Home కలం పులుల్ని కట్టడి చేసే మేకల కోసం

పులుల్ని కట్టడి చేసే మేకల కోసం

Punjitam Stories

 

‘సజీవదహనం’ కథ చూడండి. వ్యావసాయిక జీవితంలో మునుం పట్టి నారు పీకే దగ్గర నుంచి నాట్లేయడం, కలుపు తీయడం, కోత కొయ్యడం వంటి పనులన్నీ స్త్రీలే చేస్తారు. ఆయా సందర్భాల్లో పని పాటతో ముడివడి వుంటుంది. జానపదుల పని పాటల లోతుల్ని దగ్గరగా చూసిన శ్రీధర్ వాటిని కథలోకి అలవోకగా తీసుకువచ్చాడు. కథకి వొక సాంస్క తిక వాతావరణాన్ని నిర్మించాడు. నీళ్ళు లేక యెండిన రైతు పొలాన్నీ అల్లుడి కట్నం ఆశకి బలై మోడువారిన అతని కూతురి జీవితాన్నీ జమిలిగా సమాంతరంగా కథనం చేసిన నేర్పు అబ్బుర పరుస్తుంది. కథ ముగిసే సరికి పాఠకుల గుండెలు దుఃఖంతో అవిసిపోతాయి. వస్తు శిల్పాల కలనేత విద్య ప్రతి పోగులోనూ కనిపిస్తుంది.

అల్లకం కళ తెలిసిన పనిమంతుడు వెల్దండి శ్రీధర్. కవిత్వం, కథ, విమర్శ, పరిశోధన, గ్రంథ సంపాదకత్వం… చిన్న వయస్సులోనే అబ్బురపరచే విస్తతి సాధించిన సాహిత్య వ్యాపకం అతనిది. ప్రతిదానిలోనూ ప్రవేశం కాకుండా పరిణతి పొందాలనే అతని ప్రయత్నం. గడిచిన దశాబ్ద కాలంగా అతను చేస్తున్న సాహిత్య ప్రయాణంలో ప్రతి అడుగులోనూ ఆ కషి కనిపిస్తుంది. అతణ్ణి నడిపే సామాజిక దక్పథం కూడా దాన్ని రుజువు చేస్తుంది. నిన్న మొన్నటి నానీల కవిత్వం కావొచ్చు, అంతకు ముందటి ‘తెలుగు కథ – ప్రాంతీయ అస్తిత్వం’ పై రూపొందించిన వ్యాస సంకలనం కావచ్చు, యిప్పుడు యీ కథల సంపుటి కావచ్చు అచ్చుకు సిద్ధంగా వున్న ‘ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సాహిత్యం సమగ్ర పరిశీలన’పై చేసిన పరిశోధన కావచ్చు అతని గమనంలోని నిబద్ధతని నిరూపిస్తాయి. కాల్పనిక-కాల్పనికేతర రచనల జోడు గుర్రాలమీద నడుస్తూ సరుకున్న సాహిత్యకారుడిగా యివ్వాళ శ్రీధర్ గుర్తింపు పొందాడు.

21న పుంజీతం ఆవిష్కరణ సభ

భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో దక్కన్ సాహిత్య సభ డా.వెల్దండి శ్రీధర్ కథా సంపుటి ‘పుంజీతం’ ఆవిష్కరణ సభ ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్నారు. హైదరాబాద్ నగరంలోని రవీంద్రభారతిలో సాయంత్రం 5.30గంటలకు నిర్వహించే ఈ ఆవిష్కరణ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా.నందిని సిధారెడ్డి హాజరవుతున్నారు. నేషనల్ బుక్ ట్రస్టు ఇండియా కార్యక్రమాధికారి డా.పత్తిపాక మోహన్ అధ్యక్షతన జరిగే ఈ సభలో విశిష్ట అతిథులుగా తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య సూర్యా ధనంజయ్, ఆత్మీయ అతిథులుగా ప్రముఖ కథా, సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్, హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డా.జె.రాజారాం, తొలి ప్రతి స్వీకర్త వెల్దండి సురేఖ లు విచ్చేస్తారని సభ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

