Home ఎడిటోరియల్ సంపాదకీయం : పంజాబ్‌లో రైతు రుణమాఫీ

సంపాదకీయం : పంజాబ్‌లో రైతు రుణమాఫీ

Sampadakeeyam-Logo

రుణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నంగా రైతు సంస్థాగత రుణాలను రద్దుచేసిన రాష్ట్రాల్లో తాజాగా పంజాబ్ చేరింది. తెలంగాణ రూ.17వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ.24వేల కోట్ల రుణాలను మూడేళ్లలో బ్యాంకులకు జమచేసి తమ ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చాయి. కాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రూ.లక్ష రుణం వరకూ రద్దు చేస్తున్నట్లు సూత్రప్రాయ ప్రకటన చేసింది. విధివిధానాలు రూపొందించాల్సి ఉంది. ఇటీవల పెద్ద ఎత్తున రైతుల ఆందోళనకు దిగిన పర్యవసానంగా మహారాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానం నెరవేర్చేందుకు 5ఎకరాలలోపు రైతుల రుణాలు రద్దుచేసినట్లు ప్రకటించినప్పటికీ రద్దు పరిమితి, విధివిధానాలపై రైతు సంఘాల ప్రతినిధులతో సోమవారం జరిపిన చర్చలు విఫలమైనాయి. రూ.1లక్షవరకే రుణాల రద్దుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే ద్రాక్షతోటలకు కనీస రుణమే రూ.1.5లక్షలు అయినప్పుడు రూ.1లక్ష రద్దు పరిమితిని ఎలా ప్రతిపాదిస్తారని రైతునాయకులు మంత్రివర్గ ఉపసంఘాన్ని నిలదీసి ప్రభుత్వ తీర్మానం ప్రతులను తగలబెట్టారు. ఖరీఫ్ సాగు నిమ్తితం అవసరమైన రైతులకు రూ.10 వేల అడ్వాన్స్ ఇస్తామన్న ప్రభుత్వం పెట్టిన షరతుల పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిష్టంభనతో సమావేశం వాయిదా పడింది. పోలీసు కాల్పుల్లో ఐదుగురు రైతులు చనిపోయిన మధ్యప్రదేశ్‌లో గిట్టుబాటుధరలపై ప్రభుత్వ వాగ్దానాలతో రైతుల ఆందోళన ప్రస్తుతానికి వాయిదా పడింది. ఇదిలావుండగా గత 10రోజుల్లో 15మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రుణమాఫీపై చౌహాన్ ప్రభుత్వం పునరాలోచన చేయకతప్పని పరిస్థితిలోకి నెట్టబడుతున్నది. కరువు పరిస్థితుల కారణంగా రుణాల మాఫీ కోరుతూ ఢిల్లీలో నెలరోజులపాటు, ఆత్మహత్య చేసుకున్న రైతుల పుర్రెలు ముందుపెట్టుకుని బహురూపాల్లో కుటుంబసభ్యులతో ఆందోళన చేసిన తమిళనాడు రైతులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. రైతు రుణమాఫీలకు కేంద్రం సహాయం చేయదని చెబుతున్నా, దీనివల్ల మున్ముందు రుణాల రికవరీ గందరగోళంలో పడుతుందని కేంద్రబ్యాంక్ హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా రుణ మాఫీవైపు అడుగువేయక తప్పని పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో తమకు అధికారమిస్తే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని ప్రధానమంత్రే స్వయంగా ప్రకటించటం ముఖ్యంగా బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచింది. రుణమాఫీ వాగ్దానం లేని ఎన్నికల ప్రణాళికలు మున్ముందు ఉండవేమో!
పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానం ప్రకారం ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఐదెకరాల లోపు రైతులకు రూ.2లక్షల వరకూ రుణమాఫీ ప్రకటించారు. ఇతర చిన్నపాటి రైతులకు కూడా వారి అప్పు మొత్తంతో నిమిత్తం లేకుండా రూ.2లక్షలు రద్దవుతుంది. 10.25లక్షల రైతు కుటుంబాలు లబ్దిపొందుతాయని, వారిలో 8.75లక్షల రైతులు సన్నకారు రైతులని ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. రైతు కుటుంబాలు మొత్తం 18.5లక్షలు. బిజెపి ప్రభుత్వాలు రూ.లక్షవరకే రుణ మాఫీ ప్రకటిస్తే తాము అంతకు రెట్టింపు మాఫీ చేస్తున్నామని బల్లగుద్ది చెప్పారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులు బ్యాంకులు, సొసైటీలకు బకాయీ ఉన్న పంట రుణాలను ప్రభుత్వం చెల్లించాలని కూడా నిర్ణయించింది. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నందున చెల్లింపులను ఎలా సర్దుబాటు చేస్తారో వేచి చూడాల్సిందే.
వ్యవసాయ సంక్షోభ నివారణకు విత్తనం నుంచి మార్కెట్ వరకు ఎన్నో వ్యవస్థాగత సంస్కరణలను నిపుణులు సూచిస్తున్నారు. పంట రుణాల మాఫీ తాత్కాలిక ఉపశమనం తప్ప పరిష్కారంకాదన్నది వారి అభిప్రాయం. అందువల్ల కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి వ్యవసాయాన్ని పరిరక్షించే, గిట్టుబాటుగా మార్చే శాశ్వత చర్యలు తీసుకోవాలి. ఎప్పుడో మరిచిపోయిన జైకిసాన్ నినాదాన్ని పునరుద్ధరించాలి.