Home ఎడిటోరియల్ సమానత్వమే మేలైన బాట

సమానత్వమే మేలైన బాట

sampadakeyam

నేపాల్ ఒకప్పటిలా భారతదేశ పెరడుకాదు చెప్పినట్లు నడుచుకోటానికి. రాచరిక వ్యవస్థ అంతమై రిపబ్లిక్‌గా అవతరించిన తదుపరి కొత్త ప్రజాస్వామ్య రాజ్యాంగంతో ఇప్పుడు పూర్తిస్థాయిలో కమ్యూనిస్టుల పరిపాలనలో ఉంది. ఫిబ్రవరి ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యునైటెడ్ మార్కిస్టు లెనినిస్ట్), ప్రచండ నాయకత్వంలోని సిపిఎన్ (మావోయిస్టు) కలిసి పోటీ చేసి సంపూర్ణ మెజారిటీ సాధించటం, రెండు పార్టీలు ఒకే పార్టీగా విలీనం కావాలని నిర్ణయించుకోవటం నేపాల్ రాజకీయాల్లో గుణాత్మక మార్పు. భారత ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే నేపాలీ కాంగ్రెస్ కమ్యూనిస్టుల ఐక్యతవల్ల ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రధాని ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ శుక్ర, శనివారాల్లో ఢిల్లీ పర్యటనకు వచ్చారు. గతంలో సంకీర్ణ ప్రభుత్వ ప్రధానిగా భారత్ సందర్శించిన నాటికన్నా ఇప్పుడు ఓలీ బలమైన స్థితిలో ఉన్నాడు. ఇందుకు రెండు ప్రధాన కారణాలు. ఒకటి, బలమైన పార్టీ ప్రభుత్వ అధినేతగా ఉండటం. రెండు, మరో పొరుగు దేశమైన చైనాతో సంబంధాలు పటిష్టం కావటం. నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో భారత ప్రభుత్వ జోక్యం కాఠ్మండును చైనాకు చేరువ చేసింది. కొత్త రాజ్యాంగంలో తమకు అనుకూలమైన మార్పులు డిమాండ్ చేస్తూ, తెరాయి ప్రాంతంలో నివసించే మధేసీలు లేదా భారత సంతతి ప్రజలు 2015 సెప్టెంబర్ 23 నుంచి 2016 ఫిబ్రవరి 8 వరకు సాగించిన నేపాల్ దిగ్బంధనం భారత్ నేపాల్ సంబంధాలను తీవ్రంగాదెబ్బతీసింది. దిగుమతులకు భారత్ ద్వారా రహదారులపై పూర్తిగా ఆధారపడి ఉన్న నేపాల్ ఆర్థిక జీవనాన్ని ఆ దిగ్బంధనం అతలాకుతలం చేసింది. ఆ దిగ్బంధనానికి న్యూఢిల్లీ పూర్తి మద్దతు బహిరంగ రహస్యం. నేపాల్‌పై ఒత్తిడి తేవాలని భారత ప్రభుత్వం కోరుకుంటే అది విరుద్ధ ఫలితమిచ్చింది. నేపాల్ చైనాకు దగ్గరగా జరిగింది. చైనాతో నేపాల్ కుదుర్చుకున్న వాణిజ్య, రవాణా ఒప్పందం ప్రకారం టిబెట్‌లోని షిగస్తే నుంచి కాఠ్మండుకు రైలు మార్గాన్ని చైనా నిర్మిస్తుంది. దాని నిర్మాణం పూర్తియితే ఆ హిమాలయ రాజ్యానికి ప్రత్యామ్నాయ సరఫరాల మార్గం ఏర్పడుతుంది. దాంతో భారతదేశంపై పూర్తిగా ఆధారపడటం తగ్గుతుంది. అంతేగాక చైనా ‘ఒక బెల్టు ఒక రహదారి’ ప్రాజెక్టులో నేపాల్ చేరింది. ఈ ప్రాజెక్టు ఆక్రమిత కశ్మీర్ గుండా వెళుతుందన్న కారణంతో భారత్ దానికి దూరంగా ఉండటం గుర్తు చేసుకోదగింది.
ఇక్కడ మరో విషయం గమనార్హం. ఫిబ్రవరిలో ప్రధానమంత్రి అయిన ఓలీ తమ దేశ పర్యటనకు ఆహ్వానించిన తొలి విదేశీ ప్రభుత్వ నేత పాకిస్థాన్ ప్రధాని షహీద్ కఖ్వాన్ అబ్బాసి. 2016లో పాకిస్థాన్‌లో జరగాల్సిన సార్క్ శిఖరాగ్ర సభను భారత్ ప్రభుత్వం బహిష్కరించగా, పలు సభ్య దేశాలు అనుసరించాయి. ఇప్పడు ఆ పరిస్థితి ఉందని చెప్పలేము. శ్రీలంక, మాల్దీవులు, సెషెల్స్ చైనాకు సన్నిహితమైనాయి. నేపాల్ కూడా దూరమైతే మన విదేశాంగ విధానం ఎక్కడ, ఎందుకు ఘోరంగా విఫలమైందో భారత ప్రభుత్వం అంతర్మథనం జరపక తప్పదు.
ఓలీ ఢిల్లీ పర్యటనకు బయలుదేరే మూడు రోజుల ముందు తమ పార్లమెంటులో ప్రసంగిస్తూ, నేపాల్ ఆత్మగౌరవం, ప్రతిష్ట, జాతీయ ప్రయోజనానికి విరుద్ధంగా ఏ ఒప్పందంపై తాను సంతకం చేయబోనని చెప్పారు. పొరుగు దేశాలతో నేపాల్ సంబంధాలు “పరస్పర మేలు, పరస్పర గౌరవం, సమానత్వం, ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం బే జోక్యం” ప్రాతిపదికపై ఉంటాయని వక్కాణించారు. “అపనమ్మికకు తావులేని ఆధారనీయ సంబంధాలను” భారత్‌తో కోరుకుంటున్నానని చెప్పిన నేపాల్ ప్రధాని ‘మమ్ము సమానులుగా పరిగణించండి, మా దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించండి, మా వ్యవహారాల్లో తలదూర్చకండి’ అని భారత్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చారు.
రక్సాల్ (బీహార్) నుంచి కాఠ్మండుకు రైలు మార్గ నిర్మాణం, నేపాల్‌కు సముద్రాన్ని సంధానిస్తూ జలమార్గం నిర్మాణం, నేపాల్‌లో వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటు ఓలీ పర్యటన సందర్భంలో కుదిరిన అంగీకారాలు. ఓలీ తొలి విదేశీ పర్యటన ఢిల్లీయేనని భారత ప్రభు త్వం సంతృప్తి చెందివచ్చుగాక. అయితే 21వ శతాబ్దపు వాస్తవికతలు ప్రాతిపదికపై భారత్‌తో ‘విశ్వాస సౌధాన్ని’ నేపాల్ కోరుకుంటున్నది. కాబట్టి భారత ప్రభుత్వం కూడా పాత ఆలోచనలనుంచి వైదొలిగి కొత్త వాస్తవికతలతో పని చేయటమే ఇరుదేశాల మధ్య సంబంధాల మెరుగుదలకు, వృద్ధికి బాట వేస్తుంది.