Home జాతీయ వార్తలు పుల్వామా దాడి సూత్రధారి హతం?

పుల్వామా దాడి సూత్రధారి హతం?

Pulwama terror attack శ్రీనగర్: పుల్వామా దాడికి ప్రధాన సూత్రధారిగా జైషే మహ్మద్‌కు చెందిన ముదసిర్ అహ్మద్ ఖాన్ అలియాస్ మహ్మద్ భాయ్‌ ను భద్రతాబలగాలు మట్టుబెట్టాయని తెలుస్తోంది. ఆదివారం రాత్రి జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో మహ్మద్ భాయ్‌ హ‌త‌మైన‌ట్లు సమాచారం. ద‌క్షిణ క‌శ్మీర్‌లోని త్రాల్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంట‌ర్ జ‌రగగా మొత్తం ముగ్గురు మిలిటెంట్లు హ‌త‌మైన‌ట్లు అధికారులు తెలిపారు. 23 ఏళ్ల ఖాన్ ఎల‌క్ట్రీషియ‌న్‌గా చేస్తున్నాడు. పుల్వామా జిల్లా త్రాల్‌లోని మీర్ మొహల్లాకు చెందిన ఖాన్, ఉగ్ర దాడికి వాహనం, పేలుడు పదార్థాలు సమకూర్చినట్లు అధికారులు తెలిపారు. 2007 నుంచి జైషే మహ్మద్‌లో చేరి సాధారణ కార్యకర్తగా పని చేశాడు. కశ్మీర్‌లో తీవ్రవాదాన్ని పునరుద్ధరించినట్లుగా చెబుతున్న నూర్ మహ్మద్ తాంత్రే 2017 డిసెంబర్‌లో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన తర్వాత అదృశ్యమైన ఖాన్, జనవరి 14, 2018 నుంచి జైషే మహ్మద్‌లో క్రియాశీలకంగా పని చేస్తున్నాడని జాతీయ భద్రతా అధికారులు తెలిపారు. ఖాన్‌ను పూల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ అదిల్ అహ్మద్ దార్ తరచుగా కలిచే వాడని పేర్కొన్నారు. పుల్వామా దాడికి మారుతి ఇకో మిని వ్యాన్‌ను ఉపయోగించారన్నారు. ఈ వ్యాన్‌ను 10 రోజుల క్రితం ఖాన్‌కు మరొక ఉగ్రవాది సజ్జత్ భట్ ఇచ్చినట్లు దర్యాప్త అధికారులు తెలిపారు.

Pulwama terror attack mastermind killed in Encounter