అది కథ గానీ కవిత్వం గానీ సృజనాత్మక కళ వస్తు రూపాల పడుగు పేకల కలనేత. పోగులు యెక్కడా చిక్కుపడకూడదు. ఏ పోగూ జారిపోకూడదు. దీన్ని బాగా గుర్తెరిగిన రచయితగా శ్రీధర్ అందిస్తున్న కథల సంపుటి ‘పుంజీతం’. శీర్షికలోనే తెలంగాణదనాన్ని గోచరింపజేయడంలోనే రచయిత ఆత్మ ఆవిష్క తమౌతోంది. పులి జూదంలో మేకల్ని మింగేయడానికి పులులు అనేక విధాల ఎత్తుగడలతో వస్తాయనీ బలహీనులు వాటిని గ్రహించి అప్రమత్తమయ్యే లోపే కోలుకోలేని నష్టం జరుగుతుందనే హెచ్చరికతో స్పష్టమైన యెరుకతో రాసిన కథలివి. ‘అమతవర్షిణి’ వంటి వొకట్రెండు కథలు తప్ప దాదాపు అన్ని కథలూ గత దశాబ్ద కాలంలో తెలంగాణ సమాజంలో చోటుచేసుకున్న చలనాన్ని పట్టుకోడానికి ప్రయత్నించినవే. అందువల్ల వీటిని సమకాలీన తెలంగాణ కథలుగా పేర్కొనవచ్చు.

తలాపు నుంచి జీవనదులు ప్రవహించి పోతున్నా నీళ్ళు లేక యెండిన పొలాలు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా నాశనమైన గొలుసుకట్టు చెరువులు, రియల్ ఎస్టేట్ భూతం మింగి మాయం చేసిన భూములు, నామరూపాల్లేకుండా ధ్వంసమైన వూళ్ళు, రాష్ర్టమే ప్రపంచీకరణకి ప్రయోగశాలగా మారిన క్రమంలో బతుకు తెరువునివ్వని చేతివత్తులు, వున్నది తెగనమ్ముకుని కాని దేశాల పాలయ్యే వలసలు, వుపాధి అవకాశాలు కల్పించని చదువులు… అప్పులపాలై ఆత్మహత్యల వైపు నడుస్తోన్న రైతన్నలు – నేతన్నలు, కాల్‌మనీ దందాలో మాన ప్రాణాలతో సహా జీవితాన్నే అమ్ముకోవాల్సిన పరిస్థితిని యెదుర్కొంటూ వ్యవస్థ మలచిన ‘పుండు’లాంటి మహిళలు, ‘పేగుబంధం’ సైతం డబ్బు సంబంధంగా మారిపోతే చూసే దిక్కులేక అనాథలయ్యే వయోవద్ధులు, భవిష్యత్తు అగమ్య గోచరమై దిక్కుతోచని విద్యార్థులు… చుట్టూ పరచుకొన్న విషాద వర్తమానం గుండెను కలచివేస్తే పుట్టిన కథలివి.

‘ఊరంటే వెన్నెల కోన. ఆత్మీయతల నిండు కుండ. ఆప్యాయతల పొదరిల్లు. అనురాగాల సరాగాల సందడి. పచ్చదనపు లోగిలి. ఊరంటే చెరువు కింద మడి. ప్రేమల్ని పంచె పేదరాశి పెద్దమ్మ. కమ్మని కథల్ని చెప్పి జోకొట్టే జోలపాట. కొత్తకుండలో వండిన పరమాన్నం. ఉగాదినాటి వేపచెట్టు గాలి. తల్లావు కనుసన్నల్లో చెంగు చెంగున గంతులు వేసే లేగదూడ. శ్రీరామనవమి నాటి గుడిగంట …’ రచయిత యెద లోతుల్లో పదిలంగా దాచుకున్న వూరి చిత్రం వాస్తవంలో చెదిరి అదశ్యమైపోవడంతో అతని గొంతులో పలికే దుఃఖపు జీర దాదాపు ప్రతి కథలోనూ కనిపిస్తుంది. కనిపించని కుట్రల్లో ఊళ్లు ఉరితాళ్ళయిన కఠోర వాస్తవం విషాదవాక్యమై అతణ్ణి నిలవనివ్వదు, వెంటాడుతుంది. ఒక విడవని రంధి నుంచి వొక వొడవని తండ్లాట నుంచి వొక వదలని ‘మనేద’ నుంచి వెలికి వచ్చిన కథనాలివి.

