Home ఎడిటోరియల్ రాజకీయాల క్షాళన!

రాజకీయాల క్షాళన!

Sampadakiyam      దేశ రాజకీయ రంగం మీద నేర చరిత్రుల నీడ కూడా పడనీయకుండా చూడాలని మంచివారికి మాత్రమే అందులో చోటు లభించేలా చేయాలని సుప్రీంకోర్టు పట్టువదలని విక్రమార్కుడిలా చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించాలి. లోక్‌సభ, శాసన సభ ఎన్నికలలో తాము టికెట్లు ఇచ్చే అభ్యర్థుల నేరమయ నేపథ్యాన్ని వారిపై గల కేసులు, అవి ఏయే దశల్లో ఉన్నాయో ఆ వివరాలను 48 గం॥ల్లోగా వెబ్‌సైట్‌లు తదితర మార్గాల ద్వారా ప్రజల దృష్టికి తేవాలని, 72 గం॥ వ్యవధిలో ఎన్నికల సంఘానికి తెలియజేయాలని సుప్రీంకోర్టు గురువారం నాడు రాజకీయ పార్టీలకు ఇచ్చిన ఆదేశం రాజకీయాలను నేరస్థులకు దూరంగా ఉంచే దిశగా అది తీసుకున్న తాజా పటిష్టమైన చర్య. ఈ ఆదేశాలను పాటించకపోతే కోర్టు ధిక్కారంగా పరిగణించవలసి ఉంటుందని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది.

క్రిమినల్ కేసులు పెండింగ్‌లో గల వారిని ఎందుకు ఎంపిక చేయవలసి వచ్చిందో చెప్పాలని వారి విద్యార్హతలు, వారు సాధించిన ఇతర విజయాలను కూడా తెలియజేయాలని, కేవలం గెలుపొందగలగడమే అర్హతగా టికెట్లు ఇవ్వరాదని కూడా సుప్రీంకోర్టు పేర్కొన్నది. అదే సమయంలో ఈ కేసులో పిటిషనర్ కోరినట్టు క్రిమినల్ కేసులు ఉన్నవారికి పార్టీలు టికెట్లు ఇవ్వరాదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించకపోడం గమనించవలసిన విషయం. అభ్యర్థులపై గల కేసుల గురించి ఓటర్లకు వివరంగా తెలియజేయడం ద్వారా వారు సరైన వ్యక్తిని ఎన్నుకునే అవకాశాలను పెంచాలనేదే సుప్రీంకోర్టు ఆదేశాల ఉద్దేశమని స్పష్టపడుతున్నది. ఇదే విషయంపై 2018లో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు స్ఫూర్తితో న్యాయమూర్తులు రోహింగ్టన్ నారిమన్, రవీందర్ భట్, రామసుబ్రమణియన్‌లతో కూడిన ప్రస్తుత ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

నేర చరిత్ర గలిగిన ఎంపిలు, ఎంఎల్‌ఎల సభ్యత్వాలను రద్దు చేసినంత మాత్రాన రాజకీయాల తీవ్ర నేరమయత్వాన్ని రూపుమాపలేమని, రాజకీయ పార్టీలను ప్రక్షాళన చేయడం ద్వారా మాత్రమే అది సాధ్యమని రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పులో పేర్కొన్నది. ఆ మేరకు ముందు పార్టీల మెడలు వంచి దారికి తీసుకు రావడం మీద న్యాయస్థానం దృష్టి కేంద్రీకరించింది. అభ్యర్థిత్వాలను ఖరారు చేస్తూ టికెట్లు ఇచ్చే దశలోనే పార్టీల నాయకత్వాలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితిని తాజా ఉత్తర్వులు సృష్టిస్తున్నాయి. అది చట్ట సభల్లో నేర చరిత్రుల ప్రవేశాన్ని తగ్గించడంలో చాలా వరకు తోడ్పడుతుందని ఆశించవచ్చు. అయితే శత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్టు ఈ ఆదేశాల నుంచి కూడా తప్పించుకొని టికెట్టు సాధించుకునే మార్గాలను ధనవంతులు, బలవంతులయిన నేర చరిత్రులైన ఆశావహులు కనిపెట్టవచ్చు.

అందుకు వారి ధన తదితర బలాలపై ఆధారపడిన పార్టీలు సహకరించవచ్చు. ఇప్పటికైతే సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు పార్టీల నాయకత్వాల మీద గురుతరమైన బాధ్యతను, తప్పని సరి అగత్యాన్ని ఉంచాయి. చట్టసభలకు ఎన్నికవుతున్న వారిలో నేర చరిత్రుల సంఖ్య నానాటికీ అపరిమితంగా పెరిగిపోతున్న వైపరీత్యమే సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను జారీ చేయడానికి కారణం. 2004లో ఎన్నికయిన లోక్‌సభ సభ్యుల్లో 24 శాతం మంది పై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరి సంఖ్య 2009లో పార్లమెంటులో 30 శాతానికి పెరిగింది. 2014లో 34 శాతానికి, 2019లో 43 శాతానికి ఎగబాకింది. చట్ట సభల సభ్యులపై నమోదయిన కేసులన్నీ తీవ్రమైనవి, నిజమైనవి కాకపోవచ్చు. రాజకీయ ప్రత్యర్థులు ఏదో ఒక సాకు మీద చేసిన ఫిర్యాదులపై నమోదయినవి కూడా అందులో ఉండవచ్చు. అటువంటి వారిని మినహాయిస్తే మహిళలపై అత్యాచారాలు, అత్యాచార యత్నాలు వంటి తీవ్రమైన ఆరోపణలు నిర్ధారణ అయిన వారు కూడా ఎన్నికయిన సభ్యుల్లో గణనీయంగా ఉండడం ఆందోళనకరం.

ప్రస్తుతం దేశం మొత్తం మీద 76 మంది చట్టసభల సభ్యుల మీద మహిళలపై నేరాలకు ఒడిగట్టినట్టు నిర్ధారణ అయిన కేసులున్నాయని సమాచారం. ఇటీవల ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన వారిలో సగం మందికిపైగా క్రిమినల్ కేసులున్నవారేనని నిర్ధారణ అయింది. ధనబలం, అంగబలంతో గెలుపును ఎలాగైనా సాధించుకోగల శక్తియుక్తులున్నవారనే కారణంతోనే నేర చరిత్రులకు పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి. ప్రజలు కూడా అటువంటి వారే తమ పనులను సాధించిపెట్టగలరనే విశ్వాసంతో వారిని గెలిపిస్తూ ఉండవచ్చు. కేసులున్నా ప్రజల అభిమానం చూరగొనడమనేది ఒక ప్రత్యేక లక్షణం. అటువంటివారి సంగతి ఎలా ఉన్నా దుష్టులు, దుర్మార్గులనుంచి రాజకీయాలను దూరంగా ఉంచడం అలాగే ప్రజాస్వామిక చైత న్యం గలవారికి రాజకీయాల్లో చోటు పెంచడం అత్యంత అవసరం. ఇందుకు ప్రజల్లో ప్రజాస్వామికమైన ఆలోచన అవగాహన పెరగడం కూడా ముఖ్యం. తాజా సుప్రీంకోర్టు ఉత్తర్వు ఏమేరకు అసలైన నేర చరిత్రులను రాజకీయాలకు దూరంగా ఉంచుతుందో చూడాలి.

Publish details of candidates criminal history on website