కాగా సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 252 ఫిర్యాదులు రాగా రెవెన్యూ శాఖకు సంబంధించి 85, డబుల్ బెడ్‌రూం ఇండ్ల కోసం 71, పెన్షన్, ఇతర దరఖాస్తులు 96 రాగా డయల్ యువర్ కలెక్టర్‌కు మూడు ఫోన్‌కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అనుమతి లేకుండా చెట్లు నరకడంపై కలెక్టర్ ఆగ్రహం
వేములవాడ పట్టణంలో ముందస్తు అనుమతి లేకుండా సెస్ అధికారులు చెట్లను నరికివేయడం పట్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్లను నరికి వేసిన వారిపై వాల్టా చట్టం కింద నోటీసులు జారీ చేయాలని ఎంపిడివోను ఈ సందర్భంగా ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles