Thursday, March 28, 2024

పంజాబ్ బాంబు పేలుడు నిందితుడికి ఖలిస్థాన్‌తో సంబంధాలు

- Advertisement -
- Advertisement -

Punjab bomb blast suspect linked to Khalistan

డిజిపి సిద్ధార్థ్‌ఛటోపాధ్యాయ

చండీగఢ్: పంజాబ్‌లో జరిగిన బాంబుపేలుడు ఘటనకు కారకుడుగా భావిస్తున్న మాజీ హెడ్‌కానిస్టేబుల్‌కు ఖలిస్థానీ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆ రాష్ట్ర డిజిపి సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ తెలిపారు. ఈ ఘటన వెనకాల పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నవారు ఉన్నట్టుగా అనుమానాలున్నాయని ఆయన అన్నారు. అయితే, కచ్చితమైన ఆధారాలు ఇంకా లభించలేదన్నారు. ఈ నెల 23న లూధియానా జిల్లాకోర్టు సముదాయంలోని రెండో అంతస్థులో బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని 2019లో సర్వీస్ నుంచి డిస్మిస్ అయిన హెడ్‌కానిస్టేబుల్ గగన్‌దీప్‌సింగ్‌గా గుర్తించారు. కోర్టు సముదాయంలో బాంబు పెట్టేందుకు గగన్‌దీప్ ప్రయత్నిస్తున్న క్రమంలోనే అది పేలిపోయినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇది మానవబాంబు ఘటన కాదని, బాంబును ఓ చోట అమర్చే ప్రయత్నంలో అది పేలడం వల్ల గగన్ మరణించాడని దర్యాప్తులో తేలిందన్నారు. ఆ సమయంలో అతడు అక్కడి వాష్‌రూంలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడే ఓచోట బాంబును వైర్లతో అమర్చేందుకు ప్రయత్నించినట్టుగా అర్థమవుతోందన్నారు. గగన్‌దీప్‌కు సంబంధించిన వివరాలను ఛటోపాధ్యాయ శనివారం మీడియాకు వివరించారు.

గగన్ తన సొంత పట్టణం ఖన్నాలోని పోలీస్‌స్టేషన్‌లో మున్షీగా పని చేశాడని ఛటోపాధ్యాయ తెలిపారు. డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయన్న కారణంతో అతణ్ని ఉద్యోగం నుంచి తొలగించినట్టు ఆయన తెలిపారు. 385 గ్రాముల హెరాయిన్‌ను తీసుకెళ్తూ అరెస్టయిన గగన్ రెండేళ్లపాటు జైలులో ఉండి, సంఘటన సమయానికి బెయిల్‌పై బయట ఉన్నాడు. డ్రగ్స్ కేసు విచారణ ఈ నెల 24న ఉండగా, అంతకు ఓరోజు ముందు బాంబు పేలుడు జరగడం గమనార్హం. పేలుడులో గగన్ మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడిన విషయం తెలిసిందే. జైలులో గడిపిన సమయంలో ఆయన పలువురు నేరగాళ్లతో సన్నిహితంగా మెలిగాడని ఛటోపాధ్యాయ తెలిపారు. వారిలో ఖలిస్థాన్ ఉగ్రవాదులు, డ్రగ్స్ మాఫియాకు సంబంధించి నవాళ్లున్నారు. మిగతా విషయాలు తదుపరి దర్యాప్తులో వెల్లడవుతాయని ఛటోపాధ్యాయ తెలిపారు. పేలుడులో వినియోగించిన పదార్థాలు సరిహద్దు అవతలి నుంచి వచ్చినట్టు భావిస్తున్నామన్నారు. వాటిని పరీక్షకు పంపామని, ఆర్‌డిఎక్స్‌లేకపోవచ్చని, ఏమిటనేది తర్వాత వెల్లడిస్తామన్నారు. ఈ సంఘటన ద్వారా డ్రగ్స్ మాఫియా, ఉగ్రవాదులు కలిసిపోయినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News