Saturday, April 20, 2024

సుప్రీంకోర్టు జడ్జీగా తెలంగాణ బిడ్డ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు శనివారం కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు నియమితులు అయ్యారు. వీరిలో ఒక్కరు పులిగోరు వెంకట సంజయ్ కుమార్ (పివి సంజయ్‌కుమార్) తెలంగాణ వారు. చాలా కాలంగా సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామక ప్రక్రియ కేంద్రం సుప్రీంకోర్టు కొలీజియం మధ్య వివాదంతో పెండింగ్‌లో పడుతూ వచ్చింది. అయితే గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన కొలీజియం ఐదుగురు న్యాయమూర్తుల పేర్లతో సిఫార్సు చేసిన జాబితాకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనితో ఇప్పుడు ఈ ఐదుగురి న్యాయమూర్తుల పేర్లను వెల్లడించారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్ రిజిజూ సుప్రీంకోర్టుకు నియమితులు అయిన న్యాయమూర్తుల పేర్లను ప్రకటించారు.

సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తులుగా ఇప్పుడు పంకజ్ మిత్తల్ (ఇప్పుడు రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) సంజయ్ కరోల్ (ఇప్పుడు పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్) , జస్టిస్ పివి సంజయ్‌కుమార్ (ఇప్పుడు మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్), జస్టిస్ అహసనుద్దిన్ అమానుల్లా (ఇప్పుడు పాట్నా హైకోర్టు న్యాయమూర్తి), జస్టిస్ మనోజ్ మిశ్రా (ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి) నియమితులు అయినట్లు న్యాయమంత్రి రిజిజూ తెలిపారు. వచ్చే వారం వీరు తమ ప్రమాణస్వీకారాలు చేస్తారు. దీనితో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో 27 మంది జడ్జిలు ఉన్నారు. వీరిలో జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలలో ఉన్నారు. సిజెఐతో కలిసి సుప్రీంకోర్టుకు భర్తీ కావల్సిన న్యాయమూర్తుల సంఖ్య మొత్తం నిర్ణీతంగా 37. ఇప్పటి నియామకాల నేపథ్యంలో మరో ఐదుగురి న్యాయమూర్తుల నియామకానికి అవకాశం ఉంది.

సుప్రీంకోర్టు కొలీజియం చాలా కాలం క్రితమే సూచించిన పేర్లను కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ తొక్కిపెట్టి ఉంచిందని ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు తరచూ విమర్శలకు దిగారు. అయితే కొలీజియం విధానం సరిగ్గా లేదని, కొలీజియం ఏకపక్ష నిర్ణయాలను తాము అంగీకరించేది లేదని, ప్రత్యామ్నాయ విధానం లేదా ఎంపిక విధానం వ్యవస్థ అవసరం అని తరచూ కేంద్ర న్యాయ మంత్రి రిజిజూ, ఉప రాష్ట్రపతి ధన్‌కర్ తమ నిరసనలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇటీవలే సుప్రీంకోర్టు న్యాయవేదిక నుంచే ప్రభుత్వ వైఖరి పట్ల ఆక్షేపణ తెలిపింది. సుప్రీంకోర్టు ఇతర కోర్టుల న్యాయమూర్తుల ఎంపికలో ప్రభుత్వ జోక్యం ఈ విధంగా ఉండటం అనుచితం అని తెలిపింది. అయితే సూచనలు సిఫార్సులు వెలువరించడం వరకూ సుప్రీంకోర్టు చూసుకోవాల్సి ఉంటుంది తప్ప తాము ఇంటలిజెన్స్ వర్గాలు ఇతరత్రా అన్ని విషయాలు పరిశీలించుకున్న తరువాతనే ఎంపికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగుతుందని ఇందుకు ప్రతిగా కోర్టుకు పరోక్షంగా కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ తెలిపింది.

ఇప్పుడు తాము ఈ పేర్లకు అనుమతి తెలియచేయడం తమ స్వీయ పరిశీలన తరువాత తీసుకున్న నిర్ణయాల మేరకు తగు విధంగా సకాలంలో తీసుకున్న చర్య అని కేంద్రం స్పష్టం చేసింది. దీనితో ధర్మాసనం ఇటీవల వెలువరించిన ఆక్షేపణలకు ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. రాజ్యాంగ నిబంధనల మేరకు ఈ ఐదుగురి న్యాయమూర్తుల నియామకాలు జరిగాయని, ఇందులో ఎటువంటి ఇతర అంశాలకు తావు లేదని తెలిపిన కేంద్ర న్యాయ మంత్రి నియమితులు అయిన న్యాయమూర్తులకు తమ శుభాకాంక్షలు అని స్పందించారు.

తెలంగాణకు చెందిన జస్టిస్ పివి సంజయ్ కుమార్ విశేషాలు

జస్టిస్ సంజయ్‌కుమార్ హైదరాబాద్‌లో 1963 ఆగస్టు 14వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులు దివంగత పి రామచంద్రారెడ్డి, పి పద్మావతమ్మలకు జన్మించిన సంజయ్‌కుమార్‌ది న్యాయవాదుల కుటుంబం. 1969 నుంచి 1982 వరకూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అడ్వకేట్ జనరల్‌గా తండ్రి రామచంద్రా రెడ్డి వ్యవహరించారు. పవి కుమార్‌గా పేరొందిన జస్టిస్ సంజయ్‌కుమార్ నిజాం కాలేజీ , హైదరాబాద్ నుంచి బికాం చేశారు. తరువాత 1988లో ఢిల్లీ యూనివర్శిటీలో లా పట్టా తీసుకున్నారు.

న్యాయవాద వృత్తి ఎక్కువగా హైదరాబాద్‌లోనే సాగుతున్న దశలోనే ఆయన తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులు అయ్యారు. తరువాత 201౦లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019లో పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. 2021లో మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతితో వెళ్లారు. ఆ సంవత్సరంలో ఫిబ్రవరి 12వ తేదీన బాధ్యతలు తీసుకున్నారు. జస్టిస్ సంజయ్‌కుమార్‌కు పలు విషయాలపై న్యాయశాస్త్రపరమైన విశేషానుభవం ఉంది. ఇండిపెండెంట్‌గా న్యాయ వాదిగా ప్రాక్టిస్ చేసిన ఆయన పలు ప్రముఖ కేసులలో వాదించారు. పలు ప్రముఖ కంపెనీల వ్యవహారాల వ్యాజ్యాలలో లాయరుగా ప్రాతినిధ్యం వహించారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ వంటి అత్యంత కీలకమైన సంక్లిష్టమైన అంశాలపై మంచి పట్టున్న న్యాయ నిపుణుడిగా పేరొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News