సిరిసిల్లలో ఒకే రోజు ముగ్గురు నేతన్నలు ఆత్మహత్య చేసుకోన్న సంఘటనని చూసి చలించి రాసిన (మరణ మదంగం) కథే కాదు, దారిద్య్ర రేఖని గీయడానికి అధికారులు పూటకో కొత్త పాలసీతో తయారైతే రేషన్ కార్డుకి కూడా గతిలేక ఆకలి చావుకు గురైన చెంద్రవ్వ కథ (ఆరుద్ర పురుగులు), వ్యవసాయం కోసం, కూతురి కట్నం కోసం అప్పుల పాలై పండించిన వరి నీళ్ళు లేక యెండిపోతే పంటకి నిప్పు పెట్టి అందులోనే దుంకి చనిపోయిన అయిలయ్య కథ (సజీవదహనం), బతుకు యెల్లక వున్న పొలం కాస్త అమ్ముకొని స్టోన్ క్రషర్ కూలీగా అనారోగ్యం పాలై జీవచ్ఛవంగా మారిన దేవయ్య కథ (పొక్కిలి), పైస మదంతో, అగ్రకుల దురహంకారంతో, పెత్తందారితనంతో చిన్న కులాల బడుగు బతుకుల్ని ఆగం చేసే వూరి పటేలుకీ అతని కొడుక్కీ యెదురు తిరిగిన కుమ్మరి వీరమల్లు, అతని కూతురు కవితల కథ (దడ్వత్), రాజకీయ బలంతో పోలీసుల అండతో మిత్తీల మీద మిత్తీలు గుంజే కాల్‌మనీ వ్యాపారుల కోరలకు చిక్కి విలవిలలాడే నీలవేణి కథ (పుండు)… యిలా అన్నీ తెలంగాణ నేల మీద అనునిత్యం కనిపించే యథార్థ వ్యథార్త గాథలే. అయితే వాటికి కథా రూపం యివ్వడానికి శ్రీధర్ తీసుకున్న శ్రద్ధ అపరిమేయం. ‘సజీవదహనం’ కథ చూడండి. వ్యావసాయిక జీవితంలో మునుం పట్టి నారు పీకే దగ్గర నుంచి నాట్లేయడం, కలుపు తీయడం, కోత కొయ్యడం వంటి పనులన్నీ స్త్రీలే చేస్తారు. ఆయా సందర్భాల్లో పని పాటతో ముడివడి వుంటుంది. జానపదుల పని పాటల లోతుల్ని దగ్గరగా చూసిన శ్రీధర్ వాటిని కథలోకి అలవోకగా తీసుకువచ్చాడు. కథకి వొక సాంస్క తిక వాతావరణాన్ని నిర్మించాడు. నీళ్ళు లేక యెండిన రైతు పొలాన్నీ అల్లుడి కట్నం ఆశకి బలై మోడువారిన అతని కూతురి జీవితాన్నీ జమిలిగా సమాంతరంగా కథనం చేసిన నేర్పు అబ్బుర పరుస్తుంది. కథ ముగిసే సరికి పాఠకుల గుండెలు దుఃఖంతో అవిసిపోతాయి. వస్తు శిల్పాల కలనేత విద్య ప్రతి పోగులోనూ కనిపిస్తుంది.

