Home Default రాహుల్‌కు ప్రియాంక మాత్రమే ప్రత్యామ్నాయం

రాహుల్‌కు ప్రియాంక మాత్రమే ప్రత్యామ్నాయం

 

చండీగఢ్: కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ ఎంపికైతే ఆమెకు పార్టీలో సంపూర్ణ మద్దతు ఉంటుందని పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెప్టన్ అమరీందర్ సింగ్ అన్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయనకు సరైన ప్రత్యామ్నాయం ప్రియాంక మాత్రమేనని పంజాబ్ ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అయితే, దీనిపై తుది నిర్ణయం సిడబ్లుసికి మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

రాహుల్ వారసుడిగా ఎవరినీ ఎంపిక చేయకపోవడం వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతోందని, పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ప్రజాకర్షణ ప్రియాంకకు మాత్రమే ఉందని కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపి శశి థరూర్ గత వారం చేసిన వ్యాఖ్యతో కెప్టెన్ అమరీందర్ సింగ్ ఏకీభవించారు. పార్టీని పునర్నిర్మించడానికి యువ నాయకత్వం ఇప్పుడు అవసరమని, అందుకు అవసరమైన అన్ని అర్హతలు ప్రియాంకకు ఉన్నాయని అమరీందర్ చెప్పారు. దేశాన్ని నడిపించే మేథస్సు, సమర్థత ప్రియాంకకు ఉన్నాయని, పోరాటాన్ని విజయపథంలో నడిపించే ధైర్యం, ఎటువంటి సవాలునైనా స్వీకరించే తెగువ ఆమెకు ఉన్నాయని పంజాబ్ ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాహుల్ స్థానంలో పార్టీకి నూతన సారథిగా ప్రియాంక ఎంపిక చాలా గొప్పగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Punjab CM supports Priyankas candidature for Cong president post, Priyanka was good bet to replace Rahul Gandhi, he said