చండీగఢ్ : పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ రాష్ట్రమంతా రాత్రి కర్ఫూను పొడిగిస్తున్నట్టు బుధవారం వెల్లడించారు. ఈనెల 30 వరకు రాజకీయ సమావేశాలను నిషేధించారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫూ ఉంటుందని, ప్రస్తుతం 12 జిల్లాలకే పరిమితమైన కర్ఫూను 22 జిల్లాలకు విస్తరించడమౌతుందని చెప్పారు. ఏప్రిల్ 30 వరకు స్కూళ్లు, విద్యాసంస్థలు, మూసివేసే ఉంటాయి. కరోనా నిబంధనలు పాటించకుండా ఢిల్లీ సిఎం కేజ్రీవాల్, ఎస్ఎడి నేత సుఖ్బీర్ బాదల్ ర్యాలీల్లో పాల్గొనడాన్ని ఆక్షేపించారు. తాజా నిషేధ నిబంధనల్లో అంత్యక్రియలకు పెళ్లిళ్లకు హాజరయ్యే వారి సంఖ్య ఇండోర్లో 50 వరకు, అవుట్డోర్లో 100 వరకు తగ్గించారు.
రోజుకు 2 లక్షల వ్యాక్సినేషన్ లక్ష్యం
పంజాబ్లో కరోనా వైరస్ కేసులు 7.7 శాతం, మరణాలు 2 శాతం పెరగడంతో రోజుకు 2 లక్షల వ్యాక్సిన్లు చేయాలని వైద్య ఆరోగ్య విభాగానికి ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ లక్షం విధించారు. అలాగే రోజుకు 50, 000 నమూనాలు పరీక్షించాలని సూచించారు. కరోనా పాజిటివ్ రోగి ఒక్కొక్కరికి సన్నిహితంగా ఉన్న 30 మందిని కాంటాక్టు ట్రేసింగ్ చేయాలని సూచించారు. పంజాబ్లో మంగళవారం కరోనా మరణాలు 62 వరకు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 7216 కు చేరింది. అలాగే కొత్తగా 2924 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,57,057 కు చేరింది.