‘మరణ మదంగం’లో మూడు కథలు యేక కాలంలో నడుస్తాయి. శాంతినగర్ మల్లేశం, రాజీవ్ నగర్ శ్రీనివాస్, గాంధీ సెంటర్ చెంద్రం – ముగ్గురి సమస్యా వొకటే. మగ్గాలు పోయి సాంచెలు వచ్చినప్పటికీ యే చేనేత కార్మికుడి బతుక్కీ భరోసా లేదు. అవి కూడా నడవ్వు. కుటుంబాలు గడవ్వు. బతుకు యెల్లబారదు. ఒకప్పుడు ‘శాలోల్ల వాడలో ప్రతి ఇంట్ల మొగ్గం సప్పుడుతోని ‘పాకచెక్కలు’ ఆడుతుండె. రాట్నం ‘ెంటె’ గిర్ర గిర్ర తిరుగుతుండేది. ఊరందరికీ వాడుకమయ్యే దోతుల జోడలు, చీరెలు, కండువలు, లుంగీలు, సెల్లాలు, రుమాండ్లు… అన్నీ శాలోల్ల వాడకెల్లే వచ్చేటియి అప్పుడు చేతి నిండ పని, కడుపు నిండ బువ్వ, కంటి నిండ నిద్ర ఉండేది.’ కానీ యిప్పుడు ప్రతి యింట్లో మగ్గం చప్పుడును ‘మరణ మదంగం’ మింగేసింది. రచయిత అందుకు కారణాలని తరచి చూస్తున్నాడు. పాలకుల సంక్షేమ పథకాలేవీ నేతన్నల బతుకులో వెలుగు నింపటం లేదని ఆవేదన చెందుతున్నాడు. ఈ ఆవేదనే కథలో ప్రతి పదంలోనూ కనిపిస్తుంది.

అదే యితరత్రా సహానుభూతిగా వెల్లడవుతుంది.
‘ఆవురావురుమని పొలాలన్నీ నోరు తెర్సినప్పుడు వాన జాడ కనిపియ్యది. తీరా పంట చేతికచ్చే అదనుకు ఏ తుఫానో వచ్చి ఇర్గ వాన కొడ్తది. అంతా మన చేతిల లేని బతుకు. నీళ్ళే వుండయి. తప్పిదారి నీళ్లుంటే, దున్నుటానికి గోదలుండయి, గోదలుంటే ఇత్తునం ఉండది. యిత్తునాలుంటే మందు బస్తాలుండయి. అన్నీ ఉంటే పంటకు సరైన ధరే పలుకది.’ (ఆరుద్ర పురుగు) ఈ పరిస్థితి వ్యవసాయం దండగమారి పని అని తీర్మానించిన పాలకులున్న ప్రాంతంలో యెక్కడైనా వుండొచ్చు గానీ శ్రీధర్ దాన్ని తెలంగాణ నిర్దిష్టతలోంచి చూస్తాడు. అందుకు పరిష్కారాల కోసం సైతం తెలంగాణ సోయి నుంచే దేవులాడతాడు. ఆ క్రమంలో వొక్కోసారి రచయితే స్వయంగా కథలో పాత్రగా మారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తాడు. ‘అంతా తిరుగబడి పిడికిళ్ళు బిగించే దాకా రాజ్యపు గుండె బద్దలు కాదు. సామాన్యుని కడుపుకిన్ని గంజినీళ్ళు దొరకవు.’ అని రాజకీయ ప్రకటన చేస్తాడు. ప్రత్యేక తెలంగాణ రాజకీయ సందర్భ నేపథ్యం నుంచి చూసినప్పుడు మాత్రమే యీ కథల విశిష్టత అర్థమౌతుంది.

మలిదశ తెలంగాణ వుద్యమాన్నే యితివత్తం చేసుకొని వచ్చిన కథ ‘నాలుగు కోట్ల పిడికిళ్ళు’. తెలంగాణ సోయి నీళ్ళు నిధులు నియామకాల్ని పునాది చేసుకొని రాజకీయోద్యమంగా తీవ్రరూపం దాల్చినప్పుడు (2010) వచ్చిన కథ యిది. వాస్తవ పరిస్థితుల్ని జిల్లాలవారీ రిపోర్టింగ్ రూపంలో చెప్పిన కథలో రైతులు, దినసరి కార్మికులు, గిరిజనులు, వలస కూలీలు, ఫ్లోరోసిస్ బాధితులు, నేతన్నలు, గొల్ల కుర్మోల్లు లాంటి సబ్బండ వర్ణాల చప్పన్నారు వత్తులవారూ, వుద్యోగులు, విద్యార్థులు ‘మన రాజ్యం మనకు రావాలే’ అనీ ఏకైక నినాదంతో వలస పాలనకు వ్యతిరేకంగా కదలబారిన వైనం చిత్రితమైంది. తెలంగాణలోనే ఆయా ఉప ప్రాంతాలకు చెందిన నిర్దిష్ట సమస్యల్ని ఫోకస్ చేస్తూ అన్ని సమస్యలకూ పరిష్కారం రాష్ర్ట సాధనే అనే దక్పథంతో రాసిన యీ కథ దశాబ్దాల పాటు ఆర్ధిక రాజకీయ సాంస్క తిక రంగాల్లో తెలంగాణ ప్రజానీకం యెదుర్కొన్న దోపిడిని యెత్తిచూపిన వొక సజీవ డాక్యుమెంటరీ చిత్రం. ఉద్యమంలో చరిత్రాత్మక పాత్ర నిర్వహించిన ‘సకల జనుల సమ్మె’ ( 2011)కి దారితీసిన పరిస్థితికి అద్దం పట్టింది. అందుకే అది అన్ని వర్గాల వారినీ కలుపుకొని బిగిసిన ‘నాలుగు కోట్ల పిడికిళ్ళు’ గా పరిణమించింది. పది జిల్లాల కోట్ల ప్రజల వెతలకు ప్రాతినిధ్యం వహించే కథల్ని రచయిత వొకచోట గుచ్చి సూక్ష్మ దర్శినిలో చూపించాడు.

