Home ఆఫ్ బీట్ పొగాకు మానాలనుకుంటున్నారా..?

పొగాకు మానాలనుకుంటున్నారా..?

 

To quit tobacco use/smoking, call 1800-11-2356

Quit tobacco: Call Toll Free No – 1800-11-2356

మాకు ఫోను చేయండి
పొగాకు వ్యసనపరులకు ప్రభుత్వ కౌన్సెలింగ్
సిగరెట్ పెట్టెలపైనే టోల్‌ఫ్రీ నెంబర్ ‘1800-11-2356’

హైదరాబాద్: పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నియంత్రించటానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. ‘వ్యసనాన్ని మానాలనుకునే వాళ్ళు మాకు ఫోనుచేయండి.. సలహాలిస్తాం’ అంటూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఆ మేరకు పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ప్రత్యేక నెంబరును ముద్రించాలని నిర్ణయించింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి తయారయ్యే అన్ని పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ‘1800-11-2356’ అనే క్విట్ లైన్ నెంబర్‌ను ప్రచురిస్తున్నారని పొగాకు నియంత్రణ కోసం పనిచేస్తోన్న స్వచ్ఛంద ఆరోగ్య సంస్థ (వాలంటరీ హెల్త్ అసోసియేషన్) వెల్లడించింది. పొగాకు అలవాటు ఉన్నవాళ్లను ఆ వ్యసనం నుంచి బయటపడవేసేందుకు అవసరమైన కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ‘క్విట్ లైన్ ఫోన్ నెంబర్’ను ప్రచురించాలని నిర్ణయించింది. ధూమపానం, పొగాకు, వాటి ఉత్పత్తులను నమలడం వంటి వ్యసనాల నుంచి బయటపడాలనుకునే వాళ్లు ఈ నెంబర్‌కు ఫోన్ చేస్తే తగిన సాయం అందుతుంది.

ఇప్పటివరకు ప్రపంచంలో 46 దేశాలు పొగాకు ఉత్పత్తులపై ఇటువంటి క్విట్ లైన్ నెంబర్లను ప్రచురిస్తుండగా, ఆసియా ఖండంలో థాయ్‌లాండ్, మలేషియా, సింగపూర్ మాత్రమే ఇలాంటి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు ఆ దేశాల సరసన భారత్ చేరుతోంది. సిగరెట్లు, బీడీలు, చుట్టలు ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల మన దేశంలో ఏటా దాదాపు 10 లక్షల మంది చనిపోతున్నారని సర్వేలు చెపుతున్నాయి. ఆ దురలవాటు నుంచి బయట పడాలనుకుంటున్నా చాలామంది మానుకోలేకపోతున్నారు. ఇప్పటికే అన్ని పొగాకు ఉత్పత్తులపై ‘పొగాకు క్యాన్సర్ కారకం’, ‘పొగాకు వల్ల బాధాకరమైన మరణం సంభంవిస్తుంది’ వంటి హెచ్చరికలు, వాటివల్ల కలిగే దుష్పరిమాణాలు, వ్యాధుల ఫోటోలతో సహా ప్రముఖంగా ప్రచురిస్తున్నారు. ఈ ప్రకటనలు ప్యాకెట్లపై దాదాపు 85 శాతం స్థలాన్ని ఆక్రమిచేలా ఉండాలని గతంలో నిర్ణయించారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో 2016 ఏప్రిల్ నుంచి ఫోటోలతో కూడిన ఈ హెచ్చరికలను పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ప్రచురిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులపై అనారోగ్య సంబంధిత హెచ్చరికలను ప్రచురించడంలో భారత్ మూడో స్థానంలో ఉన్నట్లు కెనడా క్యాన్సర్ సొసైటీ విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడిస్తోంది. మొత్తం 205 దేశాల్లో మన దేశానికి మూడో స్థానం రావడం విశేషం.