Home ఖమ్మం కులంతో కాదు.. ప్రజా బలంతో గెలవగలం

కులంతో కాదు.. ప్రజా బలంతో గెలవగలం

puvvada-ajay-kumar
వనసమారాధనలో మంత్రులు, పువ్వాడ, ఈటెల

ఖమ్మం రూరల్ : ముదిరాజ్‌లకు ఆత్మ గౌరవం, అభ్యున్నతికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని వెంకటగిరిలోని కాళ్ల రామారావు మామిడితోటలో ముదిరాజ్‌ల వన సమారాధన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పువ్వాడ, ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలు బాగుండాలనే లక్ష్యంతో సిఎం కెసిఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. బడుగులు, బలహీనులు, బిసిలకు చట్ట సభల్లో, లోకల్ బాడీల్లో ప్రాతినిధ్యం లభించాలని ఆయన పేర్కొన్నారు.

ముదిరాజ్‌లు ఇండిపెండెంట్లుగా పోటీ చేయాల్సిన అవసరం లేదని, తమ ప్రభుత్వమే గుండెల్లో పెట్టి గెలిపించుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో గౌడ్స్, యాదవ్‌ల భవనాల కోసం స్థలం ఇచ్చినట్టుగానే, ముదిరాజ్‌ల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి స్థలం ఇప్పిస్తానన్నారు. ముదిరాజ్‌ల సమస్యల పరిష్కారానికి, కృషి చేస్తానని ఆయన తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ…కులంతో కాదు ప్రజ బలంతోనే గెలవగలమని, అందరూ దీవిస్తేనే ఇది సాధ్య పడుతుందన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ పుట్టిందే నీళ్ల కోసం అని, ఆ నీటిని నమ్ముకొని బతుకు ఇడ్చే ముదిరాజ్‌లకు ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ముదిరాజ్‌లతో చక్కని సాన్నిహిత్య బంధం ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిలు నామ నాగేశ్వరరావు, బండా ప్రకాష్, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంఎల్‌సి బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, ముదిరాజ్ సంఘం జిల్లా నాయకుడు డాక్టర్ పాపారావు, రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండాల కృష్ణ, కార్పొరేటర్ దోరెపల్లి శ్వేత, ముదిరాజ్ సంఘం నాయకులు జానకి రాములు, వెంకటనర్సయ్య, జగన్‌మోహన్, నరాల మన్సుర్, తదితరులు పాల్గొన్నారు

Puvvada said he would work to solve Mudiraj problems