‘కొలువులు, నీళ్ళు, సౌకర్యాలు, హక్కులు అన్నీ మాయి మాకు బాజాప్తగా కావాలె. మాబతుకులు మేం బతకాలె …! ‘అని నినదించిన తన జాతి ప్రజల గుండె చప్పుడును శ్రీధర్ యీ కథలో బలంగా వినిపించాడు. అయితే పది జిల్లాల పది భిన్నమైన కథనాల్లో ఆయా ప్రాంతాలకు చెందిన భాషా వైవిధ్యాన్ని పాటించి వుంటే కథ మరింత నిండుగా విలక్షణంగా రూపొందేది. ఈ మాట యెందుకు అంటున్నానంటే -రాష్ట్రోద్యమ కాలంలో కవిత్వంలో కథలో తెలంగాణ భాష బలమైన సాంస్కృతిక వాహికగా ముందుకు వచ్చింది. అంతకు ముందు అల్లం రాజయ్య, బి. యస్. రాములు, రఘోత్తం, పి. చందులాంటి రచయితలెందరో విప్లవోద్యమ సాహిత్యావసరాల రీత్యా ‘మా బతుకుల గురించి మా పోరాటాల గురించి మేం మా భాషలోనే రాస్తాం, అది మా మౌలిక హక్కు’ అని వొక సైద్ధాంతిక అవగాహనతో సాహిత్య భాషా విధానాన్ని నినాద రూపంలో ప్రకటించినప్పటికీ తెలంగాణ అస్తిత్వ స్పహలోనే అది ఆచరణలో బలం పుంజుకుంది. తెలుగు భాష – తెలంగాణ భాష

రెండూ వేర్వేరు అని వాదించే స్థాయికి ఆ అవగాహన వెళ్ళింది. ఆ వాదనలోని శాస్త్రీయత గురించి చర్చలు కూడా జరిగాయి. కాల్పనికేతర రచనా ప్రక్రియల్లో కూడా తెలంగాణ భాష వాడకం పెరిగింది. తెలంగాణ భాషలోని విస్తత వైవిధ్యాన్నీ ప్రత్యేకతనీ యెత్తిచూపడానికి ఆ కథలో మంచి అవకాశం వుంది. ఉపయోగించుకుంటే అదొక ప్రయోగంగా కూడా భాసిల్లేది. కథ అలాగే రాయాలని చెప్పడం కాదు. ఇదొక పరిశీలన మాత్రమే. శ్రీధర్ కథల్లో వినిపించే సొంపైన కరీంనగర్ మాండలికం కథలకు స్థానీయతా పరిమళాన్ని అద్దటానికి యెంతగానో తోడ్పడింది. అది యీ కథలకున్న అదనపు బలం అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

ఒక్క మాట కాల్పనిక సాహిత్యంలో వాస్తవానికీ కల్పనకీ మధ్య దూరం ఉల్లిపొర మందమే. అతివేలమైన కల్పన ఇతివత్తం పట్ల విశ్వసనీయతని కోల్పోయేలా చేస్తుంది. కల్పన కూడా యథార్థమే అని భ్రమింపజేయడంలో రచయిత జాగరూకుడై వుంటాడు. సంఘటనల్లో సంభావ్యత పట్ల పాఠకులకు యే మాత్రం అనుమానం కల్గినా – కథనంలో యెంత నైపుణ్యం చూపినప్పటికీ – కథ రక్తి కట్టదు, సఫలం కాదు. ‘పుంజీతం’ కథలో తండ్రి పొలం అమ్ముకొని ఊరిడిచి వెళ్ళిపోయినా విషయం అమెరికాలో వున్న కొడుక్కి తెలీకపోవడం ఆశ్చర్యమే. అదీ 2016లో. రియల్ ఎస్టేట్ దందాని నేపథ్యం చేసుకొని వచ్చిన యీ కథా కాలాన్ని ఊరికీ ఖండాంతరాలకీ కమ్యునికేషన్ అంతగా లేని రోజుల్లోకి తీసుకు వెళ్ళి వుంటే బాగుండేది. ‘అమృతవర్షిణి’లో సమాజ సేవిక ఎయిడ్స్ రోగిని పెళ్లి చేసుకొనే సంఘటన కూడా అటువంటిదే.

తనకిష్టమైన కథల్ని యెంచుకొని విమర్శకుడిగా వాటి పాఠ్యం లోతుల్లోకి వెళ్ళి వ్యాఖ్యానించే క్రమంలో శ్రీధర్ యిప్పుడు మంచి కథల్లో ప్రతిఫలించే సామాజికతనీ, కథా నిర్మాణంలోని కళామర్మాన్నీ తాను స్వయంగా తెలుసుకొని పదుగురికీ పంచుతున్నాడు. (చూ. సారంగ, వెబ్ మాగజైన్). ఈ క్రమంలో తన కథల మంచి చెడుల గురించి కూడా తానే స్వయంగా విశ్లేషించుకోగలడు. వీటిలో కొన్ని ముందు ముందు అతనికే నచ్చకపోవచ్చు. కానీ తొలి అడుగుల ముచ్చటయెట్లైనా గొప్పదే. ప్రతి సంవత్సరం తెలంగాణ కథల వార్షిక సంపాదకుడిగా వుత్తమ కథల ఎంపికలో వందలాది కథల్ని శ్రీధర్ పరిశీలిస్తున్నాడు, వడగడుతున్నాడు. స్వయంగా విమర్శకుడైన కారణంగా వస్తు రూపాల పరంగానే కాదు దక్పథ పరంగా కూడా తనను తాను గీటురాయి మీద పరీక్షించుకుంటున్నాడు.

ఆ కారణంగానే తొలిరోజుల ‘అమతవర్షిణి’ నుంచి యిటీవలి కాలంలో రాసిన ‘గుండె కింది నది’ వరకు దాదాపు వొక పుష్కర కాలంలో తాను సాధించిన గుణాత్మకమైన పరిణతిని అంచనా వేసుకోగలడు. ఎవరి సర్టిఫికేట్లు అతనికి అవసరం లేదు. అతనిలోని యీ పరిణతి మరింత దఢమై బలం పుంజుకుంటుందని యీసంపుటిలోని కథలే హామీ యిస్తున్నాయి. రచయితగా శ్రీధర్ పీడిత ప్రజల పక్షపాతిగానే కొనసాగుతాడని భరోసానిస్తున్నాయి. పులుల వాత పడి ప్రాణాలు కోల్పోతున్న మేకల కోసం కథల మాధ్యమంగా గొంతు సరాయించుకుంటున్న నా యువ కథక మిత్రుడికి సాదర ఆహ్వానం చెబుతూనే… చివరగా మరొక్క మాట – యివ్వాళ ‘పుంజీతం’లో ఆటగాళ్ళు మారారు – ‘రూల్’ మారింది గానీ ఆట మారలేదు, ఆట తీరు మారలేదన్న అవగాహనతో, మేకలకు పులుల్ని కట్టడి చేయడానికి అవసరమైన సత్తువనీ యెరుకనీ కల్గించే దిశగా ముందు ముందు మరిన్ని మంచి కథల్ని డా. శ్రీధర్ నుంచి ఆశిస్తూ …

Punjitam Stories Book Written by Dr Veldanda Sridhar